Begin typing your search above and press return to search.

కొత్త మ్యాప్ బిల్లుని పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన నేపాల్ !

By:  Tupaki Desk   |   1 Jun 2020 7:50 AM GMT
కొత్త మ్యాప్ బిల్లుని పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన నేపాల్ !
X

నేపాల్, భారత్ తో వైర్యానికి కాలుదువ్వుతోంది. భారత్‌ తో సరిహద్దు వివాదాన్ని నేపాల్ రోజురోజుకి పెంచుకుంటూపోతుంది.‌ భారత దేశ భూభాగాలను తమ దేశంలో చూపిస్తూ రూపొందించిన కొత్త మ్యాప్‌కు సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లును ఆదివారం పార్లమెంటులో ప్రవేశపెట్టింది. ఈ సవరణ బిల్లుకు అనుకూలంగా తాము ఓటు చేస్తామని ప్రతిపక్ష నేపాలీ కాంగ్రెస్ ప్రకటించింది. ఇలా సవరణ బిల్లుకి మద్దతిస్తాం అని ప్రతిపక్ష పార్టీ చెప్పిన మరుసటి రోజే న్యాయ, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి శివమయ్యా బిల్లును పార్లమెంటు లో ప్రవేశ పెట్టారు.

సాధారణంగా ఆ దేశంలో ఓ రాజ్యాంగ సవరణ బిల్లును ఆమోదించేందుకు నెల రోజులు పడుతుంది. అయితే ప్రజల సెంటిమెంటును దృష్టిలోకి తీసుకుని పార్లమెంటు అన్ని ప్రొసీజర్లనూ పక్కన పెట్టి, రానున్న పది రోజుల్లో బిల్లు ఆమోదం పొందేలా చూస్తుందని సమాచారం. అలాగే ఆ బిల్లు ఆమోదం పొందాలంటే మూడింట రెండువంతుల సభ్యుల మెజారిటీ అవసరం. ఇప్పటికే విపక్షం ఓకె చెప్పింది కాబట్టి ఈ బిల్లు ఆమోదం పొందటం పెద్ద కష్టమేమీ కాదు.

భారత్‌ భూభాగానికి చెందిన లిపులేఖ్, కాలాపానీ, లింపియాధురాలను వ్యూహాత్మకంగా తమ దేశ భూభాగాలుగా పేర్కొంటూ సవరించిన మ్యాప్‌లను నేపాల్‌ విడుదలచేయడం తెల్సిందే. ఈ మ్యాప్‌కు చట్టబద్ధత రావాలంటే రాజ్యాంగాన్ని సవరించాలి. రాజ్యాంగంలోని షెడ్యూల్‌ 3లో కొత్త సరిహద్దులతో కూడిన మ్యాప్‌ ను చేర్చాలని ప్రధాని కేపీ శర్మ ఓలి రాజ్యాంగ సవరణ బిల్లును తీసుకు వచ్చారు.