Begin typing your search above and press return to search.

రాజీనామా చేయడట.. పార్టీని వీడడట.. రచ్చ కూడా మానడేమో?

By:  Tupaki Desk   |   7 Jan 2022 5:38 AM GMT
రాజీనామా చేయడట.. పార్టీని వీడడట.. రచ్చ కూడా మానడేమో?
X
దశాబ్దాలకు తరబడి.. తన దరికి కూడా రాని రీతిలో దేశాన్ని ఏలిన కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు వరుస పెట్టి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఒకప్పుడు పార్టీకి ఆభరణంగా ఉన్న అంతర్గత ప్రజాస్వామ్యం.. ఇప్పుడో రచ్చగా మారింది. అందుకు తెలంగాణలోని పార్టీ పరిస్థితులు చక్కటి ఉదాహరణగా చెప్పాలి. తోపులాంటి నేతలు పార్టీలో ఉన్నప్పటికీ.. అధికారం అందనంత దూరాన ఉండటానికి కారణం.. నేతల ఆలోచనా ధోరణే.

పార్టీ గెలవాలన్న ఆలోచన కంటే తమకు తాము గెలవాలన్న తపనే ఎక్కువ. పార్టీ గెలిస్తే.. తాము గెలిచినట్లే అన్నలాజిక్ మిస్ అవుతున్న వారు.. తమకు రాని మైలేజీ.. మరెవరికీ రాకూడదన్నట్లుగా ఉండటం ఈ మధ్యన చూస్తున్నదే. రేవంత్ రెడ్డికి టీ కాంగ్రెస్ పార్టీ పగ్గాలు అప్పగించిన తర్వాత..పార్టీలో కొత్త ఊపు.. ఉత్సాహం వచ్చిందని చెప్పాలి. అయితే.. అందరిని కలుపుకుపోతానని మొదట్లో బిల్డప్ ఇచ్చిన రేవంత్ రెడ్డి.. ఆ తర్వాత తనదైన ఒంటెద్దు పోకడల్ని ప్రదర్శిస్తున్నారంటూ ఆయనపై విరుచుకుపడుతున్నారు జగ్గారెడ్డి.

తరచూ వార్తల్లో కనిపించే ఆయన.. ఏ మాత్రం అవకాశం వచ్చినా రేవంత్ ను టార్గెట్ చేస్తున్న వైనం ఇప్పుడు కలకలంగా మారింది. పార్టీని డ్యామేజ్ చేసేలా జగ్గారెడ్డి వ్యవహరిస్తున్నారన్న విమర్శల్ని ఆయన కొట్టి పారేస్తున్నారు. తనకు కాంగ్రెస్ పార్టీని డ్యామేజ్ చేసే ఆలోచన లేదని.. తప్పులు చేస్తున్న వారి గురించి ప్రశ్నిస్తున్నానే తప్పించి.. మరింకేమీ లేదన్న ఆయన మాటలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.

ఓవైపు.. జగ్గారెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడతారన్న అభిప్రాయం అంతకంతకూ ఎక్కువ అవుతోంది. ఈ మధ్యనే ఆయన పార్టీ అధినేత్రి సోనియాగాంధీకి రాసిన లేఖ.. లీక్ కావటం.. అందులోని అంశాలు వార్తలుగా వచ్చేయటం తెలిసిందే. దీనిపై ఆయన్ను పార్టీ క్రమశిక్షణా సంఘం పిలవటం.. ఆ సందర్భంగా జగ్గారెడ్డి మరింతగా చెలరేగిపోవటం చూస్తే.. ఆయన పార్టీని విడిచిపెట్టి వెళతారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే.. తనకు పార్టీని వీడాలన్న ఆలోచన లేదని.. పార్టీకి డ్యామేజ్ చేసే ఆలోచన కూడా లేదని చెప్పటం గమనార్హం.

తాను పార్టీ అధినేత్రి సోనియాగాంధీని.. పార్టీ ముఖ్యనేత రాహుల్ గాంధీని కలిసి.. తన బాధను వారికే నేరుగా వివరిస్తానని చెబుతున్నారు. తన వల్ల పార్టీలో ఎవరైనా ఇబ్బందులు పడితే.. ఒంటరిగా పోరాడతానని చెబుతున్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రథసారధి రేవంత్ కు.. ఫైర్ బ్రాండ్ జగ్గారెడ్డికి ఏ మాత్రం పొసగని పరిస్థితి నెలకొంది. ఈ మధ్యన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్ హౌస్ ఉన్న ఎర్రవెల్లిలో ‘రచ్చబండ’ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి.. అందులో పాల్గొనాలని రేవంత్ డిసైడ్ చేయటం తెలిసిందే.

ఎర్రవెల్లి ఉన్న జిల్లాకు ఏకైక కాంగ్రెస్ ఎమ్మెల్యే అయిన తనకు రచ్చబండ కార్యక్రమానికి సంబంధించి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా రేవంత్ ఎలా వస్తారని ప్రశ్నించటం తెలిసిందే. పార్టీ ఎమ్మెల్యేగా.. పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న తనకు సమాచారాన్ని ఇవ్వకపోవటాన్ని అవమానంగా భావించారు. ఈ సందర్భంగా రేవంత్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తాను రచ్చబండ కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నట్లుగా పేర్కొన్నారు. ఇలా.. ఆయన చేసిన వ్యాఖ్యలు రచ్చ రచ్చగా మారటమే కాదు.. కాంగ్రెస్ ఇమేజ్ ను జగ్గారెడ్డి డ్యామేజ్ చేసేలా మారిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇలాంటి వేళ..తాను పార్టీని వీడే ఆలోచన లేదని స్పష్టం చేయటం బాగానే ఉన్నా.. కలిసి కట్టుగా తమ ఉమ్మడి ప్రత్యర్థిపై పోరాడాలన్న విషయాన్ని ఎప్పటికి తెలుసుకుంటారో?