Begin typing your search above and press return to search.

తెలంగాణ‌ రాజ‌కీయాల్లో పాల‌మూరు నేత‌ల డామినేష‌న్‌...!

By:  Tupaki Desk   |   11 Jan 2022 12:30 PM GMT
తెలంగాణ‌ రాజ‌కీయాల్లో పాల‌మూరు నేత‌ల డామినేష‌న్‌...!
X
తెలంగాణ రాజ‌కీయాల్లో ఉమ్మ‌డి మ‌హ‌బూబ్ న‌గ‌ర్ నేత‌ల జోరు కొన‌సాగుతోంది. రాష్ట్ర రాజ‌కీయాల‌పై పాల‌మూరు నేత‌ల హ‌వా స్ప‌ష్టంగా క‌న‌ప‌డుతోంది. ఆయా పార్టీల త‌ర‌పున ప్రాతినిథ్యం వ‌హిస్తున్న ప‌లువురు ముఖ్యులు ఉమ్మ‌డి జిల్లా వాసులు కావ‌డంతో ప్ర‌జ‌ల్లో హ‌ర్షాతిరేకాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఈ జోరు ఇలాగే కొన‌సాగించాల‌ని.. మ‌రిన్ని ప‌ద‌వుల‌తో జిల్లాకు మ‌రింత వ‌న్నె తేవాల‌ని ప్ర‌జ‌లు కోరుకుంటున్నారు.

పీసీసీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న రేవంత్ రెడ్డికి పార్టీ అధిష్ఠానం అధ్య‌క్ష బాధ్య‌త‌లు క‌ట్ట‌బెట్టింది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో తెలంగాణ‌లో ఎలాగైనా అధికారంలోకి రావాల‌ని ఆదేశించింది. అధిష్ఠానం అప్ప‌గించిన బాధ్య‌త‌ల‌ను, ఆదేశాల‌ను స్వీక‌రించిన రేవంత్ అదే ప‌నిలో ముందుకు వెళుతున్నారు. తొలుత పార్టీ సీనియ‌ర్ల ఆశీర్వాదాలు తీసుకున్న రేవంత్ వ‌రుస స‌భ‌లు, ప‌ర్య‌ట‌న‌లు, ర్యాలీలు, పాద‌యాత్ర‌లు చేప‌డుతూ శ్రేణుల్లో జోష్ నింపుతున్నారు. పార్టీలో కొంద‌రి సీనియ‌ర్ల మ‌ద్ద‌తు క‌రువైనా ల‌క్ష్యం దిశ‌గా సాగిపోతున్నారు.

గురుకుల కార్య‌ద‌ర్శిగా ప‌ని చేసిన‌ ప్ర‌వీణ్ కుమార్ బీఎస్పీలో చేరి ఆ పార్టీ రాష్ట్ర కోఆర్డినేట‌ర్ ప‌ద‌వి ద‌క్కించుకున్నారు. ఐపీఎస్ హోదాలో గురుకులాల్లో ఎన్నో సంస్క‌ర‌ణ‌లు తీసుకొచ్చిన ప్ర‌వీణ్ కుమార్ రాజ‌కీయాల్లో కూడా త‌న‌దైన ముద్ర వేస్తున్నారు. వ‌రుస ప‌ర్య‌ట‌న‌లతో బ‌హుజ‌నుల‌ను బ‌ల‌హీన వ‌ర్గాల‌ను ఏకం చేస్తున్నారు. జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే బ‌క్క‌ని న‌ర్సింలుకు జాక్‌పాట్ ద‌క్కింది. ఎల్ ర‌మ‌ణ టీటీడీపీ అధ్య‌క్ష ప‌ద‌వికి రాజీనామా చేసి టీఆర్ఎస్ లో చేర‌డంతో ఆ ప‌ద‌విని చంద్ర‌బాబు న‌ర్సింలుకు అప్ప‌గించారు. ఆయ‌న కూడా జిల్లాల్లో వ‌రుస ప‌ర్య‌ట‌న‌లు చేప‌డుతూ పార్టీకి పూర్వ‌వైభ‌వం కోసం కృషి చేస్తున్నారు.

రెండేళ్ల క్రితం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరిన మాజీ మంత్రి డీకే అరుణకు పార్టీ అధిష్ఠానం స‌ముచిత ప్ర‌యారిటీ ఇచ్చింది. పార్టీలో చేరిన కొద్ది నెల‌లకే జాతీయ ఉపాధ్య‌క్ష ప‌ద‌విని అప్ప‌గించింది. అలాగే.. టీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన మాజీ ఎంపీ జితేంద‌ర్ రెడ్డిని ఆ పార్టీ జాతీయ కార్య‌వ‌ర్గ స‌భ్యుడిగా నియ‌మించింది. రాష్ట్ర స్థాయిలో ముఖ్య‌మైన ఎన్నిక‌ల మేనేజ్‌మెంట్ బాధ్య‌త‌లు ప‌ర్య‌వేక్షిస్తున్నారు. వీరిద్ద‌రూ త‌మ ప‌ద‌వుల‌కు వ‌న్నె తెచ్చి తెలంగాణ‌లో పార్టీ బ‌లోపేతం కోసం శ్ర‌మిస్తున్నారు.

పై నేత‌లంతా ప్ర‌తిప‌క్షాల్లో ఉండి ఆయా పార్టీల్లో కీల‌కంగా ప‌ని చేస్తుంటే.. అధికార టీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా ఇద్ద‌రు మంత్రులు ముఖ్య భూమిక పోషిస్తున్నారు. రాష్ట్రంలో ఉద్యోగులు, అధికారుల‌ను స‌మ‌న్వ‌యం చేసే బాధ్య‌త‌ల‌ను మాజీ ఉన్న‌తాధికారి అయ‌న మంత్రి శ్రీ‌నివాస్ గౌడ్ కి అప్ప‌గించింది గులాబీ పార్టీ. మంత్రి నిరంజ‌న్ రెడ్డికి కీల‌క‌మైన‌ వ్య‌వ‌సాయ శాఖ‌ను అప్ప‌గించింది. వీరిద్ద‌రూ కూడా ప్ర‌భుత్వంలో, పార్టీలో కీల‌క పాత్ర వ‌హిస్తున్నారు. అలాగే ప్ర‌భుత్వ విప్‌గా గువ్వ‌ల బాల‌రాజు కీల‌క పాత్ర పోషిస్తున్నారు. ఇలా రాష్ట్ర రాజ‌కీయాల్లో పాల‌మూరు నేత‌ల ఆధిప‌త్యం కొన‌సాగుతోంది. ఇది శుభ‌ప‌రిణామంగా జిల్లా ప్ర‌జ‌లు చ‌ర్చించుకుంటున్నారు.