Begin typing your search above and press return to search.

అదేంది లోకేశా.. అలా మాట్లాడటం ఏమిటయ్యా? అదెలా సాధ్యం?

By:  Tupaki Desk   |   5 April 2021 4:49 AM GMT
అదేంది లోకేశా.. అలా మాట్లాడటం ఏమిటయ్యా? అదెలా సాధ్యం?
X
కాలు జారినా ఫర్లేదు కానీ నోరు మాత్రం జారొద్దన్న ముతక సామెతకు టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ నోటి నుంచి తాజాగా వచ్చిన వ్యాఖ్యకు లింకు పెడితే చాలామంది హర్ట్ కావొచ్చు. ఇక్కడ మా ఉద్దేశం.. విపక్ష పార్టీలో కీలక పదవిలో ఉన్న లోకేశ్ లాంటి వారు జనం మధ్యకు వచ్చి మాట్లాడే వేళ.. వారి నోటి నుంచి వచ్చే ప్రతి మాట మీదా అంతో ఇంతో ప్రభావం ఉంటుంది. తాను మాట్లాడే మాటల కారణంగా తెలుగుదేశం పార్టీకి లాభం చేకూరకపోయినా ఫర్లేదు.. నష్టం వాటిల్లితేనే ఇబ్బంది.

బ్యాడ్ లక్ ఏమంటే.. లోకేశ్ మైకు చేతపట్టుకొని.. గొంతు సవరించుకుంటే చాలు.. టీడీపీ తమ్ముళ్ల గుండెల్లో రైళ్లు పరిగెడుతూ ఉంటాయి. ఎప్పుడేం మాట ఆయన నోటి నుంచి వస్తుందన్నది ఒక పట్టాన అర్థం కాదు. తాజాగా అలాంటి మాటలే మరోసారి చినబాబు నోటి నుంచి వచ్చాయి. తాజాగా తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ అభ్యర్థి మాజీ కేంద్రమంత్రి పనబాక లక్ష్మీ తరఫున ప్రచారాన్ని నిర్వహించారు లోకేశ్.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడటానికి మరే టాపిక్ లేదన్నట్లుగా వ్యవహరించిన తీరు షాకింగ్ గా మారింది. వరదయ్యపాళెంలో నిర్వహించిన రోడ్ షోకు వచ్చిన జనం సంగతిని కాసేపు పక్కన పెడితే.. తన ప్రసంగంలో భాగంగా పెట్రోల్.. డీజిల్ ధరల్ని అనూహ్యంగా ప్రస్తావనకు తీసుకొచ్చారు. టీడీపీ అభ్యర్థి ఉప ఎన్నికల్లో గెలిస్తే.. పెట్రోల్.. గ్యాస్ ధరలు తగ్గుతాయన్న మాటలు ఇప్పుడు కామెడీగా మారాయి.

ఉప ఎన్నికకు పెట్రోల్.. గ్యాస్ ధరలకు లింకేమిటి? ఒకవేళ టీడీపీ అభ్యర్థి గెలిస్తే.. ఏ విధంగా పెట్రోల్.. గ్యాస్ ధరల్ని తగ్గేలా చేయగలరు? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కేంద్రం ఫిక్సు చేసే పెట్రో ధరల మీద లోకేశ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చగా మారటమే కాదు.. చినబాబు మళ్లీ తన మాటలతో పార్టీకి నష్టం వాటిల్లేలా చేశారన్న మాట వినిపిస్తోంది. అదేంది చినబాబు.. ఇలా ఎలా మాట్లాడతారు?