Begin typing your search above and press return to search.

మోడీ మేల్కొనాలంటే దేశం ఇంత మూల్యం చెల్లించాలా?

By:  Tupaki Desk   |   23 April 2021 3:30 AM GMT
మోడీ మేల్కొనాలంటే దేశం ఇంత మూల్యం చెల్లించాలా?
X
- ఆసుపత్రి గేటు దగ్గర ఊపిరి తీసుకోవటానికి తెగ ఇబ్బంది పడుతూ ఉండే భర్త. అతడ్ని బతికించుకోవటం కోసం నిస్సహాయంగా ఎదురు చూసే భార్య.. కాసేపటికే ప్రాణలు విడిచిన భర్త!

- అంబులెన్సులో ఆక్సిజన్ అందక ఆయాసపడుతున్న తల్లి. ఆమెను కాపాడుకోవటం కోసం కనిపించినోళ్లందరికి మొక్కిన కొడుకు.. గంటలు గడిచినా అందని వైద్యం.. చివరకు అంబులెన్సులోనే ప్రాణాలు విడిచిన తల్లి!

కరోనా నిర్ధారణ పరీక్ష కోసం బారులు.. ఓపిక లేదు.. మీరు కోరినంత డబ్బులు ఇస్తామన్నా రాలేమని చెప్పే డయాగ్నస్టిక్ సెంటర్ల సిబ్బంది.. సిటీ స్కాన్ తీయించుకోవాలంటే.. కనీసం 24 గంటల వెయిటింగ్.. రెమిడెసివర్ కోసం పాట్లు.. ఆసుపత్రిలో ఆడ్మిషన్ల కోసం ఆరాటం.. ఆక్సిజన్ కోసం పోరాటం.. వెరసి పోయే ప్రాణాలు పోతుంటే.. ఏమీ చేయలేని నిస్సహాయ పరిస్థితుల్లో వైద్యులు. తీరా మరణించిన తర్వాత కూడా తప్పని తిప్పలు. మరణించిన వారిని గౌరవంతో అంతిమ సంస్కారాలు జరిపేందుకు గంటల కొద్దీ వెయిటింగ్.. ఏం పాపం చేసుకుందీ దేశం. పిట్టల్లా రాలిపోయే ప్రజలు.. పట్టించుకోని ప్రభుత్వాలు.

మైకు ముందుకు వస్తే చాటు.. కోటలు దాటే మాటలు చెప్పే వారు.. దేశ ప్రజలు ఈ రోజున ఇంతటి దుస్థితిలో చిక్కుకుపోవటానికి కారణం ఎవరు? ఎవరిది వైఫల్యం? ఎవరు చేసిన తప్పునకు ఎవరు శిక్ష అనుభవిస్తున్నారు. ప్రశ్నలు పేర్చుకుంటూ పోవటమే కానీ.. సమాధానాలు మాత్రం దొరకని దుస్థితి. వ్యవస్థలు చేష్టలుడిగిపోయిన వేళ.. భారతావని యావత్తు కరోనా కోరల్లో చిక్కుకుపోయి విలవిలలాడిపోతుంది.

ఇంత బీభత్సం తర్వాత కానీ.. ప్రధాని మోడీకి ఎందుకో రంగంలోకి దిగాలనిపించింది. షెడ్యూల్ లో భాగంగా బెంగాల్ లో నిర్వహించే ఎన్నికల సభకు వెళ్లాల్సిన ఆయన మనసు ఇన్నాళ్లకు ఎందుకో ఒప్పుకోలేదు. తెలుగు సీరియల్ కు ఏ మాత్రం తీసిపోని రీతిలో ఎనిమిది దశల్లో బెంగాల్ రాష్ట్ర ఎన్నికలు నిర్వహించాలన్న చారిత్రక నిర్ణయాన్ని తీసుకున్న ఈసీ పుణ్యమా అని.. చెలరేగిపోతూ ప్రచారం చేసిన మోడీషాలు.. పాలనను పక్కన పెట్టేశారు.

అందుకు తగ్గట్లే.. దొరికిన అవకాశాన్ని ఏ మాత్రం వదులుకోని కరోనా చెలరేగిపోయింది. దేశ వ్యాప్తంగా పెరిగిపోతున్న కేసులు..ఆక్సిజన్ కొరతతో ప్రాణాలు పోతున్న ప్రాణాలు.. సరైన సమయంలో వైద్యం అందించటానికి సరిపోని ఆసుపత్రుల కారణంగా.. యావత్ దేశం హాహాకారాలు చేస్తున్న పరిస్థితి. ఇలాంటివేళ.. పరిస్థితిని చక్కదిద్దేందుకు మోడీ నడుం బిగించారట. శుక్రవారం ఉదయం ఆక్సిజన్ ఉత్పత్తిదారులతో.. పారిశ్రామికవేత్తలతో చర్చలు జరపనున్నారు. దానికి ముందు.. కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులతో భేటీ కానున్నారు. తాజాగా చోటు చేసుకున్న సంకట స్థితిని అధిగమించటానికి ఏం చేయాలన్న దానిపై చర్చలు జరపనున్నారు. కరోనా కార్చిచ్చు దేశాన్ని అంటుకున్న వేళ.. పట్టించుకోని మోడీ.. అంతకంతకూ విస్తరిస్తున్న మంటల్ని ఆర్పేందుకు ఇప్పుడు రంగంలోకి దిగటమా? అన్నది క్వశ్చన్. ప్రధాని మోడీలాంటి పెద్ద మనిషి రంగంలోకి దిగాలంటే.. దేశం.. దేశ ప్రజలు ఇంత మూల్యం చెల్లించాలా?