Begin typing your search above and press return to search.

చంద్రబాబు ఎక్కడా అప్పు చేయరా... ?

By:  Tupaki Desk   |   28 Aug 2021 3:30 AM GMT
చంద్రబాబు ఎక్కడా అప్పు చేయరా... ?
X
ఏపీ అప్పుల కుప్ప. ఆ విషయంలో రెండవ మాటకు అసలు తావు లేనే లేదు. జగన్ కంటే ముందు ముఖ్యమంత్రిగా ఉన్న‌ చంద్రబాబే అప్పులు చేసి నెట్టుకువచ్చారు. ఇక దాన్ని జగన్ కంటిన్యూ చేస్తున్నారు. మరి జగన్ అప్పులు చేస్తున్నారు అని టీడీపీ అనుకూల మీడియా రాతలు రాస్తోంది. తెల్లారి లేస్తే టీడీపీ పెద్దలు కూడా అదే మాట మాట్లాడుతున్నారు. ఇదంతా బాగానే ఉంది కానీ రేపటి రోజున జనాలు కరుణించి చంద్రబాబు ఏపీ సీఎం కుర్చీలో కూర్చున్నారే అనుకుంటే అప్పుడు ఆయన అప్పులు చేయకుండా పాలిస్తారా అన్నది సగటు జనం డౌట్.

అప్పు చేయడం తప్పు అని చెబుతున్న తెలుగు తమ్ముళ్ళు తమ హయాంలో ఎందుకు మూడు లక్షల కోట్లు అప్పులు తెచ్చారు అన్నది కూడా పాయింటే కదా..! నిజంగా చెప్పాలంటే జగన్ వచ్చే ఎన్నికల్లో గెలిచినా కూడా ఇదే సీన్ ఉంటుంది. అప్పటికి జనాలకు అప్పుల గోల కూడా అలవాటు అయిపోతుంది. జగన్ని ఎటూ అప్పుల అప్పారావుగా మార్చేసి ఆయన మీద బురద జల్లిన పాపానికి టీడీపీ కూడా ఏమీ అనలేదు. పైగా అప్పులు తెచ్చి పప్పు కూడు వండుతాడు అని తెలిసినా జగన్ని జనాలు ఎన్నుకున్నారు అంటే ఆయనకు లైసెన్స్ ఇచ్చేసినట్లే. ఆ విధంగా ఏ శ్రమా లేకుండా జగన్ అప్పులు చేసుకోవడానికి టీడీపీ ఆయన మీడియా చాలా గొప్పగానే సాయపడుతోంది అనుకోవాలి.

కానీ పొరపాటునో గ్రహపాటునో చంద్రబాబే 2024 ఎన్నికలలో అధికారంలోకి వచ్చారనుకుంటే అప్పుడు ఆయన పరిస్థితి ఏంటి. అప్పటిదాకా అప్పు చేయడం తప్పు అంటూ భారీ స్టేట్మెంట్స్ ఇచ్చేసిన టీడీపీ పెద్దలు జనాలకు ఏం చెబుతారు. ఇక అప్పులు చేయకుండా పూట గడవని ఏపీ ఖజానాను ఎలా నింపుతారు. మరి ఈ విషయంలో ఏ మాత్రం ముందు చూపు ఉన్నా అప్పులు ఏపీ అంటూ ఇష్టం వచ్చినట్లుగా విమర్శలు చేయరనే అంటారు అంతా. చూడబోతూంటే తమ ముందర కాళ్ళకు బంధం వేసుకునేలాగానే టీడీపీ విధానాలూ విమర్శలు ఉన్నాయనే అంటున్నారు. మొత్తానికి అప్పు చేసి అయినా ఏపీలో పధకాలు అమలు చేస్తున్న జగన్ గెలుస్తాడా. అప్పు తప్పు అంటున్న బాబు గెలుస్తాడా అన్నది 2024 ఎన్నికల్లో ఆసక్తికరమైన అంశంగానే ఉంటుంది మరి.