Begin typing your search above and press return to search.

నేపాల్ భార‌త్ పాలిట మ‌రో బంగ్లాదేశ్ కానుందా?

By:  Tupaki Desk   |   7 May 2016 10:02 AM GMT
నేపాల్ భార‌త్ పాలిట మ‌రో బంగ్లాదేశ్ కానుందా?
X
చిర‌కాలంగా భార‌త్ కు మిత్ర దేశంగా ఉంటూ.. ఎన్నో విష‌యాల్లో భార‌త్ పై ఆధార‌ప‌డుతూ, ఒక‌ర‌కంగా భార‌త్ కు విధేయంగా ఉంటున్న పొరుగుదేశం నేపాల్ ఇప్పుడు ఎదురుతిరుగుతోంది. చైనా పంచ‌న చేరి భార‌త్ తో క‌య్యానికి కాలు దువ్వుతోంది. ఇదిప్పుడు మోడీ ప్ర‌భుత్వం రాజనీతి వైఫ‌ల్యంగా ప్ర‌పంచం దృష్టిని ఆక‌ర్షిస్తోంది. తిరుగులేని ఆధిక్యంతో భార‌త ప్ర‌ధానిగా పీఠ‌ముందుకున్న మోడీ అంత‌వ‌ర‌కు భార‌త్ తో ద్వంద్వ వైఖ‌రినే అవలంబించిన అమెరికాను సైతం ఆకట్టుకున్నారు. త‌నకు వీసా నిరాక‌రించిన అమెరికాయే త‌నను ఆ దేశానికి ఆహ్వానించేలా చేసుకున్నారు. మోడీ, నేను అన్న‌ద‌మ్ములం అని అగ్ర‌రాజ్య అధినేత ఒబామా ప్ర‌క‌ట‌న చేసేంత స్థాయికి భార‌త్ - అమెరికా సంబంధాలు చేరాయి. అమెరికాతో భార‌త్ సంబంధాలు చూసిన ప్ర‌పంచ దేశాల‌న్నీ భార‌త్ తో తామూ మంచి సంబంధాలు ఏర్ప‌రుచుకోవాల‌ని ఉవ్విళ్లూరాయి. భార‌త్ అంటే కొన్ని దేశాలు భ‌య‌ప‌డ్డాయి. ఇంకొన్ని భ‌క్తి చూపాయి.. మ‌రికొన్ని దేశాలు అసూయ‌ప‌డ్డాయి.. చిన్న దేశాల‌న్నీ సాహూ అని స‌లాం చేశాయి. మోడీ కూడా చిన్నాపెద్దా అన్న తేడాలు లేకుండా ప్ర‌పంచంలోని ప‌లుదేశాలు తిరిగి సంబంధాలు మెరుగుప‌రుచుకుంటూ వ‌స్తున్నారు. భార‌త్ లో క‌ష్టాల్లో ఉన్న రాష్ట్రాల‌ను ప‌క్క‌న‌పెట్టి ఇత‌ర దేశాల‌కు ఆయన ఆర్థిక స‌హాయాలు చేశారు. ఆ ర‌కంగా మోడీ అమెరికాను - ప్ర‌పంచాన్ని కూడా గెలుచుకున్నార‌నే చెప్పాలి. కానీ, చిర‌కాలంగా మిత్రుత్వం ఉన్న నేపాల్ మాత్ర భార‌త్ నుంచి సాయం పొందుతూ కూడా ఇప్పుడు శ‌త్రువులా మారుతోంది. తాజా ప‌రిణామాలు నేపాల్ వైఖ‌రిలో వ‌చ్చిన మార్పును స్ప‌ష్టం చేస్తున్నాయి.

నేపాల్ త‌న తాజా నిర్ణ‌యంతో భారత్ కు షాకిచ్చింది. భారత రాయబారిని పొమ్మ‌ని ఛీత్క‌రించింది. దీని వెనుక ఉన్న కార‌ణాలు ఇప్పుడు భార‌త్ ను - మోడీని ఆందోళన‌కు గురిచేస్తున్నాయి. నేపాల్ భూకంపం సంభవించిన అనంతరం సహాయకచర్యలు చేస్తున్నామన్న పేరుతో బీజేపీ ప్రభుత్వం...సహాయం చేయడం తమ గొప్ప విజయంగా భావిస్తూ జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ప్రచారం చేసుకుంది. ఇదే సమయంలో చైనా కూడా నేపాల్ కు సహాయం చేసింది. ఆ తరువాత నేపాల్ - భారత్ సరిహద్దుల్లో వివాదాలు రేగాయి. వీటిని భారత రాయబారి వెనకనుంచి నడిపించారని అక్కడి నేతలు అనుమానిస్తున్నారు. ఇదే సమయంలో సరిహద్దుల నుంచి భారత్ సరకులు నిలిచిపోయాయి.. అదే అద‌నుగా చైనా వేల సంఖ్య‌ల లారీల‌తో సరకులు పంపి నేపాలీల మనసులు గెలుచుకుంది. దీంతో నేపాల్ మెల్ల‌మెల్లగా పార్టీ ఫిరాయిస్తూ తాజాగా భార‌త్ రాయ‌బారిని వెళ్లిపోమ‌ని ఆదేశించి భార‌త్ కు క‌టీఫ్ చెప్ప‌డానికి రెడీ అయ్యింది.

నేపాల్ కు తొట్టతొలి మహిళా అధ్యక్షురాలిగా విద్యాదేవి భండారి కొద్దికాలం కింద‌ట పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆమెను భారత పర్యటనకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆహ్వానించారు. మే 9 నుంచి ఆమె భారత్ లో ప‌ర్య‌టించాల్సి ఉంది. ఇందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆమె రావడమే తరువాయి. ఇంతలో ఆమె భారత పర్యటన రద్దు చేస్తున్నట్టు నేపాల్ ప్రకటించింది. ఇదే విషయాన్ని భారత్ లో నేపాల్ రాయబారి దీప్ కుమార్ ఉపాధ్యాయకు ప్రధాని కేపీ శర్మ ఓలి ఫోన్ చేసి చెప్పారు. దీంతో అలా ఎలా చేస్తారు? కనీసం తనకు మాటమాత్రమైనా చెప్పకుండా ఎందుకు రద్దు చేశారని ఉపాధ్యాయ నేపాల్ ప్రధానిని నిలదీశారు. సంబంధాలను బలోపేతం చేసుకోవాల్సిన దశలో ఈ నిర్ణయం ఏంటని ఆయన అడిగారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన నేపాల్ ప్రధాని తమ నిర్ణయం నచ్చని పక్షంలో పదవి నుంచి రాజీనామా చేసి, తప్పుకోవాలని సూచించారు. అంతటితో ఆగని ఆయన వెంటనే ఉపాధ్యాయను వెనక్కి పిలిపించేలా కేబినెట్ తీర్మానం చేయించారు. ప్రభుత్వ ఉద్దేశానికి వ్యతిరేకంగా నడుచుకోవడం, ప్రభుత్వాన్ని ఓవర్ టేక్ చేసేలా నడచుకోవడంతోనే ఆయనను వెనక్కి పిలిపిస్తున్నట్టు ప్రకటించారు. దీంతో భారత్, నేపాల్ సంబంధాలు కొత్త మ‌లుపులు తిరిగాయి.

నేపాల్ క‌థ చూస్తుంటే బంగ్లాదేశ్ అనుభ‌వం గుర్తుకొస్తోంది. పాకిస్థాన్ విడిపోయి స్వతంత్ర దేశంగా ఏర్ప‌డ‌డంతో భార‌త్ స‌హాయం పొందిన బంగ్లాదేశ్ ఆ త‌రువాత చాలాకాలం భార‌త్ కు ప‌క్క‌లో బ‌ల్లెంలా మారింది. స‌రిహ‌ద్దు వివాదాల‌కు తోడు ఉగ్ర‌వాదుల ప్ర‌వేశానికి బంగ్లాదేశ్ వేదికైంది. న‌కిలీ క‌రెన్సీ ముఠాలు - స్మ‌గ్ల‌ర్లు - ఉగ్ర‌వాద‌లు బంగ్లాదేశ్ నుంచి భార‌త్ లోకి వేల సంఖ్య‌లో చొర‌బ‌డ్డారు. ఇలా భార‌త్ లో అస్థిర‌త‌కు బంగ్లాదేశ్ కార‌ణ‌మైంది. ఇటీవ‌ల రెండు దేశాల మ‌ధ్య ప‌రిస్థితులు మెరుగైనా కూడా పూర్తిగా కుదుట‌ప‌డలేదు. ఒక‌వైపు పాకిస్థాన్‌ - మ‌రోవైపు బంగ్లాదేశ్ - ఇంకోవైపు చైనాల‌తో ఇబ్బందులున్నా కూడా నేపాల్ తో ఇంత‌వ‌ర‌కు భార‌త్ కు ఎలాంటి స‌మ‌స్య లేదు. తాజాగా నేపాల్ కూడా భార‌త్ ను శ‌త్రువుగా చూడ‌డం ప్రారంభిస్తే కొత్త ఇబ్బంది మొద‌లైన‌ట్లే.