Begin typing your search above and press return to search.

బండికి తలంటుతున్న నెటిజన్లు

By:  Tupaki Desk   |   12 Aug 2022 4:39 AM GMT
బండికి తలంటుతున్న నెటిజన్లు
X
తెలంగాణా బీజేపీ చీఫ్ బండి సంజయ్ ముఖ్యమంత్రి కేసీయార్ ను ఒక చాలెంజ్ చేశారు. ఇంత పనికిమాలిన చాలెంజ్ బండి ఎలాచేశారా అని జనాలందరు నవ్వుకుంటున్నారు. ఇంతకీ ఆ చాలెంజ్ ఏమిటంటే టీఆర్ఎస్ లో చేరిన కాంగ్రెస్ ఎంఎల్ఏలందరితో కేసీయార్ రాజీనామాలు చేయించగలరా ? రాజీనామాలు చేయించి ఉపఎన్నికలో టికెట్లిచ్చి తిరిగి గెలిపించుకోగలరా ? అనే చాలెంజ్ చేశారు. ఇపుడా చాలెంజ్ పైనే నెటిజన్లు సోషల్ మీడియాలో విపరీతంగా బండిని ట్రోల్ చేస్తున్నారు.

ఇంతకీ విషయం ఏమిటంటే ఇతరపార్టీల నుండి తమపార్టీలోకి లాక్కున్న వాళ్ళు ఎవరూ వారితో రాజీనామాలు చేయించరన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ విషయంలో ఏపార్టీకి కూడా మినహాయింపులేదని జనాలందరు చూస్తున్నదే.

మిగిలిన పార్టీల సంగతి పక్కనపెట్టేసినా బీజేపీ చేసిందేమిటి ? బీజేపీలోకి ఫిరాయించిన నలుగురు రాజ్యసభ ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేష్, గరికపాటి మోహన్ రావు, టీజీ వెంకటేష్ తో రాజీనామాలు చేయించారా ? అని నెటిజన్లు నిలదీస్తున్నారు.

అలాగే కర్నాటక, మధ్యప్రదేశ్, గోవా, సిఖ్ఖిం, మేఘాలయాల్లో కాంగ్రెస్ ఎంఎల్ఏలతో పాటు మరికొందరు ఇతర పార్టీల నుండి ఎంఎల్ఏలను లాగేసుకుని ప్రభుత్వాలు ఏర్పాటుచేసిన సంగతి అందరికీ తెలిసిందే.

మరి వారందరినీ పార్టీలో చేర్చుకునేముందు వారితో ఎంఎల్ఏ పదవులకు ఎందుకు రాజీనామాలు చేయించలేదు ? ఎందుకు ఉపఎన్నికలకు వెళ్ళలేదని బండిని నెటిజన్లు ఫుల్లుగా వాయించేస్తున్నారు. కేసీయార్ ను బండి చాలెంజ్ చేయటమంటే అచ్చంగా గురివింద గింజ నీతిలాగే ఉందని కూడా అంటున్నారు.

రాజీనామాలు చేయించే విషయంలోను, ఉపఎన్నికలకు వెళ్ళే విషయంలోను కేసీయార్ తన చాలెంజ్ కి సమాధానం చెప్పాలని బండి డిమాండ్ చేయటమే విచిత్రంగా ఉంది. బండి చాలెంజ్ కు కేసీయార్ సమాధానం చెప్పటం వేరేసంగతి ముదు నెటిజన్ల ప్రశ్నలకు బండి సమాధానం చెప్పగలరా ?