Begin typing your search above and press return to search.

కక్కుర్తి పడిన నెట్ ఫ్లిక్స్.. షాకిచ్చిన యూజర్లు.. దెబ్బకు దారికొచ్చింది

By:  Tupaki Desk   |   25 April 2022 5:30 AM GMT
కక్కుర్తి పడిన నెట్ ఫ్లిక్స్.. షాకిచ్చిన యూజర్లు.. దెబ్బకు దారికొచ్చింది
X
పెద్ద.. పెద్ద కంపెనీలకు ఉండే చిన్న చిన్న కక్కుర్తులు ఒక్కోసారి రివర్స్ కావటమే కాదు.. సదరు కంపెనీ కలలో కూడా ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. తాజాగా అలాంటి అనుభవమే ప్రముఖ స్ట్రీమింగ్ కంపెనీ నెట్ ఫ్లిక్స్ కు ఎదురైంది. ఈ మధ్యన ఆ కంపెనీ పడిన చిన్నపాటి కక్కుర్తికి యూజర్లు భారీ షాకిచ్చారు. దీంతో.. గతంలో ఎప్పుడూ లేనంత భారీగా ఆదాయం పడిపోవటమే కాదు.. షేర్ విలువ షాకిచ్చేలా పడిపోయింది. ఈ నేపథ్యంలో లెంపలేసుకున్న ఆ కంపెనీ ఇప్పుడు దిద్దుబాటు చర్యలకు దిగింది.

ఉక్రెయిన్ - రష్యాల మధ్య నడుస్తున్న యుద్ధం నేపథ్యంలో నెట్ ఫ్లిక్స్ తన సేవల్ని రష్యాలో నిలిపివేసింది. దీంతో.. ఆ సంస్థ ఏడు లక్షల మంది యూజర్లను కోల్పోయింది. ఇంతవరకు ఓకే. ఇక్కడే భారీ కక్కుర్తికి తెర తీసింది. కొన్ని దేశాల్లో నెట్ ఫ్లిక్స్ యూజర్లు తమ అకౌంట్లను.. పాస్ వర్డ్ లను తమకు తెలిసిన వారికి షేర్ చేసుకోవటం తెలిసిందే.

దీనిపై ఆంక్షలు విధించటంతో పాటు.. అలా చేస్తే అదనపు ఛార్జీలు వసూలు చేస్తామని పేర్కొంది. దీంతో.. ఒళ్లు మండిపోయిన యూజర్లు.. నెట్ ఫ్లిక్స్ ఖాతాల్ని క్లోజ్ చేశారు. అది కూడా ఒక ఉద్యమం తరహాలో. దీంతో.. మూడు నెలల వ్యవధిలోనే 20 వేల మంది యూజర్లను కోల్పోయింది.

ఈ దెబ్బతో నెట్ ప్లిక్స్ ఆదాయమే కాదు.. యూజర్ల బేస్ అంతకంతకూ తగ్గిపోవటం మొదలైంది. ఇది కాస్తా.. దాని ఆదాయం మీదా.. సంపద మీదనే కాదు.. మార్కెట్లో ఆ షేరు విలువ పైన తీవ్ర ప్రభావాన్ని చూపింది. మార్కెట్లో దాని విలువ ఏకంగా 40 శాతం తగ్గిపోవటమే కాదు.. షేర్ వాల్యూ అంతకంతకూ పడిపోవటం మొదలైంది. దీంతో కంపెనీలోనే కాదు.. షేర్ హోల్డర్లలోనూ అలజడి మొదలైంది. దీంతో.. ఈ స్ట్రీమింగ్ దిగ్గజ విలువ నాలుగు నెలల్లో ఏకంగా మూడింట రెండు వంతులు కరిగిపోయింది.

మన రూపాయిల్లో చూస్తే.. కరిగిపోయిన విలువ ఏకంగా 1.14వేల కోట్లుగా తేల్చారు. దీంతో.. ఒక్కసారిగా ఉలిక్కిపడిన సదరు కంపెనీ దిద్దుబాటు చర్యల్ని యుద్ధ ప్రాతిపదికన మొదలు పెట్టింది.

కంపెనీ కోల్పోయిన యూజర్లను తిరిగి రాబట్టుకోవటానికి కొత్త ప్లాన్లను సిద్ధం చేసింది. చిలీ.. కోస్టారికా.. పెరూ దేశాల్లో పాస్ వర్డ్స్ షేర్ చేస్తే అదనంగా వసూలు చేసే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవటంతో పాటు.. చందా విలువను కూడా తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. సరికొత్తగా యాడ్ సపోర్టెడ్ టైర్ ను తీసుకొచ్చింది. మొత్తంగా చేజారిన యూజర్లను.. కోల్పోయిన షేర్ వాల్యూను తిరిగి రాబట్టుకునేందుకు కిందా మీదా పడుతోంది. అందుకే అంటారు దిగ్గజ కంపెనీలకు కక్కుర్తి ఉండకూడదని.