Begin typing your search above and press return to search.

కార్పొరేట్లను వాయించేస్తున్న నెటిజన్లు

By:  Tupaki Desk   |   22 Jun 2022 5:59 AM GMT
కార్పొరేట్లను వాయించేస్తున్న నెటిజన్లు
X
అగ్నిపథ్ పథకానికి మద్దతుగా దేశంలోని ప్రముఖ కార్పొరేట్ సంస్ధలు నిలిచిన విషయం తెలిసిందే. అగ్నిపథ్ పథకంలో రక్షణదళంలో నాలుగేళ్ళ సర్వీసు తర్వాత రిటైర్ అయిన వారికి తమ సంస్ధలో ఉద్యోగాలు ఇస్తామని ముందు మహీంద్రా సంస్ధల చైర్మన్ ఆనంద్ మహీంద్ర ట్వీట్ చేశారు.

తర్వావ వరుసగా బయోకాన్, అపోలో ఆసుపత్రి, ఆర్పీజీ, టీవీఎస్ లాంటి అనేక సంస్ధల సీఎండీలు, ఎండీలు వరుసగా ట్వీట్లు చేసి కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా నిలిచారు.

కార్పొరేట్ ప్రపంచం మద్దతుగా నిలవటంతో కేంద్రం కూడా కాస్త ఊపిరి పీల్చుకుంది. అయితే ఎప్పుడైతే కార్పొరేట్లు ట్వీట్లుచేశారో వెంటనే అప్పటి నుండే సమస్యలు మొదలయ్యాయి. కార్పొరేట్ సీఎండీలు, ఎండీలు ఇలా ట్వీట్లు చేశారో లేదో వందలాది నెటిజన్లు వాళ్ళను గట్టిగా తగులుకున్నారు. కార్పొరేట్లను తగులుకున్న నెటిజన్లలో రక్షణ దళాల్లో పెద్ద స్ధానాల్లో పనిచేసి రిటైర్ అయినవారు కూడా ఉండటమే ఆశ్చర్యంగా ఉంది.

ఇంతకీ నెటిజన్ల ప్రశ్నలు ఏమిటంటే ఇప్పటివరకు రక్షణ దళాల్లో పనిచేసి రిటైర్ అయిన మాజీ సైనికుల్లో ఎంతమందిని కార్పొరేట్లు ఉద్యోగాల్లోకి తీసుకున్నారో చెప్పాలంటూ నిలదీశారు. ట్వీట్లు చేసిన అందరు కార్పొరేట్ల యాజమాన్యాలను నెటిజన్లు కంపెనీల వారీగా వాయించేశారు. తమ సంస్ధల్లో ఇచ్చిన ఉద్యోగాల వివరాలు చెప్పాలని, ఏ స్ధాయిలో వాళ్ళని ఉద్యోగాల్లోకి తీసుకున్నారో చెప్పాలంటు సూటిగానే ప్రశ్నించారు. నెటిజన్ల ప్రశ్నలకు కార్పొరేట్ నుండి సమాధానం రాలేదు.

ఇదే సమయంలో జూన్ నాటికి దేశవ్యాప్తంగా 27 లక్షల మంది రక్షణ దళాల నుండి రిటైర్ అయినట్లు సమాచారం. వీరిలో కేంద్ర ప్రభుత్వంలోని శాఖలు, ప్రభుత్వ రంగాల్లోను, బ్యాంకులు, సీఆర్పీఎఫ్, పోలీసు లాంటి శాఖల్లో రిజర్వేషన్ల ప్రకారం ఉద్యోగాలే ఇవ్వలేదు. 10 శాతం రిజర్వేషన్లు కల్పించాల్సుంటే కనీసం 3 శాతం ఉద్యోగాలు కూడా దక్కలేదట.

ఇక బ్యాంకుల్లో అప్పులు, ఇంటి స్ధలాలు కూడా దక్కలేదు. సైన్యంలో పూర్తి స్ధాయిలో పనిచేసి రిటైర్ అయిన వారికే దిక్కు లేకపోతే ఇక అగ్నిపథ్ పథకంలో రిటైర్ అయిన వారికి ఏమి దిక్కంటు నెటిజన్లు కేంద్రాన్ని కూడా వాయించేస్తున్నారు. మరి వీళ్ళ ప్రశ్నలకు కేంద్రమే కాదు కార్పొరేట్లు కూడా సమాధానం చెప్పటం లేదు.