Begin typing your search above and press return to search.

రాజమహేంద్రవరం మాదిరే సింహపురి కూడా..

By:  Tupaki Desk   |   7 Aug 2015 4:14 AM GMT
రాజమహేంద్రవరం మాదిరే సింహపురి కూడా..
X
గోదావరి మహా పుష్కరాల ముగింపు సందర్భంగా రాజమండ్రి నగరానికి.. చారిత్రకంగా ఎన్నో ఏళ్ల కిందట పిలిచిన రాజమహేంద్రవరం పేరును ఖాయం చేస్తున్నట్లుగా ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొనటం తెలిసిందే. భావోద్వేగ నిర్ణయాలతో ప్రజల మనసుల్ని దోచుకునే అలవాటు లేని చంద్రబాబు అందుకు భిన్నంగా.. చరిత్రకు పెద్ద పీట వేసి.. సెంటిమెంట్ రగిలించేలా రాజమండ్రి పేరును మార్చాలని తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమైంది.

రాజమండ్రి పేరు మార్పు విషయంలో వచ్చిన సానుకూల స్పందన చూసిన చంద్రబాబు.. మరికొన్ని పట్టణాల పేర్లను కూడా మార్చాలన్న ఆలోచనలో ఉన్నట్లుగా చెబుతున్నారు. చరిత్రలో సుపరిచితమైన పేర్లను తిరిగి పునరుద్ధరించేలా చర్యలు తీసుకోవాలని ఆయన భావిస్తోన్నట్లు తెలుస్తోంది.

వాడుకలో పేరు మారిపోయిన ఎన్నో పట్టణాలు తెలుగు నేల మీదున్నాయి. వాటిల్లో ఇప్పటికి కొన్ని పేర్లను ఆయా స్థానిక ప్రాంతాల ప్రజలు తరచూ గుర్తు చేసుకుంటూ ఉంటారు. అలాంటి వాటిల్లో నెల్లూరు పట్టణాన్ని ‘‘సింహపురి’’గా.. ఏలేరును ‘‘హేలపురి’’.. కర్నూలును ‘‘కందెనవోలు’’.. కడపను ‘‘దేవుడి గడప’’ పేర్లను వ్యవహరిస్తుంటారు.

ఇందులో రాజమహేంద్రవరం మాదిరి.. నెల్లూరు పట్టణాన్ని సింహపురిగా వ్యవహరించేలా ఏర్పాట్లు చేయాలని ఏపీ ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించినట్లు చెబుతున్నారు. నెల్లూరుతో పాటు.. సెంటిమెంట్ రగిల్చే అవకాశం ఉన్న పట్టణాలకు ఉన్న పేర్లను ఒక్కసారి పరిశీలించి.. ప్రతిపాదనలు చేయాలని పేర్కొన్నట్లుగా చెబుతున్నారు. నెల్లూరు పేరును మాత్రం సింహపురిగా వ్యవహరించాలన్న నిర్ణయం మాత్రం జరిగిపోయిందని చెబుతున్నారు. మొత్తానికి చంద్రబాబు ప్రజల మనసుల్ని దోచుకునే నిర్ణయాలు వరుసగా తీసుకోవటం కాస్తంత ఆసక్తికరమే.