Begin typing your search above and press return to search.

తూర్పు కన్ను తెరచిన పవన్... మూడేది వారికే ?

By:  Tupaki Desk   |   9 Jan 2022 3:30 AM GMT
తూర్పు కన్ను తెరచిన పవన్... మూడేది వారికే ?
X
జనసేనాని పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో సీరియస్ గా ఉండరని విమర్శలు ప్రత్యర్ధులు చేస్తారు. కానీ ఆయన ప్రత్యర్ధుల విషయంలో చాలా సీరియస్ గానే ఉంటారు. అవసరం అయిన సందర్భాల్లో మూడవ కన్నే తెలుస్తారు. జనసేన పార్టీ పెట్టి పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇస్తూనే జగన్ని 2014లో సీఎం ని కాకుండా చేసిన పవన్ తానేంటో నాడే చాటుకున్నారు. ఇక 2019 ఎన్నికల్లో స్ట్రాటజీ కొంత తడబడింది. అయితే 2024 నాటికి అలాంటి పొరపాట్లు ఉండవని జనసేన శిబిరం అంటోంది.

రాజకీయ ప్రత్యర్ధులను ఒక్కొక్కరినీ టార్గెట్ చేసి మరీ మాజీలను చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లుగా జనసైనికులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా వచ్చే ఎన్నికల్లో పవన్ ఎక్కడ నుంచి పోటీ చేస్తారు అన్న చర్చ అయితే చాలా కాలంగా వస్తోంది. ఆయన 2019 ఎన్నికల్లో విశాఖ సిటీలోని గాజువాక, పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం నుంచి పోటీ చేసి రెండు చోట్లా ఓడారు. అయితే జనసేనకు గుండెకాయ లాంటి తూర్పు గోదావరిని ఎందుకో ఆయన వదిలేశారు అని నాడే అంతా అనుకున్నారు.

ఈసారి మాత్రం పవన్ ఆ తప్పు చేయబోరట. ఆయన ఈసారి కచ్చితంగా తూర్పు గోదావరి జిల్లాలోనే పాదం మోపుతారుట. కాపులు ఎక్కువగా ఉన్న జిల్లా ఇది. ఇక్కడ పోటీ చేయడమే కాదు, ప్రత్యర్ధులను గురి చూసి మరీ ఇంటికి పంపుతారుట. పవన్ హిట్ లిస్ట్ లో చూసుకుంటే తూర్పుగోదావరి జిల్లాలో మంత్రి కురసాల కన్నబాబు ఉన్నారు. ఆయన కాకినాడ రూరల్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కన్నబాబు జగన్ తో పవన్ ఎందుకూ సరిసాటి కారని ఘాటైన విమర్శలు చేయడంతో జనసైనికులు ఒక్కలా రగిలిపోతూ వచ్చారు. పవన్ని పట్టుకుని డ్రామాలు చేస్తారని కూడా కన్నబాబు అనడం మీద పవన్ సైతం గుర్రుగా ఉన్నారట.

అంతే కాకుండా పవన్ మైకుల ముందు ఊగిపోవడం వల్లనే ఆయనకు అన్ని సీట్లు వచ్చాయని కూడా కన్నబాబు అప్పట్లో ఎద్దేవా చేశారు. దీంతో గతం మరచిపోవద్దు రా చూసుకుందామని పవన్ కన్నబాబుని హెచ్చరించారు కూడా. కన్నబాబు తొలిసారి రాజకీయ అరంగేట్రం చేసింది ప్రజరాజ్యం ద్వారా. అలాగే ఫస్ట్ టైమ్ ఎమ్మెల్యే కూడా అయ్యారు. అలాంటి కన్నబాబు పవన్ని ప్రతీసారీ కామెంట్స్ చేయడాన్ని ఆయన తట్టుకోలేకపోతున్నారుట. దానికి తగిన రిటార్ట్ ఇచ్చేందుకు రెడీ అంటున్నారుట.

ఇక చూసుకుంటే కాకినాడ రూరల్ లో కాపులు బలంగా ఉన్నారు. పొత్తులు కుదిరితే టీడీపీ ఆ సీటు పవన్ కి ఇచ్చేందుకు సిద్ధమని అంటున్నారు. ఆ పార్టీకి అక్కడ ఇంచార్జి కూడా ఎవరూలేరు. దాంతో పవన్ కన్నబాబు మీదకే వస్తారా అన్న చర్చ అయితే హాట్ హాట్ గా సాగుతోంది.

ఇక కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కూడా పవన్ మీద పదే పదే విమర్శలు చేస్తూ రెచ్చగొడుతున్నారు. ప్యాకేజి స్టార్ అని కూడా దూషించారు. ఈ పరిణామాల మీద కూడా జనసైకులు రగిలిపోతున్నారు. ద్వారంపూడి ఇంటికి జనసైనికులు ఆ మధ్యన ముట్టడిస్తే వారి మీద రాళ్ల దాడి కూడా జరిగింది. దాంతో పవన్ కూడా నాడు అగ్గి మీద గుగ్గిలమే అయ్యారు. మీ కాకినాడ వచ్చే తేల్చుకుంటామని సవాల్ చేశారు.

ఇపుడు చూసుకుంటే పవన్ శపధాలు తీర్చుకునేందుకు సమయం ఆసన్నమైంది అంటున్నారు. పవన్ కాకినాడ రూరల్ నుంచి కానీ సిటీ నుంచి కానీ పోటీ చేస్తారని అంటున్నారు. అదే జరిగితే ఆ ప్రభావం తూర్పు గోదావరి జిల్లా అంతటా ఉండి రాజకీయ ప్రత్యర్ధులకు పెద్ద ఎత్తున ఇబ్బందులు తప్పవని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.