Begin typing your search above and press return to search.

మండదా మరి : వారక్కడ జల్సాలు...మాకిక్కడ వాతలా...?

By:  Tupaki Desk   |   16 July 2022 10:33 AM GMT
మండదా మరి : వారక్కడ జల్సాలు...మాకిక్కడ వాతలా...?
X
దేశంలో జనాలకు చైతన్యం బాగా పెరిగింది. అది ఎంతదాకా వచ్చిందంటే దేశంలో సొమ్ము ఎక్కడికి పోతోంది, ఏమై పోతోంది అని. ఇక ఒకరు దోచుకుని పోతే అమాయకులకు కక్ష కట్టినట్లుగా శిక్షలా అని కూడా ఫైర్ అవుతున్నారు. బ్యాంకుల దొంగలు మోసగాళ్ళు అంతా ఫుల్ హ్యాపీస్ గా ఉంటే దేశం అనే బండిని నడిపించడానికి పన్నుల వాతలు మోతలు మాకేనా అని సామాన్య జనం ఏలికల మీద ఎగిరెగిగిపడుతోంది. నిజంగా ఈ దేశంలో పన్నులు కట్టే వారు, నిజాయతీగా బతికే వారి మీదనే భారాలు మోపుతారా అని సగటు జనం అడుగుతున్నారు అంటే జవాబు చెప్పి తీరాలిగా.

ఇంతకీ మ్యాటరేంటి అంటే లేటెస్ట్ గా వైరల్ అవుతున్న విషయాన్నే తీసుకుంటే లలిత్ మోదీ అనే ఒకాయన మాజీ విశ్వసుందరితో చాలా సన్నిహితంగా ఉన్న ఫోటోలను పెట్టి తెగ హుషార్ చేస్తున్నారు. ఈ ఇద్దరు డేటింగ్ లో ఉన్నారని ప్రచారం సాగుతోంది. ఇంతకీ ఈ లలిత్ మోదీ ఎవరూ అంటే బ్యాంకులను మోసగించి 2010లోనే భారత దేశం నుంచి చెక్కేసి ఇపుడు విదేశాల్లో హ్యాపీగా జీవిస్తున్నాడు. పైగా సుస్మితాసేన్ తో ఆయన రొమాన్స్ కూడానూ.

ఇక మరో వైపు చూస్తే నీరవ్ మోడీ అన్న మరోకాయన కూడా తెలుసు కదా. బ్యాంకులకు పంగనామాలు పెట్టేసి పారిపోయాడని నెటిజన్లు అంటున్నారు. ఆయన కూడా లండన్ లో వజ్రాల వ్యాపారం చేస్తున్నారు. ఇక ద గ్రేటెస్ట్ మాస్టర్, బ్యాంకులకు బురిడీ కొట్టించిన బాబు విజయ‌మాల్యా అయితే విదేశాలలో క్రికెటర్లతో పార్టీలు చేసుకుంటూ విందు భల్ పసంద్ అని మునిగితేలుతున్నాడు. ఇక మెహెల్ చోక్సీ షికార్లు చెప్పనవసరం లేదు. ఈయన కూడా బ్యాంకులనే నమ్ముకుని సొమ్ము వెనకేసుకుని ఇలా విదేశాల బాట పట్టి కులాసా చేస్తున్న పెద్ద మనిషి.

వీరంతా డైలీ మీడియాలో ఎక్కడో ఒక చోట కనిపిస్తున్నారు. తాము ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నామో కూడా చెప్పుకుని మరీ దేశంలోని వారిని తెగ మండిస్తున్నారు. ఇలా బ్యాంకులను లూటీ చేసి పారిపోయిన వారంతా లక్షల కోట్లు పట్టుకుపోయిన వారే. ఆ సొమ్ము అంతా ప్రజలదే. పేదలదే. మరి అంత సొమ్ము అలా చోరీ చేసి పారిపోయిన వారు ధిలాసాగా కులాసాగా ఉంటే పాలకులు మాత్రం చోద్యం చూస్తున్నారు అని నెటిజన్లు ఇపుడు తెగ కామెంట్స్ చేస్తున్నారు.

వారిని ఏమీ చేయలేని కేంద్రం సామాన్యుడి మీద మాత్రం పగపట్టినట్లుగా పన్నుల మోత మోగించేస్తోందని నెటిజన్లు విమర్శిస్తున్నారు. భారీగా ధరలు పెంచేస్తున్నారని, అలగే పెట్రోల్ లీటర్ ని 110 రూపాయలు చేశారని, గ్యాస్ సిలిండర్ ని ఏకంగా 1100 రూపాయలు చేశారని మండిపోతున్నారు. ఇదేమి న్యాయం సామీ అని కూడా హాట్ కామెంట్స్ చేస్తున్నారు. బ్యాంకులను దివాళా తీయించిన వారిని వెనక్కి తెచ్చి వారు తిన్నది కక్కించలేరా అని ప్రశ్నిస్తున్నారు.

దేశ సంపదను అలా కొందరు లూటీ చేసి విదేశాల్లో ఎంజాయ్ చేస్తూంటే నీతిగా బతికే వారి మీద పన్నుల వడ్డనా అని లాజిక్ పాయింట్ తీస్తున్నారు. మరి ఏళ్ళు గడుస్తున్నా బ్యాంక్ దొంగలు ఒక్కరి నుంచి కూడా ఒక్క పైసా వెనక్కి తీసుకురాలేకపోయారు. మరో వైపు వాళ్ళు దేశం నుంచి దోచుకున్న దాంతో డేటింగులు విందులు చేసుకుంటూ ఇదీ మా లెవెల్ అని సవాల్ చేస్తూంటే భారతదేశ సగటు మనిషికి చిర్రెత్తిపోతోంది. ఇంతకీ మహా రాజశ్రీ బ్యాంక్ దొంగలను వెనక్కి తీసుకువచ్చే సత్తా ఈ దేశానికి లేదని తేలిపోయిందా. ఇదే నెటిజన్లకు పట్టుకున్న అతి పెద్ద డౌట్ మరి.