Begin typing your search above and press return to search.

నెల్లూరు ఎంపీ సీటు ఎవ‌రికి... టీడీపీలో చ‌ర్చ‌...!

By:  Tupaki Desk   |   3 Nov 2022 3:56 AM GMT
నెల్లూరు ఎంపీ సీటు ఎవ‌రికి... టీడీపీలో చ‌ర్చ‌...!
X
నెల్లూరు కీల‌క‌మైన పార్ల‌మెంటు స్థానం. రాజ‌కీయంగా ఇక్క‌డ టీడీపీకి మంచి ఫాలోయింగ్ ఉంది. అయితే.. 1999 త‌ర్వాత ఇక్క‌డ టీడీపీ ఈ పార్ల‌మెంటు స్థానాన్ని గెలుచుకోలేక పోయింది. 1989 నుంచి జ‌రిగిన ఎన్నిక‌ల‌ను చూసుకుంటే ఎక్కువ సార్లు కాంగ్రెస్ ఇక్క‌డ విజ‌యం సాధించింది. 1998, 1999 ఎన్నిక‌ల్లో మాత్ర‌మే టీడీపీ ఇక్క‌డ గెలుపు గుర్రం ఎక్కింది. అయితే, బీద సోద‌రులు ఇద్ద‌రూ టీడీపీలో ఉన్న‌ప్పుడు.. ఒకింత బ‌ల‌ప‌డిన సంకేతాలు వ‌చ్చాయి. దీంతో టీడీపీలోనూ ఆశ‌లు చిగురించాయి. గ‌త ఎన్నిక‌ల్లో బీద మ‌స్తాన్‌రావుకు టికెట్ ఇచ్చారు. ఆయ‌న గెలుపు ఖాయ‌మ‌నే ప్ర‌చారం కూడా జ‌రిగింది. అయితే, ఆయ‌న ప‌రాజ‌యం పాల‌య్యారు.

రాజ‌కీయంగా ఆయ‌న టీడీపీలోనే ఉండి ఉంటే ప‌రిస్థితి మ‌రోలా ఉండేది. కానీ, ఆయ‌న అలా చేయ‌లేదు. వెంట‌నే వెళ్లి వైసీపీలో చేరిపోయారు. ప్ర‌స్తుతం రాజ్య‌స‌భ స‌భ్యుడిగా ఉన్నారు. ఇక‌, బీద ర‌విచంద్ర యాద‌వ్ ఉన్నా ఆయ‌న పార్ల‌మెంటు స్థాయిలో పోటీ ఇచ్చే ప‌రిస్థితి లేదు. మ‌రోవైపు వైసీపీ ఎంపీ ఆదాల ప్ర‌భాక‌ర్‌రెడ్డి దూకుడు ఎక్కువ‌గానే ఉంది. ఆయ‌న వివి ధ కార్య‌క్ర‌మాల‌తో ఆక‌ట్టుకుంటున్నారు. దేవాల‌యాల‌కు నిధులు ఇస్తున్నారు. ప్ర‌జ‌ల‌ను కూడా ఆదుకుంటున్నారు. దీంతో ఆయ‌న జోష్‌ను క‌ట్ట‌డి చేసి.. పార్ల‌మెంటు స్తానాన్ని కైవ‌సం చేసుకోవ‌డం ఎలా? అనే అంశంపై ఇటీవ‌ల చంద్ర‌బాబు సమీక్షించారు. అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల స్థాయిలో నాయ‌కులు ఉన్నా పార్ల‌మెంటు స్థాయిలో మాత్రం నాయ‌కుడు క‌నిపించ‌లేదు.

దీంతో కొత్త‌వారికి అవ‌కాశం ఇస్తారా? లేదా.. ఇదే జిల్లాకు చెందిన ఎవ‌రినైనా పారిశ్రామిక వేత్త‌ను ప్రోత్స‌హించాలా? అనే విష‌యాన్ని కూడా చ‌ర్చించారు. చివ‌ర‌కు ఈ విష‌యం ఎటూ తేల‌లేదు. దీంతో ఇప్ప‌టికి దీనిని చంద్ర‌బాబు వ‌ద్దే పెట్టుకున్నారు. ఇక‌, వ‌చ్చే ఎన్నిక‌ల‌కు స‌మ‌యంలో పెద్ద‌గా లేదు. ఎవ‌రినైనా ఎంపిక చేయాల‌ని స్థానిక నాయ‌క‌త్వం బ‌లంగా కోరుతోంది. ఈ క్ర‌మంలో సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్‌రెడ్డి పేరు బ‌లంగా వినిపిస్తోంది. రెడ్డి సామాజిక వ‌ర్గంలో బ‌ల‌మైన నాయ‌కుడుగా ఆయ‌న కు పేరుంది. జిల్లా వ్యాప్తంగా కుటుంబ సంబంధాలు కూడా బాగానే ఉన్నాయి. ఆయ‌న‌కు ఇస్తే మంచిదే. కానీ, అసెంబ్లీ ఎన్నిక‌ల్లోనే ఆయ‌న ఐదు సార్లు ఓడిపోయారు.

ఈ ప‌రిణామం సోమిరెడ్డి విష‌యంలో పెద్ద‌మైన‌స్‌గా మారింది. క‌నీసం ఆయ‌న రెండు సార్ల‌యినా గెలిచి ఉంటే(గ‌త ఐదు ఎన్నిక‌ల్లో) ఆయ‌నకు ఇస్తే బాగుంటుంద‌నేది కొంద‌రి అభిప్రాయం. కాదు, అసెంబ్లీకి గెల‌వ‌లేనంత మాత్రాన పార్ల‌మెంటుకు గెల‌వ‌లేర‌నేది ఏముంది? అనేది మ‌రో వాద‌న దీంతో సోమిరెడ్డి పేరు ప్ర‌స్తుతానికి ప‌రిశీల‌న‌కు తీసుకున్నారు.

ఇక‌, సోమిరెడ్డి ప్రాతినిద్యం వ‌హిస్తున్న అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గంలో ఆయ‌న కుమారుడికి అవ‌కాశం ఈ సారి త‌థ్య‌మ‌నే మాట వినిపిస్తోంది. ఈ క్ర‌మంలో ఓడినా గెలిచినా వేరే వారిని తీసుకురావ‌డం క‌న్నా.. సోమిరెడ్డి అయితే నే బెట‌ర్ అని చంద్ర‌బాబు అనుకుంటే ఆయ‌న‌కు ఎంపీ టికెట్ ఖాయ‌మ‌ని చెబుతున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.