Begin typing your search above and press return to search.

భారత్ బయోటెక్ వారి నోసల్ వ్యాక్సిన్ ఎప్పటికి వచ్చేను?

By:  Tupaki Desk   |   5 Jan 2022 6:30 AM GMT
భారత్ బయోటెక్ వారి నోసల్ వ్యాక్సిన్ ఎప్పటికి వచ్చేను?
X
భయపడిందంతా జరిగింది. అనుకున్నట్లే మూడో వేవ్ వచ్చేసింది. మరికొద్ది రోజుల్లో మహమ్మారి తన జడలు విప్పి.. మూడో వేవ్ ను మరింత విస్తరించనుంది. అదే జరిగితే.. భారీగా కేసులు పెరగటంతో పాటు.. ఇబ్బందికర పరిస్థితులు ఖాయమన్న మాట వినిపిస్తోంది. ఇలాంటివేళ.. కరోనాకు చెక్ పెట్టే బూస్టర్ డోసుల అవసరం చాలా ఉంది. ఇప్పటికే ఈ విషయం మీద కేంద్రం సైతం ఒక నిర్ణయానికి రావటం.. బూస్టర్ డోసును పెద్ద ఎత్తున తీసుకొచ్చేలా ప్రయత్నాలు సాగుతున్నాయి.

ఇప్పటికే కొవాగ్జిన్.. కొవిషీల్డ్ రెండు డోసులు వేసుకున్న వారికి.. మరోసారి సూదిమందుతో వ్యాక్సిన్ వేసుకునే బదులు.. ముక్కులో వేసుకునే డ్రాప్స్ (నోసల్ వ్యాక్సిన్)ను బూస్టర్ డోసుగా తీసుకుంటే ఫలితాలు మరింత మెరుగ్గా ఉంటాయని అంచనా వేస్తున్నారు. ఇందుకోసం భారత్ బయోటెక్ నోసల్ వ్యాక్సిన్ ను సిద్ధం చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా తాము తయారు చేసిన నోసల్ వ్యాక్సిన్ ను బూస్టర్ డోసుగా వినియోగించుకునేందుకు వీలుగా అవసరమైన క్లినికల్ పరీక్షల నిర్వహణ అనుమతి అంశాన్ని డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియాకు చెందిన నిపుణుల కమిటీ పరిశీలిస్తోంది.

ఒకవేళ డీసీజీఐ ఓకే చెబితే.. బూస్టర్ డోసును ముక్కులో వేసే వ్యాక్సిన్ గా అందుబాటులోకి వస్తుంది. అదే జరిగితే.. ఇప్పటికంటే వేగంగా బూస్టర్ డోసు వేసే వీలు ఉంటుంది. తాము తయారు చేసిన నోసల్ వ్యాక్సిన్ ను ఐదు వేల మంది వాలంటీర్ల మీద పరీక్షలు జరపాలని భారత్ బయోటెక్ భావిస్తోంది. ఇందులో సగం మంది కొవాగ్జిన్.. మరో సగం మంది కొవిషాల్డ్ టీకా తీసుకున్న వారిని ఎంపిక చేస్తారనిచెబుతున్నారు.

ఇప్పటివరకు ఉన్న అంచనా ప్రకారం రెండో డోసు తీసుకున్న ఆర్నెల్ల నుంచి తొమ్మిది నెలల వ్యవధిలోనే బూస్టర్ డోసుతో ప్రయోజనం ఉంటుందని చెబుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో చుక్కల మందును బూస్టర్ డోసుగా అందుబాటులోకి తెచ్చేందుకు వీలుగా త్వరగా క్లినికల్ పరీక్షల్ని నిర్వహించాలని భారత్ బయోటెక్ భావిస్తున్నట్లు చెబుతున్నారు. మరి.. వారి అప్లికేషన్ కు మోక్షం కలిగి.. అనుమతులు పొంది.. వారు క్లినికల్ పరీక్షలు ఎప్పుడు చేస్తారో చూడాలి. ఓవైపు దేశం థర్డ్ వేవ్ దిశగా అడుగులు పడుతున్న వేళ.. భారత్ బయోటెక్ అప్లికేషన్ కు వెనువెంటనే స్పందించాల్సిన అవసరం ఉంది కదా? అలా ఎందుకు జరగటం లేదు? అన్నది అసలు ప్రశ్న.