Begin typing your search above and press return to search.

కేసీఆర్ ఇమేజ్ కు భారీ డ్యామేజ్..ముర‌ళీ బ‌దిలీ!

By:  Tupaki Desk   |   6 Jan 2018 4:26 AM GMT
కేసీఆర్ ఇమేజ్ కు భారీ డ్యామేజ్..ముర‌ళీ బ‌దిలీ!
X
ఏ మాట‌కు ఆ మాట చెప్పాలి.. ప్ర‌ధాన మీడియా చంద్రుళ్ల భ‌జ‌న‌లో మునిగిపోయిన వేళ‌.. జ‌నాగ్ర‌హాం వ్య‌క్తం చేసేందుకు సోష‌ల్ మీడియా ఇప్పుడు పెద్ద అస్త్రంగా మారుతోంది. కొన్ని పోస్టుల‌కు సోష‌ల్ మీడియాలో భారీ స్పంద‌న ల‌భిస్తోంది. ఇటీవ‌ల సీఎం కేసీఆర్ చేసిన ఐఏఎస్ బ‌దిలీల వ్య‌వ‌హారం తీవ్ర దుమారం రేగుతోంది. తెలంగాణ అధికార ప‌క్ష ఎమ్మెల్యేల‌తో పడ‌ని ఐఏఎస్ అధికారుల‌పై బ‌దిలీల పేరుతో వేసిన వేటుపై తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.

ముఖ్యంగా వెనుక‌బ‌డిన వ‌ర్గాల కోసం.. ఎస్సీ.. ఎస్టీ ప్ర‌జ‌ల సంక్షేమం కోసం తీవ్రంగా త‌పిస్తూ ప‌ని చేసినట్లుగా పేరును సొంతం చేసుకున్న భూపాల‌ప‌ల్లి జిల్లా క‌లెక్ట‌ర్ ఆకునూరి ముర‌ళీ బ‌దిలీ కుట్ర‌పూరిత‌మ‌న్న విమ‌ర్శ పెద్ద ఎత్తున వినిపిస్తోంది. విద్య‌.. వైద్య సేవ‌ల‌తో వెనుక‌బ‌డిన భూపాల‌ప‌ల్లి జిల్లాలో ప‌ట్టిష్టం చేయ‌టానికి ముర‌ళీ చేసిన కృషికి ప్ర‌జ‌ల నుంచి పెద్ద ఎత్తున సానుకూలత వ్య‌క్త‌మ‌వుతున్న వేళ‌.. ఏ మాత్రం ప్రాధాన్య‌త లేని స్థానానికి బ‌దిలీ చేయ‌టంపై సోష‌ల్ మీడియాలో పెద్ద పోరాట‌మే సాగుతోంది.

ముఖ్య‌మంత్రి కేసీఆర్ తీరును త‌ప్పుప‌ట్ట‌ట‌మే కాదు.. క‌లెక్ట‌ర్ హోదాలో ముర‌ళీ చేసిన ప‌నుల గురించి పొగుడుతూ పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. గ‌డిచిన రెండు రోజులుగా సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న పోస్టుల్లో ఎక్కువ మంది దృష్టిని ఒక పోస్టు ఆక‌ట్టుకుంటోంది. లాజిక్ క్వ‌శ్చ‌న్లు వేస్తూ.. అధికార‌ప‌క్షాన్ని డిఫెన్స్ లో ప‌డేస్తున్న ఈ పోస్టులో ప్ర‌స్తావించిన అంశాల్ని చూసినంత‌నే.. బ‌దిలీల మీద నెగిటివ్ ఫీలింగ్ క‌ల‌గ‌ట‌మే కాదు.. ముర‌ళీ లాంటి స‌మ‌ర్థుడైన అధికారి విష‌యంలో సీఎం కేసీఆర్ ఎంత దారుణంగా వ్య‌వ‌హ‌రించారోన‌న్న భావ‌న క‌ల‌గ‌టం ఖాయ‌మంటున్నారు. సీఎం కేసీఆర్ కు బ‌హిరంగ లేఖ పేరుతో వైర‌ల్ అవుతున్న స‌ద‌రు పోస్టులో సంధిస్తున్న ప్ర‌శ్న‌ల ప‌రంప‌ర‌ను చూస్తే..

- బంగారు తెలంగాణ సాకారంలో భాగంగా నిరంతరం ప్రజల మధ్య‌లో ఉంటూ.. వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్న కలెక్టర్ మురళిని ఎందుకు బ‌దిలీ చేయాల్సి వ‌చ్చింది?

- విద్య.. వైద్య సేవల్ని జిల్లాలో పటిష్టం చేయటానికి శాయశక్తులా కృషి చేస్తున్న‌ అధికారిని.. ప్ర‌భుత్వ పథ‌కాల్ని క్షేత్ర స్థాయిలో నిక్కచ్చిగా అమలు చేస్తున్న క‌లెక్ట‌ర్ ముర‌ళీని ఎందుకు బ‌దిలీ చేయాలి?

- ప్రపంచంలోనే అతిచిన్న వయస్సులో ఎవరెస్టు శిఖరం అధిరోహించి చరిత్ర సృష్టించిన బాలిక మలావత్ పూర్ణ స్వేరో. ఆ బాలిక‌ను అన్ని విధాలుగా ప్రోత్సాహించి, స్వేరోస్ టెన్ కమాండ్మెంట్స్ తో ఆత్మ విశ్వాసాన్ని అందించిన ఐపీఎస్ అధికారి ప్రవీణ్ కుమార్ పై వచ్చిన సినిమానే "పూర్ణ". ఈ మూవీని జిల్లాలోని పేద విద్యార్థుల‌కు ఉచితంగా చూపించేందుకు వీలుగా ఉత్త‌ర్వులు జారీ చేసిన ఏకైక క‌లెక్ట‌ర్ ముర‌ళీనే. అలాంటి అధికారిని బ‌దిలీ చేస్తారా?

-ఈ సినిమాను జిల్లాలో అందరి విద్యార్థులకు (ముఖ్యంగా పేద విద్యార్థులకు) ఉచితంగా చూయించడానికి ఉత్తర్వులు జారీచేసిన ఏకైక కలెక్టర్ ఆకునూరి మురళి గారు. ఇది జీర్ణించుకోలేకనే ఈ కలెక్టరును బదిలీ చేస్తున్నారా ?

- భూపాలపల్లి జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఖచ్చితంగా ఇంగ్లీషు మీడియంలోనే బోధించాలని ఉత్తర్వులిచ్చి.. అమలు కోసం పకడ్బందీగా వ్యూహం రూపొందించటమే ముర‌ళీ చేసిన పాపమా ?

- పేద విద్యార్థులు ఇంగ్లీష్ లో చదువుకోవడం మీకు ఇష్టం లేదా ? రాష్ట్రంలో కార్పొరేట్ విద్యా మాఫియాకు మీరు తలవంచింది వాస్తవం కాదా ?

- దేశంలో 4926 మంది ఐఏఎస్ అధికారులు వున్నారు. ఇప్పటి వరకు ఏ ఒక్క అధికారి కూడా చికిత్స కోసం ప్రభుత్వ ఆసుప‌త్రికి వెళ్లిన చ‌రిత్ర లేదు. కానీ ప్ర‌భుత్వ ద‌వాఖానాలో కుటుంబ స‌భ్యుల కాన్పు చేయించి. పేదలకు ప్రభుత్వ ఆసుప‌త్రిపై నమ్మకం పెంచారు. పేదలు అప్పులు చేసి ప్రైవేటు హాస్పిటల్స్ కు వెళ్ళకుండా ప్రభుత్వ దావఖానలకు రావటానికి కృషి చేయటమే కలెక్టర్ మురళి చేసిన నేరమా ?

- 70 సంవత్సరాల స్వాతంత్య్ర‌ భారతంలో ఆదివాసీ గుడాలకు, లంబాడ తండాలకు నేటికీ రవాణా సౌకర్యం లేదు.

-అలాంటి ప్రాంతాలకు కూడా కలెక్టర్ హోదాలో మురళి బైకులపైనా.. మోటారు సైకిళ్ళపైనా.. కాలినడకన వెళ్లి వారి సమస్యలను పరిష్కరించటమే ఆయ‌న చేసిన త‌ప్పా?

- తెలంగాణ రాష్ట్రంలో 31 మంది కలెక్టర్లు వున్నారు కదా, ఏ ఒక్కరైనా ఇప్పటి వరకు లంబాడ తండాలను, ఆదివాసీ గుడాలను కలెక్టర్ మురళి లాగా సందర్శించిన చరిత్ర వుందా ?

- త్వరలో జరగబోయే సమ్మక్క-సారక్క జాతరకు సంబంధించి మీ నాయకుల అవినీతి అక్రమాలు అన్యాయాలకు అడ్డు వస్తున్నడనే ఉద్దేశ్యంతోనే కలెక్టర్ మురళిని కుట్రపూరితంగా బదిలీ చేస్తున్నారంటూ సామాన్య ప్రజలు అనుకోవటంలో వాస్తవం లేదా ?

- బంగారు తెలంగాణ అంటే కేవలం పండుగలు పబ్బాలు.. బార్లు.. జాతరలు మరియు కుల సంఘాలకు భవనాలేనా ?

- పురావస్తు శాఖ డైరెక్టర్ గా ఇప్పటి వరకు ఎంత మంది ఐఏఎస్ అధికారులు పని చేశారు. ఉత్సాహంతో ప‌ని చేసే అధికారుల్ని అప్రాధాన్యత గల పోస్ట్ లకు వేస్తారా ?