Begin typing your search above and press return to search.

రాత్రి కర్ఫ్యూ నుంచి వీకెండ్ కర్ఫ్యూ దిశగా అడుగులు.

By:  Tupaki Desk   |   5 Jan 2022 5:37 AM GMT
రాత్రి కర్ఫ్యూ నుంచి వీకెండ్ కర్ఫ్యూ దిశగా అడుగులు.
X
మొన్నటివరకు విదేశాలకు పరిమితమైన మూడో వేవ్.. మన దేశాన్ని టచ్ చేసింది.దేశ వ్యాప్తంగా కేసుల నమోదులో చోటు చేసుకుంటున్న మార్పుల్ని చూస్తే.. ఈ విషయం ఇట్టే అర్థమైపోతుంది. దీనికి తగ్గట్లే.. ఇప్పటికే దేశంలోని పలు రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూలను విధిస్తున్నారు. కేరళ.. పంజాబ్.. ఢిల్లీతో సహా పలు రాష్ట్రాల్లో రాత్రి వేళ కర్ఫ్యూను విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇలాంటివేళ.. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఎలాంటి మార్పులు చోటు చేసుకోవటం లేదు.

గడిచిన వారంలో చూస్తే.. కరోనా కేసుల నమోదులో మార్పు కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది. ఇక.. దేశంలోని వివిధ రాష్ట్రాల్ని చూసినప్పుడు కరోనా కేసులతో పాలు.. ఒమిక్రాన్ వేరియంట్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ రాష్ట్ర సర్కారు కీలక నిర్ణయాన్ని తీసుకుంది. అంతకంతకూ విస్తరిస్తున్న మూడో వేవ్ నేపథ్యంలో కేసులు పెరిగిపోతున్న వేళ.. వారాంతాల్లో (శని.. ఆదివారాలు) కర్ఫ్యూ విధించాలని నిర్ణయించారు. బెంగళూరులోనూ 2 వారాల పాటు వీకెండ్ కర్ఫ్యూను విధించాలని నిర్ణయించారు.

అంతేకాదు.. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వర్కు ఫ్రం హోం ఇచ్చినట్లుగా ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా వెల్లడించారు. అదే సమయంలో బస్సులు.. మెట్రో రైళ్లు వందశాతం సామర్థ్యంతో పని చేయనున్నాయి.మరోవైపు పంజాబ్ లో రాత్రి పూట కర్ఫ్యూ విధించారు. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా విద్యా సంస్థల్ని మూసివేశారు. సినిమా థియేటర్లు.. రెస్టారెంట్లను 50 శాతం సామర్థ్యంతో నిర్వహించాలని పేర్కొన్నారు.

యూపీలో జనవరి 15 వరకు విద్యా సంస్థల్ని మూసివేశారు. ఇలా.. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటుంటే.. రెండుతెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఎలాంటి చర్యల్ని తీసుకోవటం లేదు. రెండు రోజుల క్రితం తెలంగాణలో మాత్రం విద్యా సంస్థల సెలవుల్నిఒక రోజు ముందుకు (శని,ఆదివారాల్ని పరిగణలోకి తీసుకుంటే) తీసుకొచ్చారు. అంతకు మించి ఎలాంటి చర్యలు లేవు. కేసులు పెరుగుతున్న వేళ.. మిగిలినరాష్ట్రాల్లో మాదిరి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్న మాట వినిపిస్తోంది.