Begin typing your search above and press return to search.

నేతాజీ విమాన ప్రమాదంలో మరణించలేదా?

By:  Tupaki Desk   |   31 March 2016 3:38 PM GMT
నేతాజీ విమాన ప్రమాదంలో మరణించలేదా?
X
నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ విమాన ప్రమాదంలో మృతి చెందారన్న విషయంలో ఎన్నో వివాదాలున్నాయి. తాజాగా వినిపిస్తున్న కథనాలు మళ్లీ ఆయన మృతిపై చర్చకు దారితీస్తున్నాయి. నేతాజీ విమాన ప్రమాదంలో మృతిచెందారన్న వార్త వెలువడిన అనంతరం కూడా నేతాజీ మూడుసార్లు రేడియో ప్రసంగాలు చేశారనే వార్త వెలుగులోకి వచ్చింది. కేంద్రప్రభుత్వం తాజాగా బహిర్గతపర్చిన నేతాజీ ఫైళ్లలో ఈ విషయం ఉంది.

1945 ఆగస్టు 18న విమాన ప్రమాదం జరిగిన అనేక రోజుల తరువాత నేతాజీ రేడియోలో ప్రసంగాలు చేసినట్లు వెల్లడైంది. ఈ ప్రసంగాల వివరాలు ప్రధాని కార్యాలయానికి చెందిన ఫైల్‌ నెంబర్‌ 870/11/పి/16/92/పిఒఎల్‌ లో ఉన్నాయి.

ఈ సమాచారం బెంగాల్‌లోని గవర్నర్‌ నివాసంనుంచి వెలువడినట్లు భావిస్తున్నారు. ఆర్‌.జి. కాసే గవర్నర్‌ గా ఉన్న సమయంలో పిసి కార్‌ అనే అధికారి తమ మానిటరింగ్‌ సర్వీస్‌ విభాగం 31 మీటర్‌ బ్యాండ్‌ పై ఈ ప్రసంగాలను రావడాన్ని నమోదు చేసిందని పేర్కొన్నారు. దీనికి సంబంధించి గవర్నర్‌ ఒక నివేదికను కూడా సమర్పించారు.
రికార్డుల ప్రకారం 1945 డిసెంబర్‌ 26 నాటి ప్రసంగం ఇలా సాగింది ''నేను ప్రస్తుతం అతి గొప్ప ప్రపంచ శక్తుల మధ్య తల దాచుకున్నాను. నా హృదయం భారత దేశం కోసం భగభగ మండిపోతోంది. మూడవ ప్రపంచ యుద్ధం శిఖరాగ్రానికి చేరిన సమయంలో నేను భారత్‌కు తిరిగి వెళతాను. అది మరో పదేళ్లలో రావచ్చు లేదా అంతకంటే ముందే రావచ్చు. అప్పుడు నేను రెడ్‌ఫోర్ట్‌ వద్ద మా వారికి శిక్ష వేసిన వారి విషయంలో తీర్పు చెబుతాను"" అని ఉంది.

ఇక 1946 జనవరి 1వ తేదీన చేసిన ప్రసంగంలో 'మనకు స్వాతంత్య్రం రెండేళ్లలో వచ్చి తీరాలి. బ్రిటిష్‌ సామ్రాజ్యవాదం విచ్ఛిన్నమైంది. భారతదేశానికి స్వాతంత్య్రం ఇవ్వవలసిన అంశాన్ని వారు ఆలోచించాలి. అహింస ద్వారా భారతదేశానికి స్వాతంత్య్రం రాదు. అయితే, నాకు మహాత్మాగాంధీపై అపార గౌరవం ఉంది' అని ఉంది.

మూడవ ప్రసంగం 1946 ఫిబ్రవరిలో చేశారు. 'నేను సుభాష్‌ చంద్రబోస్‌ను మాట్లాడుతున్నాను. జైహింద్‌. జపాన్‌లో లొంగిపోయిన తరువాత మూడవసారి భారతీయ సోదర సోదరీమణులను ఉద్దేశించి మాట్లాడుతున్నాను. ఇంగ్లాడు ప్రధానమంత్రి పెథిక్‌ లారెన్స్‌ అనే వ్యక్తిని, మరొక ఇద్దరితో కలిపి భారత్‌కు పంపనున్నారు. వారికి ఎలాగైనా సరే తమ సామ్రాజ్యాన్ని శాశ్వతంగా సుస్థిరం చేసుకుని భారతీయుల రక్తాన్ని తాగడం తప్ప వేరొక ఆలోచన ఏదీ లేదు.'
తాజాగా బహిర్గతమైన ఫైళ్లలో 1946 జూలై 22న మహాత్మాగాంధీ కార్యదర్శుల్లో ఒకరైన కుర్షీద్‌ నౌరోజీ లూయిస్‌ ఫిషర్‌కు రాసిన లేఖ కూడా ఉంది. ఫిషర్‌ రాసిన లేఖకు సమాధానంగా రాసిన ఈ లేఖలో 'ఐఎన్‌ఎ పట్ల భారత సైన్యం సానుభూతితో ఉంది. ఒకవేళ రష్యా సహకారంతో బోస్‌ కనుక వస్తే గాంధీ కాని, లేదా నెహ్రూ కాని, కాంగ్రెస్‌ కాని దేశాన్ని ఒప్పించలేదు' అని ఉంది.

కాగా 1945 ఆగస్టు 18న జరిగిన విమాన ప్రమాదంనుంచి నేతాజ్‌ సజీవంగా బయటపడ్డారనే అనుమానాలు మరింత బలపడుతున్నాయి.