Begin typing your search above and press return to search.

భార‌త్‌ కు షాక్ ఇచ్చిన నేపాల్‌: స‌రిహ‌ద్దులో కీల‌క ప‌రిణామం

By:  Tupaki Desk   |   18 Jun 2020 5:30 PM GMT
భార‌త్‌ కు షాక్ ఇచ్చిన నేపాల్‌: స‌రిహ‌ద్దులో కీల‌క ప‌రిణామం
X
ఇన్నాళ్లు మిత్ర‌దేశంగా నేపాల్ కొన్ని రోజులుగా భారత్‌ను షాకిచ్చేలా ప‌లు నిర్ణ‌యాలు తీసుకుంటోంది. ఈ క్ర‌మంలో స‌రిహ‌ద్దులో కొర‌క‌రాని కొయ్య‌గా ఆ దేశం మారింది. ఈ క్ర‌మంలో నేపాల్ సరిహద్దు వివాదంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్ప‌టికే భార‌త భూభాగంలోకి లిపులేఖ్, కాలాపానీ, లింపియధుర ప్రాంతాలు తమవేనంటూ నేపాల్‌ ప్రభుత్వం ప్ర‌క‌టించింది. దీనిపై ఆ దేశ పార్లమెంట్‌లోని ఎగువసభలో దానికి సంబంధించిన బిల్లును గురువారం ఏకగ్రీవంగా ఆమోదించింది. భారత భూభాగంలోని ఆ మూడు ప్రాంతాలను తమ మ్యాప్‌లో పేర్కొన్న రాజ్యాంగ సవరణ బిల్లును రెండు రోజుల క్రితమే దిగువ సభ ఏకగీవ్రంగా ఆమోదించింది.

భార‌త‌దేశంలోని ఉత్తరాఖండ్ రాష్ట్రంలో కాలాపానీ, లిపులేఖ్‌, లింపియధురలు తమ ప్రాంతాలేనంటూ నేపాల్ బ‌లంగా వాదిస్తోంది. దీనిపై భార‌త వాద‌న విన‌కుండానే నేపాల్ దుందుడుకుగా సంచ‌ల‌న నిర్ణ‌యాలు తీసుకుంటోంది. ఆ నిర్ణ‌యాల‌తో భార‌త్‌కు షాక్‌ల మీద షాక్‌లు ఇస్తోంది. దీంతో ఇరు దేశాల మధ్య సరిహద్దు వివాదం రోజురోజుకు ముదురుతోంది. ఈ క్ర‌మంలోనే నేపాల్‌ ఆర్మీ చీఫ్‌ జనరల్‌ పుర్ణ చంద్ర థాపా భార‌త్‌లోని కాలాపానీ సమీపంలో ఉన్న‌ చాంగ్రూలో ఏర్పాటుచేసిన కొత్త భద్రతా పోస్టును బుధవారం పరిశీలించారు. ఆయనతో పాటు నేపాల్‌ ఆర్మ్డ్‌ పోలీసు ఫోర్స్‌ (ఏపీఎఫ్‌)ముఖ్య అధికారి శైలేంద్ర ఖనాల్‌ కూడా ఉన్నారు. ఈ వివాదస్పద బిల్లును భారత్‌ తీవ్రంగా వ్యతిరేకించింది. లిపులేఖ్‌, కాలాపానీ, లింపియధురలను తమ భూభాగాలుగా చెప్పడానికి నేపాల్‌ వద్ద ఎలాంటి సాక్ష్యాలు లేవని స్ప‌ష్టం చేస్తోంది. కృత్రిమంగా భూభాగాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తోందంటూ విమర్శించింది. సరిహద్దు అంశాలపై చర్చించేందుకు ముందుగా కుదిరిన అవగాహనను కూడా ఉల్లంఘించిందని భారత్‌ మండిపడింది.

ఈ సంద‌ర్భంగా నేపాల్‌ ప్రభుత్వం మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఏపీఎఫ్‌ పోస్టును కొత్తగా ఏర్పాటుచేసింది. మానస సరోవర యాత్రికుల కోసం ఉద్దేశించిన ధార్చులా-లిపులేఖ్‌ రోడ్డును ప్రారంభించిన తర్వాత నేపాల్‌ ఈ ఏపీఎఫ్‌ పోస్టును ఏర్పాటు చేయడం గమనార్హం. ఉత్తరాఖండ్‌లోని దార్చుల నుంచి లిపులేఖ్‌ వరకు భారత ప్రభుత్వం నిర్మిస్తున్న 80 కిలోమీటర్ల రోడ్డుపై నేపాల్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.