Begin typing your search above and press return to search.

జగన్ చేతిలో పాశుపతాస్రం... ?

By:  Tupaki Desk   |   1 Jan 2022 3:30 PM GMT
జగన్ చేతిలో పాశుపతాస్రం... ?
X
పేదలు అంటే ఆర్ధికంగా బలహీనులు. డబ్బు లేకపోతే ఎవరి గొంతుక అయినా కూడా మూగబోతుంది. సామాజికంగా కూడా వారి స్తోమత స్థాయి కూడా చాల దిగువన ఉంటుంది. అలాంటి పేదలు ఒక్కరుగా ఉంటే ఎప్పటికీ బలహీనులే. వారే కలసికట్టుగా ఉంటే ఏమవుతుంది. ఈ దేశ బడ్జెట్ ని వారే నడిపిస్తారు, ఈ దేశ పాలకులను వారే నిర్ణయిస్తారు, నేతల తలరాతలను వారే రాస్తారు. ఒక విధంగా వారు అతి పెద్ద ఓటు బ్యాంక్. అలాంటి పేదలు ఎపుడూ రాజకీయ పార్టీలకు అతి ముఖ్యం. వారి చుట్టూనే రాజకీయ అజెండాలు తిరుగుతూంటాయి.

ఏపీలో చూసుకుంటే జగన్ సైతం పేదల చుట్టూనే అన్నీ తిప్పుతున్నారు. అది ఎంతదాకా వచ్చింది అంటే తాను ఏం చేసినా పేదల కోసమే అని ఆయన చెబుతున్నారు. పేదల కోసం తాను అన్నీ చేస్తూంటే మీకు కడుపు మంట ఎందుకు అంటూ విపక్షాలను గట్టిగా నిలదీస్తున్నారు. పేదలంటే అంత కక్షా మీకు అని వారిని ఎగదోస్తున్నారు.

తాను అధికారంలోకి వచ్చినది లగాయితూ పేదలకు ఎన్నో మేళ్ళు చేశానని, అయితే వాటిలో కొన్నింటిని అడ్డుకుంటున్నారని జగన్ మండిపడుతున్నారు. పేదలకు మంచి చేయడమే తప్పా అని ఆయన సూటిగా ప్రశ్నిస్తున్నారు. పేదలకు ఇంగ్లీష్ చదువులు ఇస్తామంటే అడ్డుకుంటున్నారని, పేదలకు వినోదం అని సినిమా టికెట్లు తగ్గిస్తే దాన్ని కూడా రచ్చ చేస్తున్నారని జగన్ అంటున్నారు. పేదల కోసం వారికి సంపూర్ణ గృహ హక్కులను ఇస్తూంటే, ఓటీఎస్ పధకం ప్రవేశపెడితే దాన్ని కూడా చూసి ఓర్వలేకపోతున్నారు అని జగన్ మండిపడుతున్నారు.

తాను ఏ పని చేసినా పేదల కోసమే అంటూ జగన్ గుంటూరు లో జరిగిన పెన్షన్ పెంపు సభలో గట్టిగా చెప్పుకున్నారు. పేదల కోసమే తాను ఏమైనా చేస్తానని, అడ్డుకుంటున్న వారెవరూ గుర్తించాలని ఆయన పేదలను కోరుతున్నారు. ఒక విధంగా జగన్ రెండున్నరేళ్లలో చేసినది అదే.

సంక్షేమ కార్యక్రమాలు పేదలకు ఇస్తున్నారు. వారి చేతిలో నగదు పెడుతున్నారు. ఇంకా తాను ఎన్నో చేస్తాను అంటున్నారు. అయితే ఇళ్ళ పట్టాల నుంచి అనేక కార్యక్రమాలు నత్త నడకన సాగడానికి ప్రతిపక్షాలే కారణమని అంటున్నారు. ఒక విధంగా పేదలను ముందు పెట్టి ప్రతిపక్షాలకు జగన్ అతి పెద్ద‌ సవాల్ చేస్తున్నారు. మీ నోటికి అన్నం ముద్ద చేరుద్దామని చూస్తే అడ్డం పడుతున్న శక్తులను గమనించండి అంటున్నారు.

మరి పేదలనే తన రక్షణ కవచంగా మార్చుకోవాలని జగన్ చూస్తున్నారు. ఇది నిజంగా గొప్ప వ్యూహమే. రాజకీయంగా ఆరితేరిన పధకమే . నిజంగా పేదలంతా జగన్ వైపు నిలబడితే ఆయన అజేయుడే అవుతాడు. అదే పేదలు ప్రతిపక్షాల మీద కన్నెర్ర చేస్తే వారికీ రాజకీయ ఇబ్బందులు తప్పవు. కానీ అలా జరుగుతుందా. పేదలంతా జగన్ ఏలుబడిలో సంతోషంగా ఉన్నారా. లేక వారిలో అసంతృప్తి ఉందా. కుడి చేత్తో ఇచ్చి ఎడం చేత్తో లాక్కుంటున్నట్లుగా మద్యం ధరలు టాప్ లో ఉండడం, చెత్త పేరిట ప్రతీ ఇంటికీ పన్నులు, పెట్రోల్ డీజిల్ ధరల మీద ఏపీలో ఎంతో కొంత తగ్గించకపోవడాలు, నిత్యావసర ధరలు పెద్ద ఎత్తున పెరగడాలు ఇవన్నీ కూడా జగన్ సంక్షేమ పధకాల వరదలో కొట్టుకుపోతాయా.

అలా జరగాలని అయితే జగన్ కోరుకుంటున్నారు. అదే సమయంలో పేదలనే తన ఆయుధంగా చేసుకుని ప్రతిపక్షం మీద పాశుపతాస్రాన్నే ప్రయోగిస్తున్నారు. మరి ఆ పేదలను తమ వైపు తిప్పుకోవడంతో విపక్షాలు సక్సెస్ అవుతాయా. ఇంతకీ వారు ఏ గట్టున ఉన్నారు. ఏ గట్టుకు వస్తారు, ఇవన్నీ తెలియాలంటే ఏపీలో రాజకీయ కధ మరింతకాలం సాగాల్సిందే.