Begin typing your search above and press return to search.

అవును.. నేతాజీ అప్పుడే చ‌నిపోయారు

By:  Tupaki Desk   |   1 Jun 2017 7:08 AM GMT
అవును.. నేతాజీ అప్పుడే చ‌నిపోయారు
X
స్వాతంత్య్ర పోరాటంలో చాలామంది పోరాటం చేసినా.. భార‌తీయుల మ‌దిలో వారంద‌రికి మించి.. పిస‌రంత ఎక్కువ‌గా నేతాజీ సుభాష్ చంద్ర‌బోస్ పైన అభిమానాన్ని ప్ర‌ద‌ర్శిస్తుంటారు. ఆయ‌న పోరాటం.. వ్య‌వ‌హార‌శైలి.. భార‌త స్వాతంత్య్రం కోసం ఆయ‌న ప‌డిన ఆరాటాన్ని భార‌తీయులు అంత తేలిగ్గా మ‌ర్చిపోలేరు. అయితే.. ఆయ‌న విమాన ప్ర‌మాదంలో చ‌నిపోయిన‌ట్లుగా చెబుతున్నా.. ఆ విష‌యం మీద పెద్ద క‌న్ఫ్యూజ‌నే న‌డుస్తోంది. ఇంత‌కాలం ఈ ఉదంతంపై కేంద్ర స‌ర్కారు విస్ప‌ష్ట‌మైన ప్ర‌క‌ట‌న చేయ‌క‌పోవ‌టం.. ఆయ‌న‌కు చెందిన ఫైల్స్ ను ర‌హ‌స్యంగా ఉంచ‌టంపై చాలానే వాద‌న‌లు వినిపించాయి.

ఇలాంటి వేళ‌.. ఆయ‌న మ‌ర‌ణంలో ఎలాంటి క‌న్ఫ్యూజ‌న్ లేద‌ని తేల్చేస్తూ.. ఆయ‌న 1945లోనే విమాన ప్ర‌మాదంలో మ‌ర‌ణించిన‌ట్లుగా స్పష్టం చేసింది. కోల్ క‌తాకు చెందిన ఒక వ్య‌క్తి.. కేంద్ర హోంశాఖ‌కు స‌మాచార హ‌క్కు కింద నేతాజీ మృతిపై వివ‌రాల కోసం ద‌ర‌ఖాస్తు చేశారు.

దీనిపై బ‌దులిచ్చిన ప్ర‌భుత్వం.. షాన‌వాజ్ క‌మిటీ.. జ‌స్టిస్ జీడీ ఖోస్లా క‌మిష‌న్‌.. జ‌స్టిస్ ముఖ‌ర్జీ క‌మిష‌న్ల నివేదిక‌లోని స‌మాచారాన్ని విశ్లేషించిన త‌ర్వాత బోస్ చ‌నిపోయిన‌ట్లుగా నిర్దార‌ణ‌కు వ‌చ్చిన‌ట్లుగా హోంశాఖ పేర్కొంది. ఇదే స‌మ‌యంలో.. నేతాజీ 1945లో మ‌ర‌ణించ‌లేద‌ని.. ఆయ‌న గుమ్న‌మి బాబాగా మారువేషంలో జీవించార‌న్న వాద‌న‌లో ఎలాంటి నిజం లేద‌ని అధికారులు కొట్టిపారేయ‌టం గ‌మ‌నార్హం. ఇదిలా ఉంటే.. బోస్ మ‌ర‌ణంపై స‌రైన సాక్ష్యాలు లేకుండానే విమాన ప్ర‌మాదంలో మ‌రిణించిన‌ట్లుగా ప్ర‌భుత్వం ఎలా తేల్చేస్తుంద‌ని ప్ర‌శ్నిస్తున్నారు ఆయన మునిమ‌న‌మ‌డు చంద్ర‌బోస్‌. ప్ర‌భుత్వం తేల్చేస్తున్నా.. బోస్ కుటుంబ స‌భ్యులు మాత్రం సంతృప్తి ప‌డ‌ని నేప‌థ్యంలో.. ఆయ‌న మ‌ర‌ణంపై ఉన్న సందేహాలు ఒక కొలిక్కి వ‌చ్చేలా క‌నిపించ‌టం లేద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/