Begin typing your search above and press return to search.

పార్టీ పెట్టేంత సీన్ ఉందా ?

By:  Tupaki Desk   |   4 Jan 2022 6:30 AM GMT
పార్టీ పెట్టేంత సీన్ ఉందా ?
X
ఏపీలో రాజకీయ పార్టీ పెట్టకూడదని రూలు ఏమన్నా ఉందా ? ఇది తాజాగా వైఎస్ షర్మిల చేసిన వ్యాఖ్య. దీన్ని పట్టుకుని తొందరలోనే ఏపీలో పార్టీ పెట్టబోతున్న షర్మిల అంటూ మీడియా నానా గోల చేస్తోంది. క్షేత్రస్ధాయిలోని వాస్తవాలను గమనిస్తే ఏపిలో పార్టీ పెట్టేంత సీన్ షర్మిలకు లేదనే అనిపిస్తోంది. తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తానంటు ఒకపుడు బాగా హడావుడి చేసిన షర్మిల ఇపుడు పూర్తిగా చప్ప పడిపోయారు. తెలంగాణలో పార్టీ పెట్టినా ఇంకా ఉనికి కోసమే నానా అవస్థలు పడుతున్నారు.

తెలంగాణలో షర్మిల పెట్టిన వైఎస్సార్టీపిని మామూలు జనాలే కాకుండా ప్రత్యర్ధి పార్టీలు కూడా ఏమాత్రం పట్టించుకోవటంలేదు. వాస్తవం ఇలాగుంటే ఇప్పటికిప్పుడు ఏపీలో పార్టీని పెట్టడం సాధ్యమవుతుందా ? ఆల్రెడీ తెలంగాణాలో పెట్టిన పార్టీకి వైఎస్సార్టీపి అని పేరు పెట్టుకున్నారు. మరిపుడు ఏపీలో అంటే మళ్ళీ ఏమి పేరు పెడతారు. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన వైఎస్సార్సీపీ అధికారంలో ఉంది. మరిపుడు జగన్ చెల్లెలు తన పార్టీకి ఏపీలో ఏమని పేరుపెట్టుకుంటారు.

పేరులో దివంగత ముఖ్యమంత్రి, తండ్రి వైఎస్సార్ పేరైతే ఉండాల్సిందే కదా. ఒకవేళ ఏపీలో వైఎస్సార్ పేరొచ్చేట్లు ఏమైనా పేరు పెట్టుకుని పార్టీ ఏర్పాటు చేస్తారా ? ఒకవేళ అదే జరిగితే తెలంగాణ పార్టీ ఏమవుతుంది ? షర్మిల అధ్యక్షతన తెలంగాణ లో ఒక పార్టీ, ఏపీలో మరో పార్టీ ఉంటుందా ? రెండు రాష్ట్రాల్లో రెండు పేర్లతో పార్టీని నిర్వహించేంత సీన్ షర్మిలకు ఉందా ? ఇపుడు తెలంగాణ లో పెట్టిన పార్టీకే దిక్కులేకుండా ఉంది. కేవలం ఉనికి చాటు కోవడం కోసమే నిరుద్యోగ దీక్షలని, పాదయాత్రని షర్మిల నానా అవస్థలు పడుతున్నారు.

షర్మిల రాజకీయ నినాదం ఏమిటి ? రాజన్న రాజ్యాన్ని తీసుకురావటమే కదా. ఏపీలో ఇప్పటికే జగన్ ఆధ్వర్యంలో రాజన్న రాజ్యం వచ్చిందని వైసీపీ నేతలు చెప్పుకుంటున్నారు. ఇప్పటికే ఏపీలో రాజన్న రాజ్యం వచ్చేసిందని చెబుతున్నపుడు మళ్ళీ షర్మిల ఏమని చెబుతారు ? ఈ పాయింట్ మీదే తెలంగాణాలో పార్టీ పెట్టినపుడు రాజన్న రాజ్యం తీసుకొస్తానని ప్రకటించింది. కాబట్టి ఏపీలో షర్మిల పార్టీ పెట్టడం అంత ఈజీ కాదు. నిజంగానే ఏపీలో కొత్త పార్టీ పెట్టేట్లయితే తెలంగాణలో పార్టీని మూసేయాల్సిందే తప్ప వేరే దారిలేదు.

ఎందుకంటే రెండు రాష్ట్రాల్లో ఒకే వ్యక్తి ఆధ్వర్యంలో రెండు ప్రాంతీయ పార్టీలు నడపడం సాధ్యం కాదు. షర్మిలకు ఒకటే చాయిస్ ఉంది. మొదటిది తెలంగాణాలో పార్టీని మూసేయటం. లేదా ఏపీ రాజకీయాలకు దూరంగా ఉండటం. కాదు కూడదని ఏపీలో కూడా పార్టీ పెడతానంటె జనాల్లో నవ్వులపాలు కావటం మినహా సాధించేదేమీ ఉండదు. మహా అయితే జగన్ వ్యతిరేక మీడియా నాలుగు రోజులు షర్మిలకు మద్దతుగా హడావుడి చేయటం తప్ప ఇంకేమీ జరగదు.