Begin typing your search above and press return to search.

ఆ ఎంపీ బావమరిది అక్కడ ఫిక్స్...?

By:  Tupaki Desk   |   12 Jan 2022 12:30 AM GMT
ఆ ఎంపీ బావమరిది అక్కడ ఫిక్స్...?
X
రాజకీయాల్లో బంధాలు అనుబంధాలు బహు గట్టివి. ఇవన్నీ ఫ్యామిలీ ప్యాకేజీల లాంటివి. గతంలో ఒకరికి టికెట్ ఇచ్చేవారు. వారే పార్టీని అట్టిపెట్టుకుని ఉండేవారు. రాను రాను ఫ్యామిలీస్ కూడా పాలిటిక్స్ లో అతి కీలకం అయిపోతున్నాయి. విశాఖ జిల్లా నుంచి చూసుకుంటే మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి వారసుడికి ఈసారి టికెట్ ఖాయమని అంటున్నారు. పెందుర్తి నుంచి ఆయన 2014 ఎన్నికల్లో గెలిచారు. అంతకు ముందు పరవాడగా ఆ సీటు ఉంటే అనేక దఫాలు అక్కడ నుంచి గెలిచి ఒక పర్యాయం మంత్రిగా కూడా చేశారు.

ఇక 2014 ఎన్నికల తరువాత బండారు మంత్రి పదవిని ఆశించిన చంద్రబాబు ఇవ్వలేదు. దాంతో ఆయన కొన్నాళ్ళు అలక పూనారు కూడా. అయితే 2019 ఎన్నికల నాటికి ఆయనకు టికెట్ దక్కదని అంతా అనుకున్నారు. కానీ ఎర్రన్నాయుడు ఫ్యామిలీతో వియ్యం ఉండడం చేత ఆయన వైపే బాబు మొగ్గు చూపాల్సి వచ్చింది. అలా టికెట్ తెచ్చుకున్నా ముప్పయి వేల పై చిలుకు భారీ తేడాతో బండారు ఓడిపోయారు.

ఇక రాజకీయాలకు స్వస్తి అని ఆయన అనేస్తున్నారుట. తన వారసుడిగా కుమారుడు బండారు అప్పలనాయుడుని 2024 ఎన్నికల్లో బరిలో దింపుతారని టాక్ నడుస్తోంది. దానికి తగినట్లుగా యువ నేత నియోజకవర్గంలో జోరు పెంచేస్తున్నారు. ఇన్నాళ్ళూ ఆయనకు టికెట్ దక్కుతుందా లేదా అన్న డౌట్స్ అనుచరులలో ఉండేవి. ఎందుకంటే ఇదే నియోజకవర్గం నుంచి టికెట్ కోసం మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ కూడా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన కూడా బలమైన క్యాడర్ ఉన్న నేత కావడం విశేషం.

అయితే తాజాగా పార్టీలో జరిగిన మార్పులతో ఆయన విశాఖ సౌత్ కి ఇంచార్జిగా వెళ్లారు. దాంతో బండారు అప్పలనాయుడుకు పోటీ లేకుండా పోయింది. ఈ రకంగా కధ సాగడం వెనక కింజరాపు ఫ్యామిలీ ఉందని అంటున్నారు. బండారు అప్పలనాయుడు శ్రీకాకుళం జిల్లా ఎంపీ రామ్మోహన్ నాయుడుకు స్వయాన బావమరిది. దాంతో బావ జాగ్రత్తగా పెందుర్తి సీటు బండారు ఫ్యామిలీ చేజారకుండా కాపాడారు అంటున్నారు.

ఈ మధ్యనే పెళ్ళి చేసుకుని ఒక ఇంటివాడు అయిన అప్పలనాయుడు గతంలో ఉన్న దూకుడుని తగ్గించి సిసలైన ప్రజానాయకుడిగా మారుతున్నారు. వైసీపీ మీద వ్యతిరేకత ఉందని, దాంతో పాటు టీడీపీకి పెందుర్తిలో ఉన్న గట్టి ఓటు బ్యాంక్ తో అప్పలనాయుడు ఈసారి ఎమ్మెల్యేగా గెలుస్తారు అని తమ్ముళ్ళు చెబుతున్నారు. బండారు సత్యనారాయణమూర్తి సైతం తన కుమారుడిని ఎమ్మెల్యేగా చూడాలని తపన పడుతున్నారు. మొత్తానికి చూసుకుంటే తండ్రులను పక్కన పెట్టి తనయులను తీసుకురావడం కొత్త రక్తం అంటోంది అధినాయకత్వం. మరి ఈ ప్రయోగం చాలా చోట్ల చేసేందుకు కూడా పార్టీ రెడీగా ఉందిత. మరి ఎంత మంది రాజకీయ వారసులు ఈసారి ఎన్నికల్లో టీడీపీ నుంచి బరిలో ఉంటారో చూడాల్సిందే.