Begin typing your search above and press return to search.

నేతాజీ అలా చనిపోయారా?

By:  Tupaki Desk   |   17 Jan 2016 9:28 AM GMT
నేతాజీ అలా చనిపోయారా?
X
నేతాజీ సుభాష్ చంద్రబోస్ మృతి మీద ఎన్ని వివాదాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఎన్నో కథనాలు ఇప్పటికే వ్యాప్తిలో ఉన్నాయి. కొన్ని కథనాలు చదివినప్పుడు ఆయన పక్కాగా మరణించి ఉంటారన్నట్లుగా ఉంటే.. మరికొన్ని కథనాలు మాత్రం ఆయన తర్వాత కొంతకాలం జీవించి ఉన్న భావన కలగజేసేలా ఉండటం గమనార్హం.

తాజాగా బ్రిటన్ కు చెందిన ఒక వెబ్ సైట్ నేతాజీ మరణం గురించి ఒక కథనాన్ని ప్రచురించింది. దీని ప్రకారం నేతాజీ అంతిమ ఘడియలు ఎలా జరిగాయన్న విషయాన్ని వివరించే ప్రయత్నం చేసింది. సదరు వెబ్ సైట్ కథనం ప్రకారం 1945 ఆగస్టు 18న తైవాన్ రాజధాని తైపీ శివార్లలో ఒక విమాన ప్రమాదం జరిగిందని.. నేతాజీతో పాటు ఆయనకు అత్యంత సన్నిహితుడైన కల్నల్ హబబర్ రెహ్మాన్ ఖాన్ ఉన్నారు.

నేతాజీని దగ్గర్లోని ఒక ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆయనకు చికిత్స అందిస్తున్న సమయంలోనే కోమాలోకి వెళ్లిపోయారు. అనంతరం ఆయన స్పృహలోకి వచ్చారు. ఆయన మరణానికి కొద్ది నిమిషాల ముందు తనకొక ఇంగ్లిష్ ట్రాన్స్ లేటర్ కావాలని కోరి.. సదరు అనువాదకుడి ద్వారా తన చివరి సందేశాన్ని పంపినట్లుగా పేర్కొన్నారు.

ఆయన మరణించిన తర్వాత ఆయనకు జపాన్ అధికారులు.. ఆసుపత్రి సిబ్బంది ఆయన మృతదేహం వద్ద వరుసగా నిలుచొని సెల్యూట్ చేసిన నివాళులు ఆర్పించినట్లుగా తెలుస్తోంది. ఆయన మరణించిన విషయాన్ని సదరు వెబ్ సైట్ విస్పష్టంగా పేర్కొంది. అంతేకాదు.. ఆయన అంతిమ ఘడియల్లో చికిత్స చేసింది ఒక జపాన్ డాక్టర్ గా పేర్కొనటం గమనార్హం.