Begin typing your search above and press return to search.

నేతాజీ మరణంపై బిగ్ టర్నింగ్ పాయింట్

By:  Tupaki Desk   |   13 Dec 2015 6:48 AM GMT
నేతాజీ మరణంపై బిగ్ టర్నింగ్ పాయింట్
X
1945లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ మరణించారని భావిస్తుంటారు. దానిపై వివాదం కూడా ఉంది. ఆ తరువాత చాలాకాలం ఆయన జీవించే ఉన్నారన్న వాదనలు బలంగా వినిపిస్తుంటాయి. దానిపై సమాచారాన్ని ప్రభుత్వాలు రహస్యంగా ఉంచడం.. నేతాజీ కుటుంబం, ఆయన అభిమానులు అనుమానాలు వ్యక్తంచేయడం ఎంతో కాలంగా జరుగుతున్నదే. తాజాగా వెస్ట్ బెంగాల్ కానీ, నేతాజీ మనువడు కానీ విడుదల చేసిన కొన్ని రహస్య పత్రాల్లోనూ నేతాజీ మరణానికి సంబంధించిన స్పష్టమైన సమాచారం లేదు. కానీ..... బ్రిటన్ కు చెందిన ఓ ఫోరెన్సిక్ నిపుణుడు తాజాగా విడుదల చేసిన ఓ నివేదిక మాత్రం నేతాజీ మరణానికి సంబంధించిన కీలక సమాచారాన్ని ప్రపంచానికి వెల్లడిస్తోంది. ఇప్పుడది సంచలనంగా మారింది.

నేతాజీ మరణించారని భావిస్తున్న కాలం తరువాత కూడా మరో ఇరవయ్యేళ్లకు పైగా ఆయన బతికే ఉన్నారని... అంతేకాదు... ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొన్నారని కూడా ఆధారాలు చూపిస్తున్నారు బ్రటిష్ ఫోరెన్నిక్ నిపుణుడు నీల్ మిల్లర్. 1966లో తాష్కెంట్ ఒప్పందం కుదిరినప్పుడు అప్పటి ప్రధాని లాల్ బహుదూర్ శాస్త్రితో పాటు నేతాజీ కూడా అక్కడ ఉన్నారని ఆయన వాదిస్తున్నారు. అప్పట్లో బ్రిటన్, రష్యాలు తీసిన చిత్రాలు... లాహోర్ లోని చుగాతై మ్యూజియం నుంచి సేకరించిన చిత్రాలను ఆయన ల్యాబ్ లో విశ్లేషించి ఈ విషయాన్ని నిర్ధారించానని చెప్తున్నారు. ఆ చిత్రాల్లో ఉన్న ఓ వ్యక్తి నేతాజీయేనని ఆయన గట్టిగా వాదిస్తున్నారు.

ఆ వ్యక్తి కళ్లు, నుదురు, చెవులు, ముక్కు, ముఖ కవళికలు ఇలా మొత్తం నేతాజీ పోలికలకు సరిపోయాయని.. ఆయన నేతాజీయేనని నీల్ అంటున్నారు. ఆ చిత్రాలను నెల రోజులు విశ్లేషించి నీల్ 62 పేజీల నివేదిక ఇచ్చారు. కాగా 1966లో జనవరి 11న తాష్కెంట్ లో శాస్త్రి మరణించిన సంగతి తెలిసిందే.