Begin typing your search above and press return to search.

ఏకైక హిందూ దేశం...ఇలా అయిపోయింది

By:  Tupaki Desk   |   21 Sep 2015 9:08 AM GMT
ఏకైక హిందూ దేశం...ఇలా అయిపోయింది
X
ప్ర‌పంచంలో ఏకైక హిందూ దేశంగా ఉన్న నేపాల్ లౌకిక‌ దేశంగా మారిపోయింది. కొద్దికాలం క్రితం ఈ మేర‌కు నిర్ణ‌యం తీసుకున్న నేపాల్ పూర్తి లౌకిక రాజ్యంగా ఆదివారం ఆవిర్భవించింది. రాచరిక పాలన నుంచి ప్రజాస్వామ్యంలోకి అడుగు పెట్టిన ఏడేళ్ల అనంతరం ఈ నిర్ణ‌యం వెలువ‌డింది. ఇందుకు సంబంధించిన చారిత్రాత్మక కొత్త రాజ్యాంగాన్ని నేపాల్‌ ఆమోదించింది. రాజ్యాంగ పరిషత్‌ ఆమోదం తెలిపిన ఈ నూతన రాజ్యాంగాన్ని పరిషత్‌ చైర్మన్‌ హోదాలో అధ్యక్షుడు రామ్‌ భరణ్‌ యాదవ్‌ ఆదివారం అధికారికంగా ప్రకటించారు. ఈ నూతన రాజ్యాంగం అదివారం నుంచే అమలులోకి వస్తుంది.

ఏడు ప్రావిన్స్‌ లతో కూడిన కొత్త ఈ కొత్త రాజ్యాంగాన్ని ప్రకటించగా రాజ‌ధాని ఖాట్మండ్‌ లో లౌకికవాదులంతా వీధుల్లోకి వచ్చి కేరింతలు కొట్టారు. ఇంకొకవైపు మితవాద మదేశీ గ్రూపులు కొత్త రాజ్యాంగాన్ని నిరసిస్తూ ఆందోళనకు దిగాయి. అయితే ఈ చారిత్రక క్షణంలో దేశ ప్రజలంతా ఐక్యంగా వుండి ప్రభుత్వానికి సహకరించాలని అధ్యక్షుడు రామ్‌ భరణ్‌ యాదవ్‌ విజ్ఞప్తి చేశారు.అందరి స్వేచ్ఛ - స్వాతంత్య్రా లను కాపాడుతూ భౌగోళిక సమగ్రత - ప్రజల సార్వభౌమత్వాన్ని పరిరక్షించే ఉమ్మడి పత్రమే ఈ రాజ్యాంగమని ఆయన వివరించారు. కొత్తగా ప్రకటించిన 'రాజ్యాంగం దేశంలో వ్యవస్థీకృతమైన ప్రజాతంత్ర వాదానికి సాక్షిగానిలుస్తుందని ఆయన చెప్పారు. అధ్యక్షుడి ప్రసంగం అనంతరం కొత్త రాజ్యాంగ అమలును ప్రకటించిన ఆయనకు కృతజ్ఞ‌తలు తెలియచేస్తూ రాజ్యాంగ అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించింది.

మొత్తం 601 మంది సభ్యులున్న రాజ్యాంగ అసెంబ్లీలో 85 శాతం మంది మద్దతు పొందిన కొత్త రాజ్యాంగంలో రెండు సభల వ్యవస్థ ఉంది. దిగువ సభ అయిన ప్రతినిధుల సభలో 375 మంది, ఎగువ సభలో 60 మంది సభ్యులుంటారు. మెజార్టీ కోసం ప్రధాన పక్షాలయిన నేపాలీ కాంగ్రెస్‌ - నేపాల్‌ కమ్యూనిస్టు పార్టీ - నేపాల్‌ ఐక్య కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు)లు ఒక్క తాటి పైకి రాగా మరికొన్ని చిన్న పార్టీలు ఈ రాజ్యాంగ ప్రక్రియను బహిష్కరించాయి.

1996లో మావోయిస్టులు ప్రారంభించిన అంతర్యుద్ధం దాదాపు 15 వేల మందికి పైగా ప్రాణాలు బలితీసుకుని 2006లో ముగిసింది. ప్రపంచంలో మెజార్టీ హిందూ ప్రజలున్న ఏకైక దేశంగా వున్న నేపాల్‌ జనాభాలో 80 శాతం మంది హిందువులే. ఇప్పటివరకూ హిందూ దేశంగా పేరు తెచ్చుకున్న నేపాల్‌ కొత్త రాజ్యాంగం ప్రకారం లౌకిక దేశంగా మనుగడ సాగిస్తుంది. అయితే కొత్త రాజ్యాంగంలో తమకు ఏ మాత్రం ప్రాతినిధ్యం కల్పించలేదంటూ మాదేశీ - థారు తెగల ప్రజలు నిరసన ప్రదర్శనలు చేపట్టారు. ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యగా విధించిన నిషేధాజ్ఞలను ఉల్లంఘిస్తూ నిరసన ప్రదర్శన నిర్వహిస్తున్న ఆందోళనకారులపై పోలీసులు జరిపిన కాల్పుల్లో తుది సమాచారం అందే సమయానికి 42 మంది చనిపోయినట్లు తెలుస్తోంది.

దేశంలోని పౌరుల్లో కొందరు నేపాల్‌ను హిందూ దేశంగానే కొనసాగించాలని డిమాండ్‌ చేస్తుండగా మరికొందరు లౌకిక రాజ్యంగా ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. నేపాల్‌ లో పరిస్థితులను నిశితంగా గమనిస్తున్న భారత్‌ అప్రమత్తమైంది. అసంతృప్తితో వున్న వర్గాల వాదనను విని వారి ఆందోళనను తగ్గించాలని భారత ప్రభుత్వం నేపాల్‌ నాయకత్వానికి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోడీ సందేశంతో ఆయన ప్రత్యేక దూతగా విదేశాంగశాఖ కార్యదర్శి ఎస్‌ జయశంకర్‌ ఖాట్మండూ బయల్దేరి వెళ్లారు.