Begin typing your search above and press return to search.

ఆ రూ.15 కోట్లలో కవిత సంస్థకు ఎంత?

By:  Tupaki Desk   |   27 Sep 2016 9:20 AM GMT
ఆ రూ.15 కోట్లలో కవిత సంస్థకు ఎంత?
X
తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే బతుకమ్మ పండగ వ్యవహారం వివాదంగా మారుతోంది. బతుకమ్మ కాన్సెప్ట్ ను తెరపైకి తీసుకొచ్చి..భావోద్వేగానికి గురి చేసిన ఘనత కేసీఆర్ కుమార్తె - నిజామాబాదు ఎంపీ కవితదేన‌ని చెప్పాలి. అయితే.. బతుకమ్మ అంటే కవిత.. కవిత అంటే బతుకమ్మగా ట్రీట్ చేయటాన్నివిపక్షాలు తప్పు పడుతున్నాయి. బతుకమ్మ తెలంగాణ పర్వదినం అయినప్పుడు.. ఆ పండుగకు కవితను బ్రాండ్ అంబాసిడర్ ను ఎలా చేస్తారన్నప్రశ్న పలువురి నోట వినిపిస్తోంది.

గత ఏడాది బతుకమ్మ పర్వదినం కోసం రూ.10కోట్లు విడుదల చేసిన తెలంగాణ సర్కారు.. ఈ ఏడాది ఈ పండగ నిర్వహణ కోసం రూ.15కోట్లు కేటాయిస్తూ నిర్ణయం తీసుకోవటం తెలిసిందే. అయితే.. ఈ వ్యవహారం మీద విపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. బతుకమ్మ తెలంగాణ ప్రజల సంస్కృతి చిహ్నమని.. తరతరాలుగా బడుగు బలహీన వర్గాల ప్రజలు ఈ పర్వదినాన్ని జరుపుకుంటుంటే.. టీఆర్ ఎస్ సర్కారు మాత్రం బతుకమ్మ పర్వదినాన్ని నిర్వహించేందుకు ఇస్తున్న నిధులన్నీ ముఖ్యమంత్రి కుమార్తె కవిత నిర్వహిస్తున్న ఎన్జీవోకు ఎలా కేటాయిస్తారని ప్రశ్నిస్తున్నారు టీ కాంగ్రెస్ నేతలు. గత ఏడాది రూ.10కోట్లు ఖర్చుచేశామని చెబుతున్నారని.. ఈ ఏడాది రూ.15కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారని.. ఈ కోట్లాది రూపాయిల ఖర్చుల లెక్క చెప్పరా? అని నిల‌దీస్తున్నారు.

కవిత నిర్వహిస్తున్న స్వచ్ఛంద సంస్థకు బతుకమ్మ నిర్వహణ కోసం విడుదల చేసిన నిధుల్లో ఎంతమేర కేటాయించారు? వాటికి సంబంధించిన లెక్కల్ని చెప్పాల్సిందిగా తెలంగాణ కాంగ్రెస్ మహిళా నేత నేరెళ్ల శారద డిమాండ్ చేస్తున్నారు. కవిత ఎన్జీవోకు సంబంధించి గతంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ సైతం ప్రశ్నించటం గమనార్హం. ఈ నేపథ్యంలో బతుకమ్మ నిధులపై కాస్తంత క్లారిటీ ఇస్తే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/