Begin typing your search above and press return to search.

హుందాత‌నం అంటే ఇదేనా బాబు?

By:  Tupaki Desk   |   10 Aug 2017 4:31 PM GMT
హుందాత‌నం అంటే ఇదేనా బాబు?
X
నీతులు చెప్ప‌టం ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు అల‌వాటే. నోరు తెరిస్తే చాలు.. త‌న హుందా రాజ‌కీయాల గురించి.. త‌న పెద్ద‌రికం గురించి అదే ప‌నిగా గొప్ప‌లు చెప్పుకుంటూ ఉంటారు. నిజానికి ఇలాంటివ‌న్నీ బాబు గురించి వేరెవ‌రైనా చెప్పాలి. కానీ.. బాబు మాత్రం.. త‌న గురించి తాను చెప్పుకుంటుంటారు. త‌న లాంటి సీనియ‌ర్ తెలుగు రాష్ట్ర రాజ‌కీయాల్లో లేర‌ని గొప్ప‌లు చెప్పుకుంటూ.. త‌న రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థి గురించి చుల‌క‌న‌గా మాట్లాడేస్తుంటారు. అధినేత‌కు త‌గ్గ‌ట్లే తెలుగు త‌మ్ముళ్లు సైతం తమ వెకిలిత‌నాన్ని దాచుకోకుండా బ‌య‌ట‌పెడుతుంటారు.

తాజాగా అలాంటి వెకిలి ప‌ని ఒక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చింది. ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన మాట‌ను నిల‌బెట్టుకోని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు మీద విప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ తీవ్ర వ్యాఖ్య చేశారు. దీనిపై అదే ప‌నిగా విషం క‌క్కుతున్న టీడీపీ శ్రేణులతో పాటు.. పార్టీ అధినేత చంద్ర‌బాబు సైతం గుండెలు బాదేసుకుంటున్నారు.

త‌న లాంటి నేత‌ను అంతేసి మాట‌లు అంటారా? అంటూ మండిప‌డుతున్నారు. ఈ సంద‌ర్భంగా హుందత‌నంతో కూడిన రాజకీయాలు చేయాల‌ని చెబుతూ.. తానెప్పుడు గీత దాట‌లేదంటూ గొప్ప‌లు చెప్పుకోవ‌టం చూసిందే. మ‌రిన్ని గొప్ప‌లు చెప్పుకునే బాబు పార్టీకి చెందిన త‌మ్ముళ్లు చేసిన వెధ‌వ ప‌ని చూస్తే.. అవాక్కు అవ్వాల్సిందే.

త‌మ రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థి జ‌గ‌న్ పై త‌మ నిర‌స‌న‌ను తెలియ‌జేసేందుకు అనుస‌రిస్తున్న వైనంపై ప‌లువురు విమ‌ర్శ‌లు చేస్తున్నారు. త‌ప్పు చేశారంటూ చెబుతూనే.. మ‌రింత పెద్ద త‌ప్పు చేస్తున్న బాబు శ్రేణుల తీరును చూసి విస్తుపోతున్న వారు.. రాజ‌కీయాల్లో ఈ కొత్త త‌ర‌హా బ‌రితెగింపు ఏమిట‌న్న ప్ర‌శ్న‌ను సంధిస్తున్నారు.

జ‌గ‌న్ చేసిన వ్యాఖ్య‌ల్ని ఖండించే క్ర‌మంలో నెల్లూరులో స‌రికొత్త రీతిలో నిర‌స‌న తెలుపుతున్నామంటూ.. దారుణ రీతిలో విప‌క్ష నేత‌ను అవ‌మానించారు. జ‌గ‌న్ వేషాన్ని ఒక వ్య‌క్తికి వేయించి.. అత‌ని చేతికి తుపాకి ఇచ్చిన టీడీపీ శ్రేణులు.. అత‌ని వెంట ప‌డి త‌రిమారు. అత‌నిపై కోడిగుడ్లు.. ట‌మాటాలు విసురుతూ ప‌రుగులు తీయించారు. చేసిన విమ‌ర్శ‌లు న‌చ్చ‌క‌పోతే.. ప్ర‌తివిమ‌ర్శ‌లు చేయాలే కానీ.. ఈ దిక్కుమాలిన నిర‌స‌న ఏమిట‌న్న ఈస‌డింపు ప‌లువురు నోట వినిపించ‌టం గ‌మ‌నార్హం. హుందాత‌నం గురించి నీతులు చెప్పే చంద్ర‌బాబుకు త‌న శ్రేణులు చేసిన ఈ ఓవ‌ర్ యాక్ష‌న్ పై ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.