Begin typing your search above and press return to search.

కరోనా కల్లోలం.. భాజపా నేత ఉచిత సలహాపై నెటిజన్లు ఫైర్

By:  Tupaki Desk   |   30 April 2021 12:30 PM GMT
కరోనా కల్లోలం.. భాజపా నేత ఉచిత సలహాపై నెటిజన్లు ఫైర్
X
కరోనా సృష్టించే కల్లోలం ఒకవైపు.. నివారణ కోసం దుష్ర్పచారాలు మరోవైపు సామాన్యులను తికమకపెడుతున్నాయి. మహమ్మారిని ఎదుర్కొవడానికి ఎవరికి తోచింది వారు చెబుతున్నారు. సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టే పద్ధతులను కొందరు నమ్మి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. కర్నాటకలో ఓ టీచర్ ఇలాగే చేసి మృత్యువాత పడ్డారు. ముక్కులో నిమ్మరసం వేసుకుంటే కొవిడ్ సోకదని ఎవరో చెబితే ప్రయత్నించిన ఆయన... అది వికటించి ప్రాణాలు కోల్పోయారు.

ముక్కులో నిమ్మరసం వేసుకుంటే కరోనా రాదని భాజపా నేత విజయ్ శంకేశ్వర్ చెప్పారు. రెండు చుక్కల నిమ్మరసాన్ని ముక్కులో వేసుకుంటే ఆక్సిజన్ సాచురేషన్ లెవల్స్ పెరుగుతాయని అన్నారు. ఇలా చేస్తే రెండు చుక్కలతో కరోనాను ఎదుర్కొవచ్చని తెలిపారు. ఈ విషయంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇలాంటి ఉచిత సలహాల వల్లే చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారని మండిపడ్డారు.ఆయన చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. అసత్య ప్రచారాలను నమ్మి అమాయకులు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఇదిలా ఉండగా బీరు తాగితే కరోనా రాదు, పసుపు తింటే రాదు, ఎండలో ఉంటే వైరస్ రాదు అని రకరకాల వార్తలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. కరోనా కాలంలో ఇలాంటివి ఎక్కువ అయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈ విపత్కర సమయంలో సొంత వైద్యం పనికి రాదని మరోవైపు ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఏది పడితే అది నమ్మొద్దని హెచ్చరిస్తున్నారు. వైద్యుల సమక్షంలో చికిత్స తీసుకుంటూ మనోధైర్యంతో ఉంటే కరోనా రాదని చెప్పారు. సామాజిక మాధ్యమాల్లో ప్రచారం అయ్యే పుకార్లను నమ్మకుండా కరోనాను ధైర్యంగా ఎదుర్కొవాలని సూచించారు.