Begin typing your search above and press return to search.

నెల్లూరు ఇబ్బంది పెట్టేట్లే ఉందిగా ?

By:  Tupaki Desk   |   15 April 2022 3:23 AM GMT
నెల్లూరు ఇబ్బంది పెట్టేట్లే ఉందిగా ?
X
వైసీపీ ఏర్పాటైన దగ్గర నుండి పార్టీని బాగా ఆధరిస్తున్న జిల్లాల్లో నెల్లూరు కూడా ఒకటి. మొన్నటి ఎన్నికల్లో జిల్లాలోని పదికి పది అసెంబ్లీ సీట్లను వైసీపీ గెలుచుకుంది. దీంతోనే జనాలు అధికారపార్టీని ఎంతగా ఆధిరించారో అర్ధమైపోతోంది. అలాంటి జిల్లాలో జగన్ క్యాబినెట్-2 పెద్ద చిచ్చుపెట్టినట్లుగానే అనిపిస్తోంది. తాజా మంత్రి కాకాణి గోవర్ధనరెడ్డికి వ్యతిరేకంగా కొందరు ఎంఎల్ఏలు ఏకమవుతున్నట్లు అర్ధమవుతోంది.

ఎప్పటినుండో ఉప్పు నిప్పులాగుండే మాజీమంత్రి అనీల్ కుమార్ యాదవ్, నెల్లూరు రూరల్ ఎంఎల్ఏ కోటంరెడ్డి శ్రీధరరెడ్డి సమావేశమే తాజా ఉదాహరణ. అనీల్ మంత్రిగా ఉన్నప్పటినుండి కాకాణితో పడేదికాదు. ప్రత్యక్షంగా వీళ్ళమధ్య గొడవలేమీ లేకపోయినా అంతర్గతంగా మాత్రం వీళ్ళకు పడదు. ఇపుడు అనీల్ మాజీ అయితే కాకాణి మంత్రయ్యారు. దాంతో సీన్ రివర్సవుతోంది. కాకాణంటే పడి అనీల్ తో మంత్రిపదవి ఆశించి భంగపడ్డ కోటంరెడ్డి చేతులు కలిపారు.

జిల్లా మొత్తంలో వెంకటగిరి ఎంఎల్ఏ ఆనం రామనారాయణరెడ్డి మాత్రమే కాకాణికి మద్దతుగా ఉన్నారు. ఇద్దరు ఎంఎల్ఏలు ఎటూ వ్యతిరేకంగానే ఉన్నారు. మిగిలిన ఐదుగురు ఎంఎల్ఏల సంగతేంటో తేలలేదు.

గౌతమ్ రెడ్డి మరణంతో ఒకస్ధానం ఖాళీగా ఉంది. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఐదుగురు ఎంఎల్ఏలతో కూడా కాకాణికి పెద్దగా సత్సంబంధాలు లేవట. కాబట్టి ముందుముందు మంత్రి వ్యవహారశైలి ఆధారంగానే ఐదుగురు ఎంఎల్ఏల వైఖరి ఆధారపడుంటుంది. ఏదేమైనా పార్టీలో అంతర్గతంగా మొదలైన విభేదాలు చివరకు వచ్చే ఎన్నికలపైనే పడుతుందనటంలో సందేహంలేదు.

ఎన్నికలపై ఎలా ప్రభావం పడుతుందంటే ఆధిపత్యం కోసం ఒకరిని దెబ్బ కొట్టేందుకు మరొకరు ప్రయత్నాలు చేస్తారు. దానివల్ల అంతిమంగా నష్టపోయేది పార్టీయే అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

ఈ పరిస్దితి ఎదురుకాకూడదంటే జగన్మోహన్ రెడ్డి జోక్యం చేసుకోవాల్సిందే. మంత్రి-ఎంఎల్ఏల మధ్య విభేదాలను సర్దుబాటు చేయాలి. ఇప్పుడే జోక్యం చేసుకోకపోతే ముందు ముందు మరింతగా గొడవలు పెరగిపోతాయి. అప్పుడు జోక్యం చేసుకున్నా ఉపయోగంలేకపోవచ్చు. అప్పుడు కచ్చితంగా పార్టీ దెబ్బతినటం మాత్రం ఖాయం.