Begin typing your search above and press return to search.

బండికి అంత సీన్ ఉందా.. కేసీఆరే పెంచుతున్నారా?

By:  Tupaki Desk   |   4 Jan 2022 3:30 PM GMT
బండికి అంత సీన్ ఉందా.. కేసీఆరే పెంచుతున్నారా?
X
బండి సంజ‌య్‌. తెల్లారి లేచింది మొద‌లు.. సీఎం కేసీఆర్‌ను, టీఆర్ ఎస్ మంత్రుల‌ను నోటికి ఇష్టం వ‌చ్చిన మాట్లాడ‌డమే కాకుండా.. రాజకీయంగా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేస్తూ.. నిత్యం మీడియాలో ఉంటున్నారు. అంతేకాదు.. సీనియ‌ర్ మోస్ట్ నాయ‌కుడు కూడా చేయ‌ని విధంగా కామెంట్లు చేస్తున్నారు. మ‌రి .. నిజానికి బండి సంజ‌య్‌కు అంత సీన్ ఉందా? ఈయ‌న‌క‌న్నా.. సీనియ‌ర్ల లేరా? లేక‌.. ఈయ‌నే తోపా? అనేది చ‌ర్చ‌నీయాంశంగా మారింది. వాస్త‌వానికి 2019 ఎన్నిక‌ల‌కు ముందు బండి సంజ‌య్ ఎంత‌మందికి తెలుసు? అనే ప్ర‌శ్న తెర‌మీదికి వ‌స్తే.. వేళ్ల మీద‌లెక్కించుకునే ప‌రిస్థితి ఉంది.

ఎందుకంటే.. అంత‌కు ముందు.. ఒక మునిసిపాలిటీ స్థాయి నాయ‌కుడు. సో.. అక్క‌డ‌కు మించి.. ఆయ‌న రాజ‌కీయాలు చేసింది లేదు. ముందుకు సాగింది కూడా లేదు.అయితే.. అనూహ్యంగా 2019లో ఎంపీ టికెట్ ద‌క్క‌డం.. ఈ క్ర‌మంలో ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ వేవ్ క‌లిసి రావ‌డంతో ఆయ‌న ఎంపీగా గెలిచారు. అంత‌కు మించి బండి ప్ర‌త్యేక‌త అంటూ ఏమీలేదు. ఇక‌, ఈ క్ర‌మంలోనే ఆయ‌న తెలంగాణ బీజేపీ కి అధ్య‌క్షుడు అయ్యారు. అప్ప‌టి నుంచి అంతా నేనే అంతా నాదే.. అన్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

బీజేపీ ప‌గ్గాలు చేప‌ట్టిన మొద‌ట్లో వ‌చ్చిన దుబ్బాక ఉప ఎన్నిక‌లో బీజేపీ విజ‌యం సాధించింది. అయితే.. ఇక్క‌డ నుంచి గెలిచిన ర‌ఘునంద‌న‌రావు కృషితోనే పార్టీ గెలుపు గుర్రం ఎక్కింద‌నే అంచ‌నాలు ఉన్నా యి. కానీ, ఈ గెలుపును త‌న ఖాతాలో వేసుకున్న బండి.. రెచ్చిపోవ‌డం మొద‌లు పెట్టారు. త‌ర్వాత‌.. వ‌చ్చి న జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ బ‌ల‌హీన ప‌డిన నేప‌థ్యంలోను, అదేస‌మ‌యంలో టీఆర్ ఎస్‌పై ఉన్న వ్య‌తిరేక‌త‌తో కొన్ని సీట్లు సంపాయించుకున్నారు. అయితే.. త‌ర్వాత బీజేపీ కార‌ణంగా జీహెచ్ ఎంసీకి ఏమీ నిధులు రాలేదు.

వాస్త‌వానికి కేంద్రం నుంచి నిధులు తెచ్చి న‌గ‌రాన్ని అభివృద్ధి చేస్తామ‌ని.. ఎన్నిక‌ల స‌మ‌యంలో హామీలు గుప్పించారు. అయితే.. ఇన్నాళ్ల‌యినా.. కేంద్రం నుంచి రూపాయి నిధులూ రాలేదు. బీజేపీ నేత‌లు తేలేదు. ఇదే విష‌యాన్ని ఎవ‌రైనా ప్ర‌శ్నిస్తే.. పిట్ట‌క‌బుర్లు చెప్పి.. త‌ప్పించుకుంటున్నారు. ఈ విష‌యంపై బండి వ్యూహాత్మ‌క మౌనం పాటిస్తున్నారు. ఇదిలావుంటే.. ఇటీవ‌ల హుజూరాబాద్ ఉప ఎన్నిక జ‌రిగింది. ఈ ఎన్నిక‌లో బీజేపీ అభ్య‌ర్థిగా మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ పోటీ చేశారు. గెలిచారు. ఆయ‌న‌ను ప‌క్క‌న పెట్టి ఇంకెవ‌రికైనా బీజేపీ టికెట్ ఇచ్చి ఉంటే.. ప‌రిస్థితి దారుణంగా ఉండేది.

క‌నీసం డిపాజిట్లు కూడా ద‌క్కేవి కాదు. అంటే.. ఇక్క‌డ కూడా బండి సంజ‌య్ గ్రాఫ్ ఏమీ ప‌నిచేయ‌లేదు. అక్క‌డ దుబ్బాక‌, ఇక్క‌డ హుజూరాబాద్‌లో వ్య‌క్తిగ‌త ఇమేజ్‌తోనే విజ‌యం ద‌క్కించుకున్నారు. నిజంగానే బండి సంజ‌య్ గ్రాఫ్ ప‌నిచేసి ఉంటే.. నాగార్జున సాగ‌ర్‌లో ఎందుకు ఓడిపోయారో.. తెలియాల్సి ఉంది. ఇదిలావుంటే.. నిత్యం కేసీఆర్‌పై బండి విరుచుకుప‌డుతున్నారు. మ‌రి ఇలా దూకుడుగా వ్య‌వ‌హ‌రిస్తు న్నా.. బండికి సీఎం కేసీఆర్ ఎందుకు అంత సీన్ ఇస్తున్నారో తెలియ‌డం లేద‌ని అంటున్నారు రాజ‌కీయ మేధావులు.

అంటే.. ప‌రోక్షంగా బండి దూకుడుకు కేసీఆరే కార‌ణ‌మా? అనే ప్ర‌శ్న‌లు కూడా తెర‌మీదికి వ‌స్తున్నాయి. ఎందుకంటే.. రాష్ట్రంలో కాంగ్రెస్ బ‌ల‌ప‌డ‌కూడ‌దు.. అనేది టీఆర్ ఎస్ వ్యూహం. టీఆర్ ఎస్ వ్య‌తిరేక ఓట్లు చీలిపోకుండా లాభం పొందాల‌నేది కేసీఆర్ ప్లాన్‌గా క‌నిపిస్తోంద‌ని చెబుతున్నారు. ప్ర‌స్తుతం టీఆర్ ఎస్‌పై బాగా వ్య‌తిరేక‌త ఉంది క‌నుక‌.. ఓట్ల షేరింగ్‌లో మార్పులు చేయాల‌ని.. ఈ క్ర‌మంలోనే బండిని టీఆర్ ఎస్ హైలెట్ చేస్తోంద‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఇదే విష‌యం బీజేపీలోనూ చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

వాస్త‌వానికి బండి సంజ‌య్ చేసిన పాద‌యాత్ర అట్ట‌ర్ ఫ్లాప్ అయిపోయింది. ఇండైరెక్ట్‌గా అధికార పార్టీనే బండి సంజ‌య్‌ను హైలెట్ చేస్తోంద‌ని అంటున్నారు. మ‌రి దీనిలో వాస్త‌వం ఎంత‌? లేక పోతే.. ఇలా ఎందుకు వ‌దిలేస్తారు? అనే ప్ర‌శ్న‌లు ఆస‌క్తిగా మారాయి. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.