Begin typing your search above and press return to search.

పంజాబ్ లో బీజేపీ పరిస్దితికి నిదర్శనమా ?

By:  Tupaki Desk   |   6 Jan 2022 6:41 AM GMT
పంజాబ్ లో బీజేపీ పరిస్దితికి నిదర్శనమా ?
X
పంజాబ్ లో నరేంద్ర మోడీ తాజా వ్యవహారాన్ని రెండు రకాలుగా చూడచ్చు. మొదటిదేమో సెక్యూరిటీ ల్యాప్స్ గా. ఇక రెండోదేమో రాజకీయంగా. సెక్యూరిటీ ల్యాప్స్ ను కేంద్ర హోంశాఖ, రాష్ట్ర ప్రభుత్వం చూసుకుంటాయి. రాజకీయ కోణానికి వచ్చేటప్పటికి పంజాబ్ లో బీజేపీ పరిస్థితికి అద్దం పడుతున్నట్లే ఉంది. తొందరలోనే జరగబోయే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పంజాబ్ కూడా ఉంది. ఇపుడు పంజాబ్ లో ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రయాణిస్తున్న దారిలో ఓ ఫ్లైవర్ దగ్గర రైతులు వాహనాలను అడ్డంపెట్టి నిరసన తెలపడం మామూలు విషయం కాదు.

మూడు వ్యవసాయ చట్టాలు చేయటంతోనే మోడీ సర్కార్ పై రైతుల్లో ఆందోళన మొదలైంది. పంజాబ్ లో మొదలైన ఆందోళన చివరకు హర్యానా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు పాకి ఉద్యమంగా తయారైంది. దాదాపు ఏడాదికి పైగా జరిగిన ఉద్యమం దాటికి కావచ్చు, ఉపఎన్నికల్లో తగిలిన ఎదురుదెబ్బ కావచ్చు లేదా రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కూడా కావచ్చు. వ్యవసాయ చట్టాలను మోడి ఉపసంహరించుకున్నారు. అయితే ఈమధ్య కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ చేసిన వ్యాఖ్యలతో మళ్ళీ నిప్పు రాజుకుంది.

వ్యవసాయ చట్టాలను కేంద్రం రద్దు చేసుకోగానే రైతులు కూడా ఉద్యమానికి స్వస్తిచెప్పి ఎవరి ఊళ్ళకు వాళ్ళు వెళ్ళిపోయారు. అలాంటిది తోమర్ మాట్లాడుతు తొందరలోనే రద్దుచేసిన వ్యవసాయ చట్టాలను మళ్ళీ తెస్తామని చెప్పారు. దాంతో ఒక్కసారిగా రైతు సంఘాల్లో వ్యతిరేకత మొదలైపోయింది. దాని పర్యవసానం గమనించిన మంత్రి తన మాటలను వక్రీకరించారంటు తప్పించుకునేందుకు ప్రయత్నించారు. అయితే అప్పటికే జరగాల్సిన డ్యామేజి జరిగిపోయింది.

తోమర్ వ్యాఖ్యల తర్వాత మోడి పంజాబ్ పర్యటనకు వచ్చారు. దాంతో రైతులు మోడికి నిరసన సెగ ఎలాగుంటుందో చూపించారు. అంటే ఇదే విధానం రేపటి ఎన్నికల్లో కూడా కంటిన్యు అవుతుందని చెప్పకనే చెప్పినట్లయ్యింది. పంజాబ్ లో రైతులను కాదని ఏ పార్టీ కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేందు. అసలే పంజాబ్ లో బీజేపీ పరిస్ధితి అంతంత మాత్రంగా ఉంది. జరిగిన ప్రీపోల్ సర్వేల్లో దేనిలో కూడా బీజేపీ అధికారంలోకి కాదు కదా కనీసం కమ్ ఫర్టబుల్ గా ఉంటుందని కూడా రాలేదు.

ఇలాంటి స్ధితిలో పార్టీ పరిస్దితిని చక్కదిద్దుదామని మోడి ప్రయత్నించినట్లున్నారు. పంజాబ్ లో కార్యక్రమం పెట్టుకోవటం ద్వారా జనాలను ఆకట్టుకోవచ్చని అనుకున్నట్లున్నారు. కానీ మధ్యలో రైతుల ఆగ్రహానికి గురై చివరకు కార్యక్రమాన్నే రద్దు చేసుకోవాల్సొచ్చింది. ప్రధానమంత్రి కార్యక్రమాన్నే రైతులు అడ్డుకున్నారంటే ఇక మిగిలిన నేతల పరిస్ధితి గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు. రేపటి ఎన్నికల్లో బీజేపీ పరిస్ధితి ఏమిటనేందుకు ఇదే తాజా ఉదాహరణ.