Begin typing your search above and press return to search.

ఎన్నికల వేళ ఇలాంటి మాటలు మంట పుట్టిస్తాయి హరీశ్

By:  Tupaki Desk   |   4 March 2021 10:30 AM GMT
ఎన్నికల వేళ  ఇలాంటి మాటలు మంట పుట్టిస్తాయి హరీశ్
X
కీలకమైన రెండు ఎమ్మెల్సీ ఎన్నికలు తెలంగాణలో జరుగుతున్న సంగతి తెలిసిందే. తెలంగాణ అధికారపక్షానికి ఏ మాత్రం అచ్చిరాని హైదరాబాద్..రంగారెడ్డి.. మహబూబ్ నగర్ అయితే.. రెండోది అధికారపార్టీ సిట్టింగ్ ఎమ్మెల్సీ ఉన్న నల్గొండ.. వరంగల్.. ఖమ్మం జిల్లాలకు ఎన్నిక జరుగుతోంది. ఇంటికో ఉద్యోగాన్ని.. అవసరమైతే చదువుకున్నోళ్లు ఉంటే ఇంటికి రెండు ఉద్యోగాలు ఇస్తామని అప్పుడెప్పుడో కేసీఆర్ అన్న మాట వీడియోను వైరల్ చేస్తూ.. తెలంగాణ అధికారపక్షంపై ఒత్తిడి పెంచుతున్నాయి విపక్షాలు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రభావాన్ని చూపే విద్యాధికులు మనసుల్ని ప్రభావితం చేసేలా ఉద్యోగాల భర్తీపై విపక్షాలు వ్యూహాత్మకంగా విమర్శనాస్త్రాల్ని సంధిస్తున్నాయి. దీంతో.. అధికారపక్షం డిఫెన్సులో పడుతున్న పరిస్థితి. ఉద్యోగాల భర్తీపై ఇప్పటికే సమాధానం చెప్పలేక కిందా మీదా పడుతున్న తెలంగాణ అధికార పక్షం.. ఎమ్మెల్సీ గండాన్ని ఎలా అధిగమించాలన్నది పెద్ద సమస్యగా మారింది. ఇలాంటివేళ.. మంత్రి హరీశ్ నోటి నుంచి వచ్చిన మాట ఆశ్చర్యకరంగానే కాదు..అధికార పార్టీని ఇరుకున పెడుతుందని చెబుతున్నారు.

తాము అధికారంలోకి వచ్చాక1.32 లక్షల ఉద్యోగాలు భర్తీ చేశామని.. త్వరలో మరో 50 వేల ఉద్యోగాల భర్తీకి ప్రకటన వెలువడనుందని ఆయన ప్రకటించారు. ఆరేళ్లకు 1.32 లక్షలఉద్యోగాలు భర్తీ అయితే..ఎన్నికలు అయిన వెంటనే 50వేల పోస్టుల భర్తీ అంటే.. ప్రాక్టికల్ గా ఎంతవరకు సాధ్యమన్న ప్రశ్న పట్టభద్రుల్లో కలగటం ఖాయం. ఎన్నికల వేళ చెప్పే మాటలకు ఉండే విశ్వసనీయత తక్కువే. అదే సమయంలో.. ఆరేళ్లు అధికారంలో ఉన్నప్పుడు చేయలేనిపనిని.. ఎన్నికలైన వెంటనే ఎలా చేస్తారన్నది మరో ప్రశ్న.

ఒకవేళ చేస్తారనే అనుకుందాం.. ఇప్పటివరకు ఎందుకు చేయలేదు? అన్నది మరో ప్రశ్న. ఇలా తేనెతుట్టెను కదిలించే అంశాన్ని హరీశ్ టచ్ చేయకుండా ఉంటే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. హరీశ్ లాంటి సీనియర్ నేత.. ఇంత సింఫుల్ గా ప్రతిపక్షాల ట్రాప్ లో ఎలా పడ్డారన్న ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉద్యోగాల భర్తీ అన్న మాట అధికారపక్షం నుంచి వస్తే చాలు.. నిరుద్యోగులు మండిపడుతున్నట్లు చెబుతున్నారు. ఈ విషయంలో హరీశ్ ది రాంగ్ టైమింగ్ అన్న మాట పలువురి నోట వినిపిస్తోంది.