Begin typing your search above and press return to search.

కేసీఆర్ అందుకే లాగుతున్నారా?

By:  Tupaki Desk   |   6 Jan 2022 5:33 AM GMT
కేసీఆర్ అందుకే లాగుతున్నారా?
X
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ కొత్త రాజ‌కీయ క్రీడ‌కు తెర‌లేపారా? ఓ ప్ర‌త్య‌ర్థిని దెబ్బ‌కొట్టేందుకు మ‌రో ప్ర‌త్య‌ర్థిని వాడుకుంటున్నారా? ఎన్నిక‌ల స‌మ‌యం నాటికి ఆ ఇద్ద‌రిని ఇబ్బందుల్లోకి నెట్టేలా ప్లాన్ చేశారా? అంటే రాజ‌కీయ వ‌ర్గాల నుంచి అవున‌నే స‌మాధానం వినిపిస్తోంది. అందుకే తాజాగా బీజేపీ అధ్య‌క్షుడు బండి సంజ‌య్ అరెస్టు ఎపిసోడ్‌ను కేసీఆర్ లాగుతున్నార‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. బీజేపీపై ఆయ‌న ఇంత క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించ‌డం వెన‌క కాంగ్రెస్‌ను దెబ్బ కొట్టాల‌నే వ్యూహం ఉంద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

కాంగ్రెస్ ల‌క్ష్యంగా..
తెలంగాణ రాజ‌కీయ ప‌రిణామాలు ఇప్పుడు వేగంగా మారిపోతున్నాయి. ఏడేళ్లుగా ఆధిప‌త్యం ప్ర‌ద‌ర్శించిన కేసీఆర్‌కు ఇప్పుడు పోటీ ఎదురవుతోంది. రాష్ట్ర రాజ‌కీయాల్లో త్రిముఖ పోరు త‌ప్ప‌ద‌నే సంకేతాలు క‌నిపిస్తున్నాయి. కాంగ్రెస్‌, బీజేపీ బ‌లంగా పుంజుకోవ‌డ‌మే అందుకు కార‌ణం. బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడిగా బండి సంజ‌య్‌.. తెలంగాణ ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీ అధ్య‌క్షుడిగా రేవంత్ రెడ్డి దూకుడుతో ముందుకు సాగుతున్నారు. ఈ నేప‌థ్యంలో ముందుగా కాంగ్రెస్‌ను దెబ్బ తీసేందుకే బీజేపీకి హైప్ వ‌చ్చేలా కేసీఆర్ ప్లాన్ చేశారని టాక్‌. అందుకే వ‌రి కోనుగోళ్ల విష‌యంపై కేంద్రంలోని బీజేపీ స‌ర్కారును దోషిగా నిల‌బెట్టే ప్ర‌య‌త్నాలు చేయ‌డం.. రాష్ట్ర బీజేపీ నాయ‌కుల‌పై తీవ్ర విమ‌ర్శ‌లు ఆరోప‌ణ‌ల‌తో ముందుకు సాగ‌డం వ్యూహంలో భాగంగా క‌నిపిస్తోంది. ఇప్పుడు ప్ర‌ధానంగా బీజేపీపై ఫోక‌స్ పెట్ట‌డం వ‌ల్ల ప్ర‌జ‌లు కాంగ్రెస్ గురించి ప‌ట్టించుకోవ‌డం త‌గ్గిపోతుంది. టీఆర్ఎస్‌, బీజేపీ మ‌ధ్య ప్ర‌ధాన పోటీ ఉందనే భావ‌న క‌లుగుతుంది. కేసీఆర్‌కు కావాల్సింది కూడా అదే.

అప్ప‌టికి బీజేపీని..
వ‌రుస‌గా మూడో సారి తెలంగాణ‌లో అధికారం ద‌క్కించుకోవాల‌నే ప‌ట్టుద‌ల‌తో కేసీఆర్ ఉన్నారు. కానీ మునుప‌టిలా ప‌రిస్థితులు లేవ‌ని ఆయ‌న‌కు తెలుసు. అందుకే ప్ర‌స్తుతానికి కాంగ్రెస్‌ను తొక్కేసి బీజేపీని పైకి లేపుతున్నారు. కానీ ఎన్నిక‌ల స‌మయానికి బీజేపీకి కౌంట‌ర్ ఇచ్చేలా ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేసుకుంటున్నారు. బీజేపీ కాస్త బ‌ల‌ప‌డ్డాక ఎన్నిక‌ల స‌మ‌యం నాటికి ప్ర‌ధాని మోడీ వైఫ‌ల్యాల‌ను చూప‌డం.. తెలంగాణ‌కు బీజేపీ చేసిన అన్యాయాన్ని ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్ల‌డం కేసీఆర్ వ్యూహంగా క‌నిపిస్తోంద‌ని విశ్లేష‌కులు అంటున్నారు. అలా అప్పుడు బీజేపీని తొక్కేసేందుకు కేసీఆర్ సిద్ధ‌మ‌వుతున్న‌ట్లు స‌మాచారం.

ఇలా ఒక పార్టీని వాడుకుంటూ మ‌రొక‌రిని తొక్కేసే రాజ‌కీయ క్రీడ‌కు కేసీఆర్ తెర తీశార‌ని నిపుణులు అంచ‌నా వేస్తున్నారు. అయితే త‌న వ్యూహం బూమ‌రాంగ్ అయి కేసీఆర్‌కే న‌ష్టం వాటిల్లే ప్ర‌మాదం లేక‌పోద‌ని చెబుతున్నారు. ఎందుకంటే కాంగ్రెస్‌, బీజేపీ కూడా కేసీఆర్‌కు దీటుగా స‌మాధాన‌మిస్తున్నాయి. మ‌రోవైపు తెలంగాణ ప్ర‌జ‌ల్లో టీఆర్ఎస్ ప్ర‌భుత్వం ప‌ట్ల వ్య‌తిరేక‌త పెరుగుతోంది. మ‌రి కేసీఆర్ ట్రాప్‌లో తెలంగాణ ప్ర‌జ‌లు మ‌రోసారి ప‌డతారా? లేదా ముందుగానే ఫిక్స‌యిపోయి కేసీఆర్‌నే దింపేస్తారా? అన్న‌ది వేచి చూడాలి.