Begin typing your search above and press return to search.

మోడీని మొత్తంగా ముంచేయటానికి ఈ పెద్దాయన ఒక్కడు చాలు

By:  Tupaki Desk   |   4 Jan 2022 4:32 AM GMT
మోడీని మొత్తంగా ముంచేయటానికి ఈ పెద్దాయన ఒక్కడు చాలు
X
అనుకుంటాం కానీ కాలానికి మించిన విచిత్రమైనది.. గమ్మతైనది మరొకటి ఉండరు. ఇదే కాలం ఒకరిని తిరుగులేని శక్తిగా చూపిస్తుంది. సరిగ్గా చెప్పాలంటే.. హీరోలా. అదే కాలం కొంతకాలం గడిచిన తర్వాత అతన్నిజీరో చేస్తుంది. ఇలా చేయగలిగిన శక్తి కాలానికి మాత్రమే ఉంటుంది. ఈ మేజిక్ తోనే చరిత్రలో ఒక వెలుగు వెలిగిన తర్వాత కొంతకాలానికి కొందరు మాత్రమే చిరస్మణీయులుగా.. మరికొందరు అందుకు భిన్నంగా నామరూపాల్లేకుండా కాలగర్భంలో కలిసిపోతారు.

ఇదంతా ఎందుకంటే..దేశంలో అత్యంత పవర్ ఫుల్ ప్రధానిగా నరేంద్ర మోడీ గురించి చాలామంది చాలా చెబుతారు. ఆయనకు మించిన శక్తివంతమైన ప్రధానమంత్రిగా ఇందిరా గాంధీ వ్యవహరించినప్పటికీ.. అప్పటికి.. ఇప్పటికి పరిస్థితుల్లోనూ.. దేశ స్వరూపంలోనూ చాలానే మార్పులు చోటు చేసుకున్నాయి. ఇందిరాగాంధీ తన పేరు ప్రఖ్యాతుల్ని తానే చెడగొట్టుకున్నారు. కానీ.. ఆ తర్వాత ఆమె తన తప్పును సరిదిద్దుకున్నారు. ఆ తర్వాత ఆమె స్థాయిలో అత్యంత శక్తివంతమైన.. ప్రభావవంతమైన దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ నిలిచారు. ఆయన్ను వేలెత్తి చూపించే ఏ ఒక్కరు కూడా ‘దేశద్రోహి’ అన్న ముద్ర కంటే తక్కువగా పడినోళ్లు లేరు. అంతలా తనను అభిమానించే వారి చేత విరుచుకుపడేలా చేసే ఛరిష్మా నమో సొంతం.

అలాంటి మోడీకి దిమ్మతిరిగిపోవటమే కాదు.. ఆయన్ను బలంగా సమర్థించే వారు సైతం..కాసేపు తమను తాము ప్రశ్నించుకునేలా చేసే సత్తా మాత్రం మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్ సొంతంగా చెప్పాలి. గవర్నర్ గా నియమితులైన వారు ముఖ్యమంత్రులపై యుద్ధం చేయటం చూశాం. కానీ.. ప్రధానిపై ఎక్కు పెట్టిన కారణజన్ముడిగా ఆయన నిలుస్తున్నారు. పార్టీకి అత్యంత విధేయులుగా నిలిచిన వారికి గవర్నర్ గిరిని కట్టబెట్టటం..కొంతకాలంగా కేంద్రంలోని అధికారంలో ఉన్న పార్టీలు చేస్తున్నాయి. అదే విధంగా సత్యపాల్ ను తొలుత జమ్ముకశ్మీర్ రాష్ట్రానికి గవర్నర్ గా నియమితుల్ని చేశారు. ఆ తర్వాత ఏమైందో కానీ ఆయన్ను మేఘాలయకు బదిలీ చేశారు.

అప్పటి నుంచి మొదలైంది మోడీ మీద ఆయన విమర్శల జోరు. ఏదో ఒక వ్యాఖ్యతో వార్తల్లో నిలవటమే కాదు.. దాన్నిసర్ది చెప్పుకోలేక మోడీ సర్కారు కిందా మీదా పడిపోయే పరిస్థితి. అలాంటి ఆయన తాజాగా హర్యానాలోని ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా చేసిన ప్రసంగంలో.. ప్రధాని మోడీకి సంబంధించి ఆయన చేసిన వ్యాఖ్యను పెను రాజకీయ దుమారానికి..సంచలనానికి దారి తీశాయి. తాను చేసిన వ్యాఖ్యల ప్రకంపనల్ని గుర్తించిన ఆయన.. గంటల తర్వాత దాన్ని సర్ది చెప్పే ప్రయత్నం చేసినా.. జరగాల్సిన డ్యామేజ్ భారీగా జరిగిపోయింది.

ప్రధాని మోడీ ఇమేజ్ ను దారుణంగా డ్యామేజ్ చేసేలా సత్యపాల్ మాలిక్ చేసిన వ్యాఖ్యల్ని చూస్తే..
మోడీ సర్కారు మూడు వ్యవసాయ చట్టాల్ని తీసుకురావటం.. ఆ సందర్భంగా రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేయటం.. అది కాస్తా తీవ్ర రూపం దాల్చిన వేళలో.. రైతు సమస్యలపై మాట్లాడటానికి ప్రధాని మోడీని కలిసేందుకు తాను వెళ్లినట్లు చెప్పారు. తమ సమావేశంలో ఐదు నిమిషాల మీద తాను పోట్లాడానని చెప్పారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ చాలా అహంకారపూరితంగా మాట్లాడినట్లుగా పేర్కొన్నారు. ‘‘రైతులు ఏమైనా నా కోసం చనిపోయారా?’’ అంటూ మాట్లాడారని పేర్కొన్నారు. ఆ సందర్భంలో కాసేపు తాను ప్రధాని మోడీతో వాదించాని.. మాటల యుద్ధమే చేశానని చెప్పారు. మన రైతులు 500 మంది చనిపోయారని చెప్పినప్పుడు స్పందించిన ప్రధాని.. నా కోసమే వారు చనిపోయారా? అని అడిగారని.. ఆ సందర్భంగా తాను సమాధానమిస్తూ అవునని చెప్పారన్నారు.

‘కొంతకాలంగా ఈ దేశాన్ని పాలిస్తోంది మీరే’ అని తాను బదులిచ్చానని.. కాసేపటికి తమ మాటల యుద్ధం ముగిసిందన్నారు. అనంతరం నన్ను అమిత్ షాను కలవాలని మోడీ చెప్పటంతో.. తాను వెళ్లి ఆయన్ను కలిసినట్లు చెప్పారు. కుక్కలకు ఇచ్చే విలువ కూడా మోడీ ఇవ్వరంటూ పరోక్షంగా మోడీని విమర్శించారు. ఈ ఉదంతానికి సంబంధించి కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే ట్విటర్ లో ఒక వీడియో షేర్ చేశారు. అందులో మీరు నిర్లక్ష్యంగా ఉండండి.. మమ్మల్ని కలుస్తూ ఉండండి అంటూ కేంద్ర హోంమంత్రి చెప్పారంటూ మాలిక్ మాట్లాడినట్లుగా సదరు వీడియోలో ఉంది. సత్య మాలిక్ నోటి నుంచి వచ్చిన ఈ వ్యాఖ్యలు పెను రాజకీయ దుమారానికి కారణమయ్యాయి.

ఈ నేపథ్యంలో సత్యమాలిక్ మరోసారి తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు కాసింత ఆసక్తికరంగా మార్చాయి. అందులో ప్రధాని నరేంద్ర మోడీ గురించి చెడుగా అమిత్ షా ఏమీ చెప్పలేదని తాను స్పష్టత ఇవ్వాలనుకుంటున్నట్లుగా పేర్కొన్నారు. ప్రధాని మోడీ అంటే అమిత్ షాకు చాలా గౌరవమని మాలిక్ పేర్కొన్నారు. తన ఆందోళనను అర్థం చేసుకుంటామని మాత్రమే అమిత్ షా చెప్పినట్లుగా సత్యపాల్ మాలిక్ పేర్కొన్నట్లుగా చెబుతున్నారు. ఇదంతా చూసినప్పుడు.. మోడీకి చెక్ పెట్టటానికి ఎవరెవరో అక్కర్లేదు.. సీనియర్ నేత కమ్ మేఘాలయ గవర్నర్ గా వ్యవహరిస్తున్న సత్యాపాల్ మాలిక్ ఒక్కరు సరిపోతుందన్న భావన కలుగక మానదు. తనతాజా మాటలతో మోడీ ఇమేజ్ ను దారుణంగా దెబ్బ తీయటమే కాదు.. మొత్తంగా ముంచేసే అస్త్రాలు ఇతడి బుర్రలో మరెన్ని ఉన్నాయన్న సందేహం కలుగక మానదు. తాజా ఎపిసోడ్ నేపథ్యంలో.. సత్యపాల్ కు గవర్నర్ గిరి నుంచి స్థాన చలనం కలుగుతుందా? లేదా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.