Begin typing your search above and press return to search.

సాఫ్ట్ వేర్ల ప్రేమ పగలా మారింది ఎందుకు? ఇద్దరి చావుకు కారణమేంటి?

By:  Tupaki Desk   |   10 May 2022 7:30 AM GMT
సాఫ్ట్ వేర్ల ప్రేమ పగలా మారింది ఎందుకు? ఇద్దరి చావుకు కారణమేంటి?
X
నెల్లూరు జిల్లా తాటిపర్తి గ్రామానికి చెందిన కావ్య, సురేష్ లు సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు. సురేష్ బెంగళూరులో, కావ్య పుణేలో ఉద్యోగం చేస్తున్నారు. గతంలో వీరిద్దరూ బెంగళూరులోనే కలిసి పనిచేశారు. అప్పుడే కావ్యను చూసి ఇష్టపడ్డాడు సురేష్. అయితే కావ్య పెద్దగా పట్టించుకోలేదు. కావ్య పుణేకు వెళ్లాక సురేష్ లో ప్రేమ ఎక్కువైంది. అనంతరం వర్క్ ఫ్రం హోంతో తన ఊరికే రావడంతో ఆమె కోసం పరితపించాడు. కావ్యను పెళ్లిచేసుకుంటానని సురేష్ తన కుటుంబంతో అడిగించినా ఆమె నిరాకరించింది. దీంతో కసితో రగిలిపోయి కావ్యను చంపి తనూ ఆత్మహత్య చేసుకున్నాడు.

సురేష్ ను కావ్య పెళ్లి చేసుకోకపోవడానికి ప్రధాన కారణం ఏంటన్నది వారి బంధువుల ద్వారా బయటపడింది. సురేష్ వయసు 35 సంవత్సరాలు కాగా.. కావ్య వయసు కేవలం 22 ఏళ్లే. అందుకే ఈ భారీ వయసు తేడా వల్లనే పెళ్లికి అంగీకరించలేదని తెలిసింది. కావ్యకు ఇష్టమైతే పెళ్లికి అభ్యంతరం లేదని ఆమె తల్లిదండ్రులు తెలిపారు. కానీ సురేష్ వయసు ఎక్కువ కావడం.. పైగా ప్రవర్తన సరిగా లేకపోవడంతోనే కావ్య అతడి పెళ్లి ప్రపోజల్ ను తిరస్కరించినట్టు బంధువులు తెలిపారు. అదే పగగా మారి ఆమెను చంపి అతడు చనిపోవడానికి దారితీసిందని చెబుతున్నారు.

తనను పెళ్లి చేసుకోవడం లేదని కక్ష గట్టి తోటి సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కావ్యను తుపాకీతో కాల్చి చంపాడు టెక్కీ సురేష్. నెల్లూరు జిల్లాలో జరిగిన ఈ హత్య సంచలనమైంది. ప్రేమించడం లేదని..పెళ్లికి నిరాకరించిందని కావ్యను సురేష్ కాల్చి.. తనకు తాను కాల్చుకొని చనిపోయాడు. ప్రస్తుతం ఈ ఇద్దరి మృతదేహాలను నెల్లూరు జీజీహెచ్ కు తరలించారు. ఉదయం 10 గంటలకు కావ్య, సురేష్ మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించనున్నారు.

అయితే సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అయిన సురేష్ కు అమెరికా తయారు చేసిన తుపాకీ ఎలా వచ్చిందన్నది ఇప్పుడు అసలు ప్రశ్నగా మారింది. పోలీసులు ఈ కోణంలోనే విచారణ జరుపుతున్నారు. సురేష్ ఫోన్ కాల్స్, మెసేజ్ ల ఆధారంగా విచారణ జరుపుతున్నారు. సురేష్ రెడ్డి వద్ద ఎప్పటి నుంచి పిస్టోల్ ఉంది. రెండు మ్యాగజైన్స్ బుల్లెట్లు ఎక్కడివి అనేవి ప్రస్తుతం అనుమానంగా మారింది.

సురేష్ రెడ్డి బెంగళూరులో సాఫ్ట్ వేర్ ఉద్యోగి కావడంతో అక్కడి నుంచి పిస్టోల్ తీసుకువచ్చాడనే కోణంలో విచారణ జరుపుతున్నారు. తుపాకీపై 'మేడ్ ఇన్ యూఎస్ఏ' అని ఉండడంతోపాటు స్టార్ గుర్తును పోలీసులు గుర్తించారు. పక్కా ప్లాన్ ప్రకారమే కావ్యను హత్య చేసినట్లు ప్రాథమిక విచారణలో గుర్తించారు.

ఇక యువ టెక్కీ కావ్య హత్యతో ఆ గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా పోలీసులు ముందస్తు బందోబస్తు ఏర్పాటు చేశారు. కావ్య, సురేష్ మృతదేహాలకు ఈరోజు అంత్యక్రియలు జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదన్న అక్కసుతో ప్రేమించిన యువతిని యువకుడు సురేష్ కాల్చి చంపాడు.