Begin typing your search above and press return to search.

తనను చాలా ఎక్కువగా ఊహించుకుంటున్నాడా?

By:  Tupaki Desk   |   27 March 2021 9:30 AM GMT
తనను చాలా ఎక్కువగా ఊహించుకుంటున్నాడా?
X
నరసాపురం వైసీపీ తిరుగుబాటు ఎంపి రఘురామకృష్ణంరాజు తనను తాను చాలా ఎక్కువగా ఊహించుకుంటున్నట్లుంది. ప్రతి చిన్న విషయానికి జగన్మోహన్ రెడ్డితో పోలికో లేకపోతే జగన్ పై ఆరోపణలు, విమర్శలు చేయందే ఈ తిరుగుబాటు ఎంపికి రోజు గడవటం లేదేమో. తాజాగా ఆయనపై సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదుచేసింది. బ్యాంకుల కన్సార్షియంను మోసం చేసి రూ. 234 కోట్లు దారిమళ్ళించిన కారణంగా ఎస్బీఐ ఉన్నతాధికారి ఇచ్చిన ఫిర్యాదుతో ఎంపి+కుటుంబసభ్యులు+డైరెక్టర్లపైన ఎఫ్ఐఆర్ నమోదైంది.

కేసు నమోదుచేసింది సీబీఐ. ఫిర్యాదుచేసింది ఎస్బీఐ ఉన్నతాధికారి. ఆరోపణేమో వందల కోట్లరూపాయలను దారిమళ్ళించటం. ఇది కేవలం ఆరోపణ మాత్రమే కాదు. అంతర్గతంగా విచారణ చేసుకున్న తర్వాతే బ్యాంకుల కన్సార్షియం ఫిర్యాదుచేసింది. వాస్తవం ఇలాగుంటే తనమీద సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేయటానికి కారణం జగనే అంటున్నాడు ఈ ఎంపి. తనపై ఎఫ్ఐఆర్ నమోదు వెనుక జగన్ ఒత్తిడే కారణమంటు ఎంపి మండిపోతున్నారు.

అసలు ప్రతిదానికి జగన్ను పిక్చర్లోకి ఎంపి ఎందుకు తీసుకొస్తున్నాడో ఎవరికీ అర్ధం కావటంలేదు. జగన్ చెబితేనో లేకపోతే ఒత్తిడి తీసుకొస్తేనో ఎంపిపైన సీబీఐ కేసు పెట్టేస్తుందా ? గిట్టని వాళ్ళమీద సీబీఐ పై ఒత్తిడి తెచ్చి కేసులు పెట్టించేంత సీనే జగన్ కుంటే తనపైన సీబీఐ కేసు పెట్టేదేనా అసలు ? బ్యాంకుల్లో అప్పులు తీసుకుంది ఎంపి, తీసుకున్న అప్పును పక్కదారి పట్టించింది ఎంపి. బ్యాంకులు కేసు పెడితే జగన్ కేమి సంబంధం ?

తనపైన నమోదైన ఎఫ్ఐఆర్ ను తప్పుడుదని చెబుతున్న ఎంపి మరి జగన్ పైన వెంటనే సీబీఐ విచారణ చేయటం లేదని అడగటమే విచిత్రంగా ఉంది. ఇక్కడ గమనించాల్సిందేమంటే తనను తాను జగన్ సమానస్ధాయి వ్యక్తిగా పోల్చుకుంటున్నట్లున్నారు. అందుకనే ప్రతిరోజు జగన్ను టార్గెట్ చేస్తున్నారు. తనవల్లే నరసాపురంలో వైసీపీ గెలిచిందని చెప్పే ఎంపి మరి పార్టీకి రాజీనామా చేసేసి మళ్ళీ పోటీచేసి గెలవచ్చు కదా. అప్పుడు ఎవరి కెపాసిటి ఏమిటో తెలిసిపోతుంది .