Begin typing your search above and press return to search.

నేతాజీ...! తుఝె సలాం..

By:  Tupaki Desk   |   14 Oct 2015 6:50 AM GMT
నేతాజీ...! తుఝె సలాం..
X
భారత స్వాతంత్ర్య పోరాట చరిత్రలో గాంధీ, నెహ్రూ, పటేల్... ఇలా ఎందరి పాత్ర ఉన్నా నేతాజీ సుభాష్ చంద్రబోస్ కున్న ప్రాముఖ్యమే వేరు. భారత స్వాతంత్ర్య పోరాట చరిత్రలో ఆయనో సంచలనం... సొంత సైన్యాన్ని సమకూర్చుకుని బ్రటిషోళ్లను గడగడలాడించిన నేతాజీ వీరత్వం గురించి ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. వాటిలో నిజ సంఘటనలూ ఉన్నాయి... నేతాజీ పట్ల వీరాభిమానంతో కొందరు సృష్టించిన కథలూ ఉన్నాయి... నేతాజీ పుట్టిన ఒడిశా, పెరిగిన బెంగాల్ రాష్ట్రాల్లో ఆయన గురించి లెక్కలేనన్ని వీరగాథలు ప్రచారంలో ఉన్నాయి. తాజాగా నేతాజీ దస్త్రాలు... ఆయన మరణం.... ఆయన కుటుంబంతో ప్రధాని భేటీ కానుండడం.. నేతాజీ గురించి లాల్ బహుదూర్ శాస్త్రి మనుమడు చెప్పిన విషయాల నేపథ్యంలో నేతాజీని స్మరించుకుంటూ అలాంటి వీరగాథ ఒకటి ''తుపాకీ'' పాఠకుల కోసం..

నేతాజీ వీరత్వం, ధీరత్వం, సూక్ష్మగ్రాహ్యత, మేధస్సు, సమయస్ఫూర్తి గురించి ఎవరూ ప్రత్యేకించి చెప్పనవసరం లేదు..... స్వాతంత్ర్యపోరాట సమయంలో ఆయన ప్రపంచ దేశాల అధినేతలను కలిసి మద్దతు పొందేందుకు ప్రయత్నాలు చేసిన సంగతి తెలిసిందే... అందుకు ఆయన ఎన్నో దేశాలు తిరిగారు. ఆ క్రమంలోనే హిట్లర్ ను కలవడానికి జర్మనీ వెళ్లారట. అక్కడ ఆయనకు ఎదురైన అనుభవం.. ఆ సందర్భంలో ఆయన చూపించిన తెలివితేటలు... అందుకు నక్కజిత్తులే హిట్లరే ఆశ్చర్యపోయిన వైనం తెలుసుకోవాల్సిందే..

....నేతాజీ జర్మనీలో హిట్లర్ ను కలవడానికి వెళ్లారు.. అప్పటికే ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిన నేతాజీ ముందస్తు సమాచారం ఇచ్చే హిట్లర్ ఇంటికి వెళ్లగా అక్కడి భద్రత అధికారులు ఆయన్ను పెద్ద హాల్ లో కూర్చోబెట్టి లోపలున్న హిట్లర్ కు సమాచారం ఇస్తారు. నిత్యం అనేక విషయాలను అధ్యయనం చేసే అలవాటున్న నేతాజీ ఆ కొంచెం సమయాన్ని సద్వినియోగం చేసుకునేందుకు గాను తన సంచిలోని పుస్తకాన్ని తీసుకుని చదువుతుంటారు..

.. అంతలో ఆ గదిలోకి హిట్లర్ వచ్చి నేతాజీ ముందు నుంచే నడుచుకుంటూ వెళ్తారు.. కానీ నేతాజీ కన్నెత్తి కూడా చూడలేదు.. దీంతో హిట్లర్ రెండు మూడుసార్లు నేతాజీ ముందు నుంచి నడుచుకుంటూ వెళ్లి చివరకు ''మిస్టర్ నేతాజీ ఏం పని మీద వచ్చారు'' అని అడుగుతారు.. అందుకు నేతాజీ... ''నేను హిట్లర్ ను కలవాలి అని చెబుతారు''.... దీంతో అచ్చం హిట్లర్ లాగానే ఉన్న ఆ వ్యక్తి మారు మాట్లాడకుండా వెళ్తిపోతాడు. దాదాపు గంట గంటన్నర సమయంలో అలా అయిదారుగురు వ్యక్తులు హిట్లర్ వేషంలో వస్తారు. వారెవరినీ నేతాజీ అస్సలు పట్టించుకోరు.. పుస్తకంలోంచి తల పైకెత్తరు.. తామే అసలైన హిట్లర్ మని ప్రతి ఒక్కరూ చెప్పినా నేతాజీ అస్సలు నమ్మరు..

... చివరకు అసలు హిట్లర్ వస్తారు... నేరుగా నేతాజీ వద్దకు వచ్చి భుజంపై చేయి వేస్తారు.. వెంటనే నేతాజీ లేచి నిల్చుని హిట్లర్ తో చేయి కలుపుతారు. అప్పుడు వారిద్దరి మధ్య సంభాషణ వింటే ప్రతి భారతీయుడి గుండె ఉప్పొంగుతుంది...

హిట్లర్: మిస్టర్ నేతాజీ!! గుడ్ మార్నింగ్..

నేతాజీ: గుడ్ మార్నింగ్ హిట్లర్

హిట్లర్: నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది... ఇంతకుముందు వచ్చినవారంతా హిట్లర్ కాదని... నేనే అసలు హిట్లర్ నని మీరు ఎలా గుర్తు పట్టారు.

నేతాజీ: నేతాజీ భుజం మీద చేయి వేసి ''మిస్టర్ నేతాజీ'' అనే దమ్ముధైర్యం హిట్లర్ కు తప్ప ప్రపంచంలో ఇంకెవరికీ ఉండదని నాకు తెలుసు..

.... నేతాజీ ఇచ్చిన ఈ సమాధానం వినగానే హిట్లర్ ఆశ్చర్యపోతాడు... ''నిజమే... మీపై చేయి వేయాలంటే అందుకు ఎంతో ధైర్యం ఉండాలి'' అంటూ నేతాజీని స్వయంగా లోనికి తీసుకెళ్లి మాట్లాడుతాడు. భద్రత దృష్ట్యా చాలామంది డూప్ లను ఏర్పాటు చేసుకున్నానని... తనను కలవడానికి వచ్చేవారిలో సగాని కంటే ఎక్కువ మంది ఆ డూప్ లనే హిట్లర్ అనుకుని, వారితోనే మాట్లాడి వెళ్లిపోతారని నేతాజీతో చెబుతాడు.

...బెంగాల్ - ఒడిశా - బీహార్ - అస్సాం ప్రాంతాల్లో ఈ వీరగాథను చాలామంది చెబుతుంటారు.. వివిధ సందర్భాల్లో నేతాజీ స్మారకంగా వేసే నాటకాల్లోనూ ఇది కనిపిస్తుంటుంది.