Begin typing your search above and press return to search.

హెల్త్ మినిస్టర్ అయి ఉండి.. ఈ మాటలేంది ఈటెల

By:  Tupaki Desk   |   12 April 2021 4:15 AM GMT
హెల్త్ మినిస్టర్ అయి ఉండి.. ఈ మాటలేంది ఈటెల
X
ఉద్యమ నాయకుడిగా.. మిగిలిన చాలామందితో పోలిస్తే నిజాయితీ విషయంలోనూ.. తెలంగాణకు సంబంధించిన కమిట్ మెంట్ల విషయంలోనూ వేలెత్తి చూపించలేని కొద్దిమందిలో తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖామంత్రి ఈటెల రాజేందర్ ఒకరు. కరోనా కష్టకాలంలో వైద్య ఆరోగ్య శాఖా మంత్రిగా ఉంటూ.. విపరీతమైన ఒత్తిడిని ఎదుర్కొంటూ పని చేస్తున్న ఆయన.. తాజాగా ఒక ప్రముఖ మీడియా సంస్థకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన నోటి నుంచి వచ్చిన ఒక మాట విన్నంతనే అవాక్కు అయ్యేలా చేస్తోంది.

మిగిలిన మంత్రిత్వ శాఖ నిర్వర్తిస్తూ.. ఇలాంటి మాట ఆయన నోటి నుంచి వస్తే అదో పరిస్థితి. సర్లే అని సర్దుకుపోవచ్చు. ఏకంగా వైద్య ఆరోగ్య శాఖామంత్రిగా ఉంటూ ఆయన నోటి నుంచి వచ్చిన మాట షాకింగ్ గా మారింది. కరోనా సెకండ్ వేవ్ ను తాను అస్సలు ఊహించలేదన్న మాట ఈటెల నోటి నుంచి రావటం చూస్తే.. అవాక్కు అవ్వాల్సిందే. వైద్య ఆరోగ్య శాఖా మంత్రిగా ఉన్న వేళ.. ఎంతోమంది ప్రముఖులతో ఆయన భేటీ అవుతుంటారు. కరోనా గురించి.. దాని తీరు గురించి అధ్యయనం చేసిన వారెవరూ.. ఫస్ట్ వేవ్ తోనే ఆగిపోదని.. రెండు.. మూడు వేవ్ లు తప్పదని.. అందునా భారత్ లాంటి దేశంలో అది తప్పనిసరి అన్నది మర్చిపోకూడదు.

అన్నింటికి మించి.. ఇరుగున ఉన్న మహారాష్ట్రలో అంత భారీగా కేసులు నమోదవుతున్న వేళ.. దాని ప్రభావం తెలంగాణ మీద తప్పనిసరిగా పడుతుందన్న విషయం మహమ్మారి మీద ఏ మాత్రం అవగాహన ఉన్నా.. అంచనా వేస్తారు. అలాంటిది ఈటెల లాంటి పెద్ద మనిషికి సెకండ్ వేవ్ వస్తుందని అస్సలు ఊహించలేదని ఆయన వ్యాఖ్యానించటం మింగుడుపడనిదిగా మారింది. మహారాష్ట్రలో కేసులు పెరగటం.. వందల కిలోమీటర్ల సరిహద్దు ఉండటం.. ఇచ్చిపుచ్చుకునే సంబంధాలు ఉండటంతో ఇక్కడ కూడా కేసులు పెరుగుతాయని ఊహించామని చెప్పారు.

కేసులు పెరుగుతాయని ఊహించిన తర్వాత..సెకండ్ వేవ్ రాకుండా ఎందుకు ఉంటుంది? అన్నది ప్రశ్న. తెలంగాణకు సరిహద్దుగా ఉన్న ఏపీ.. కర్ణాటక.. ఛత్తీస్ గఢ్.. మహారాష్ట్రలలో కేసులు పెరుగుతున్న వేళ.. సీఎం కేసీఆర్ తమను అప్రమత్తం చేశారని.. దీన్ని ఎలా ఎదుర్కోవాలన్న దానిపై దృష్టి పెట్టినట్లుగా ఆయన పేర్కొనటం చూస్తే.. ఈటెల వారి తప్పులు ఇట్టే అర్థమైపోతాయి. పనుల ఒత్తిడిలో తలమునకలై ఉండే ముఖ్యమంత్రి.. కరోనా పై వైద్య ఆరోగ్య శాఖామంత్రిని అలెర్టు చేయాల్సి రావటం ఏమిటి? అన్న సందేహం రాక మానదు. ఈటెల లాంటి వారి నుంచి ఊహించలేని ఈ మాటలు ఇప్పుడు షాకింగ్ గా మారాయి.