Begin typing your search above and press return to search.

జ‌గ‌న్ ఎందుకు సీఎం కాలేదో చెప్పేసిన ఎమ్మెల్యే

By:  Tupaki Desk   |   27 April 2017 3:35 AM GMT
జ‌గ‌న్ ఎందుకు సీఎం కాలేదో చెప్పేసిన ఎమ్మెల్యే
X
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు చేశారు. నెల్లూరులో జ‌రిగిన పార్టీ కార్య‌క‌ర్త‌ల స‌మావేశంలో ఎంపీ మేక‌పాటి రాజ‌మోహ‌న్ రెడ్డి, ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాద‌వ్ మాట్లాడారు. ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి ప్రారంభ ఉప‌న్యాసం మాట్లాడుతూ రోజురోజుకి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై వ్యతిరేకత పెరిగిపోతోందని, ప్రజలు ఆయనను భరించే పరిస్థితుల్లో లేరని చెప్పారు. ఎన్నికల్లో చేసిన ఏ వాగ్దానాన్నీ నెరవేర్చకుండా ప్రజలను మభ్యపెడుతున్న బాబుపై తీవ్ర వ్యతిరేకత వస్తుందన్నారు. ఆ వ్యతిరేకతను వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు కైవ‌సం చేసుకోవాల‌ని మేక‌పాటి సూచించారు.

చంద్ర‌బాబు ప‌దవి చేపట్టిన నాటి నుంచి రాష్ట్రంలో కరువు తాండవిస్తోందని మేక‌పాటి అన్నారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో ప్రాజెక్టులన్నీ జలకళతో కళకళలాడాయన్నారు. రాబోయే ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి డూ ఆర్‌ డై అని, యుద్ధ స్ఫూర్తితో పోరాడాలన్నారు. పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావడం, డాక్టర్‌ అనిల్‌కుమార్‌యాదవ్‌ నగర శాసనసభ్యుడిగా ఎన్నికవడం తధ్యమని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రానికి ద్రోహం చేస్తూ ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తున్న వారిపై గెలిచి తీరాల్సిన అవసరం ప్రతి పౌరుడిపై ఉందని ఎంపీ అన్నారు. రాయలసీమలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. నెల్లూరులోని 10 నియోజకవర్గాలతోపాటు రెండు ఎంపీ స్థానాల్లో అత్యధిక మెజార్టీ తీసుకురావాలన్నారు.

నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌యాదవ్‌ మాట్లాడుతూ...గత ఎన్నికల్లోనే జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావాల్సి ఉందని, అయితే మరింత కాలం ప్రజా సమస్యలను తెలుసుకుని పరిష్కార మార్గాల్లో అనుభవం సాధించేందుకే భగవంతుడు ప్రతిపక్షనాయకుడిగా అవకాశం ఇచ్చాడేమోనని అన్నారు. రానున్న ఎన్నికల్లో జగనన్న ముఖ్యమంత్రి కావడం ఖాయమని, దివంగత మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డిలాగా మెరుగైన పాలన జగనన్న అందిస్తారని అభిప్రాయపడ్డారు. గత ఎన్నికల్లో తన విజయానికి కృషి చేసిన కార్యకర్తలకు ఏమిచ్చినా రుణం తీరదన్నారు. కష్టాల్లో ఉన్నప్పుడు ధైర్యం చెప్పే వారే అసలైన సైనికులని పేర్కొన్నారు.