Begin typing your search above and press return to search.

ఇందిరాగాంధీతో పోరాడాడా ?

By:  Tupaki Desk   |   15 April 2021 5:32 AM GMT
ఇందిరాగాంధీతో పోరాడాడా ?
X
‘బొంకరా బొంకరా పోలిగా అంటే మా ఊరి మిరియాలు తాటికాయలంత’ అన్నాడట వెనకటికి ఎవడో. అలాగే ఉంది చంద్రబాబునాయుడు చెప్పినమాటలు. లోక్ సభ ఉపఎన్నికల్లో భాగంగా సత్యవేడు, గూడురులో చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతు గతంలో ప్రధానమంత్రులుగా పనిచేసిన ఇందిరాగాంధి, రాజీవ్ గాంధితోనే తాను పోరాడినట్లు చెప్పారు. చంద్రబాబు చెప్పిన మాటలు విన్నవారికి ఆశ్చర్యమేసింది.

ఎందుకంటే ఇందిరాగాంధి 1984లో మరణించారు. ఆమె ప్రధానమంత్రిగా ఉన్నపుడే సెక్యురిటి గార్డు కాల్పుల్లో చనిపోయారు. అప్పటికి చంద్రబాబు స్ధాయి ఏమిటి ? కేవలం రాష్ట్రమంత్రివర్గంలో ఒక సభ్యుడంతే. కేంద్ర, రాష్ట్రాల్లో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వాలే. కాంగ్రెస్ ప్రధానమంత్రి మీద రాష్ట్ర మంత్రివర్గంలో ఉన్న ఒక మంత్రి ఏ విధంగా పోరాడారు ? అప్పటికి ఎవరిమీద కూడా పోరాడేంత సీన్ చంద్రబాబుకు లేదు. ఎందుకంటే అప్పటికి చంద్రబాబుకన్నా దగ్గుబాటి వెంకటేశ్వరరావు లాంటి సీనియర్లు టీడీపీలో చాలామందే ఉన్నారు.

ఇక మరో ప్రధానమంత్రి రాజీవ్ గాంధి మీద పోరాటం చేశారట. రాజీవ్ ప్రధానమంత్రిగా పనిచేసింది 1984-89 మధ్య. 1983లో ఇందిరాగాంధి అకాలమరణం తర్వాత రాజీవ్ అధికారం చేపట్టారు. 1984లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ బంపర్ మెజారిటి సాధించటంతో రాజీవ్ ప్రధానయ్యారు. 1991 ఎన్నికల ప్రచారంలో ఎల్టీటీఇ చేతిలో మరణించారు. రాజీవ్ మరణిచేనాటికి తెలుగుదేశంపార్టీ అధినేత ఎన్టీయార్.

టీడీపీలో చంద్రబాబు ఓ ఎంఎల్ఏ మాత్రమే. కాకపోతే ఎన్టీయార్ అల్లుడిహోదాలో ఉన్నారంతే. 1989-94 మధ్య రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండగా టీడీపీ ప్రతిపక్షంలో ఉంది. ప్రతిపక్ష నేతగా ఎన్టీయార్ ఉన్నపుడు ఇక రాజీవ్ మీద పోరాడేంత సీన్ చంద్రబాబుకు ఎక్కడినుండి వచ్చింది ? 1991లో రాజీవ్ మరణించేనాటికి మాజీ ప్రధానమంత్రి. అంటే ఏరకంగా చూసుకున్నా అటు ఇందిరతో కానీ ఇటు రాజీవ్ తో కానీ చంద్రబాబు పోరాటాలు చేసిందేమీ లేదు.

ఇందిర, రాజీవ్ తో చేసిన పోరాటాల విషయంలో చంద్రబాబు అబద్ధాలు చెబుతున్న విషయం చాలామందికి తెలుసు. తాను అబద్ధాలు చెబుతున్న విషయం చంద్రబాబుకు తెలిసినా చెప్పటం అలవాటుగా మారిపోయిందంతే. ప్రతిపక్షపార్టీ ఎంఎల్ఏ హోదాలో ప్రధానమంత్రి మీదో లేకపోతే మాజీ ప్రధాని మీదో ఓ ప్రకటన చేసేస్తే దాన్ని పోరాటమంటారా ? పోరాటమంటే అప్పట్లో ఇందిర మీద ఎన్టీయార్ చేసింది. ఇపుడు నరేంద్రమోడి మీద మమతబెనర్జీ చేస్తున్నది.