Begin typing your search above and press return to search.

ఏందేంది? ‘నారా ఫ్యామిలీ పర్సనల్ ప్రొటెక్షన్ గ్రూపు’ పేరుతో కార్డులా?

By:  Tupaki Desk   |   22 May 2021 3:47 AM GMT
ఏందేంది? ‘నారా ఫ్యామిలీ పర్సనల్ ప్రొటెక్షన్ గ్రూపు’ పేరుతో కార్డులా?
X
కరోనా వేళ.. అందునా ప్రభుత్వం లాక్ డౌన్ విధించినప్పుడు.. అత్యవసర పనులకు మాత్రమే బయటకు రావాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన తర్వాత బయటకు ఎవరు వెళ్లాలి? ఎవరు వెళ్లకూడదన్న విషయం అందరికి తెలిసిందే. ఒకవేళ.. లాక్ డౌన్ వేళలో బయటకు రావాలంటే.. సరైన కారణంతో పాటు.. అందుకు సంబంధించి పోలీసు అధికారుల నుంచి పాసుల్ని తీసుకోవాల్సి ఉంటుంది. అందుకు భిన్నంగా జూబ్లీహిల్స్ పోలీసులకు సిత్రమైన అనుభవం ఎదురైంది.

శుక్రవారం ఉదయం పది గంటల తర్వాత.. అంటే లాక్ డౌన్ టైం మొదలైన తర్వాత జూబ్లీహిల్స్ రోడ్డు నెంబరు 36 నీరూస్ చౌరస్తాలో.. టూ వీలర్ మీద ఒక వ్యక్తిని పోలీసులు ఆపారు. సదరు వ్యక్తి దర్జాగా.. జేబులో నుంచి ఒక ఐడీ కార్డు చూపించి.. తనకు లాక్ డౌన్ మినహాయింపు ఉందని పేర్కొన్నారు. ఇంతకూ ఆ ఐడీ కార్డును చూసిన పోలీసులు కంగుతిన్నారు.

అందులో.. ‘నారా ఫ్యామిలీ పర్సనల్ ప్రొటెక్షన్ గ్రూప్’ పేరుతో గుర్తింపు కార్డు ఉండటం.. సదరు వ్యక్తిని జాషువాగా గుర్తించారు. ఈ కార్డు ఎవరిచ్చారని పోలీసులు ప్రశ్నించగా.. చంద్రబాబు కుటుంబం వద్ద పని చేస్తున్న పాతిక మందికి పైగా సిబ్బందికి ఈ తరహా గుర్తింపు కార్డులు ఇచ్చినట్లుగా సమాచారం. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న కార్డును చూపించటం.. లాక్ డౌన్ వేళలో బయటకు వచ్చిందనకు ఫైన్ వేసి.. కేసు నమోదు చేశారు. అయినా.. వ్యక్తిగతంగా ఉండాల్సిన ఈ తరహా కార్డుల్ని.. దర్జాగా పోలీసులకు చూపించటం ఏమిటి? అయినా సెక్యురిటీ వారికి ఐడీ కార్డులు ఇవ్వాలంటే ఎన్నో పేర్లు ఉండగా.. నారా ఫ్యామిలీ పర్సనల్ ప్రొటెక్షన్ గ్రూపు పేరేంటి?