Begin typing your search above and press return to search.

టిక్కెట్టు రేటు.. ఈ మీటింగ్ ఏదీ తేల్చ‌లేదు!

By:  Tupaki Desk   |   11 Jan 2022 11:44 AM GMT
టిక్కెట్టు రేటు.. ఈ మీటింగ్ ఏదీ తేల్చ‌లేదు!
X
ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం టిక్కెట్టు రేట్ల‌ను పెంచేందుకు అంగీక‌రించిందా? ప్ర‌భుత్వం నియ‌మించిన‌ క‌మిటీ నేటి స‌మావేశంలో ఏం తేల్చింది? ఇప్ప‌టికే స‌మావేశం ముగిసింది కాబట్టి స‌హ‌జంగా సినీగోయ‌ర్స్ కి ఇండ‌స్ట్రీ స‌ర్కిల్స్ కి క‌లిగే సందేహ‌మిది.

అయితే ఈ స‌మావేశంలో ఏదీ తేల‌లేదు. మ‌రో స‌మావేశంలో టిక్కెట్ ధ‌ర‌ల్ని ఫైన‌ల్ చేస్తారు. ఆ త‌ర్వాత ప్ర‌భుత్వం అధికారికంగా ఉత్త‌ర్వును జారీ చేయ‌నుంద‌ని తెలిసింది. నేటి స‌మావేశంలో ఏం మాట్లాడారు? అంటే.. ఇక్క‌డ సినీగోయెర్స్ ప్ర‌తినిధులు స‌హా ఎగ్జిబిట‌ర్లు.. నిర్మాత‌లు ఇత‌రులు త‌మ అభిప్రాయాల్ని చెప్పారు. క‌మిటీ వీటిని స‌మీక్షించింది.

క‌మిటీ స‌భ్యురాలు ల‌క్ష్మి మాట్లాడుతూ..``జీవో 35 ప్ర‌కార‌మే టికెట్ ధ‌ర‌లు ఉండాలి! అలాగే థియేట‌ర్ల‌లో మౌళిక వ‌స‌తుల క‌ల్ప‌న‌ను మ‌రింత మెరుగుప‌ర‌చాలి. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో టికెట్ ధ‌ర‌ల్ని పెంచాలి`` అని తెలిపామ‌న్నారు.

ఎగ్జిబిట‌ర్ల త‌ర‌పున ప్ర‌తినిధులు మాట్లాడుతూ .. గ్రామీణ ప్రాంతాల్లో టికెట్ల ధ‌ర‌లు పెంచాలి. పంచాయితీ ప‌రిధిలో థియేట‌ర్ల‌కు క‌రెంట్ బిల్లులు క‌ట్టేందుకైనా చాల‌వ‌ని అన్నారు. రేట్ల త‌గ్గింపు వ‌ల్ల రాష్ట్రంలో 200 పైగా థియేట‌ర్లు మూత‌ప‌డ్డాయ‌ని ఎగ్జిబిట‌ర్ల సంఘం త‌ర‌పున బాల‌ర‌త్నం వెల్లడించారు.

బీసీ కేంద్రాల్లో టికెట్ ధ‌ర‌లు మారాల్సి ఉంద‌ని.. థియేట‌ర్ల‌కు అగ్నిమాప‌క నిబంధ‌న‌ల‌పైనా చ‌ర్చించామ‌ని నిర్మాత కం పంపిణీదారు ముత్యాల రాందాస్ తెలిపారు. వ‌చ్చే స‌మావేశంలో టికెట్ ధ‌ర‌ల‌పై తుది నిర్ణ‌యం వెలువ‌డుతుంద‌ని ఆయ‌న‌ అన్నారు.

అలాగే థియేట‌ర్ల‌లో సౌక‌ర్యాల పెంపుపైనా ఫిర్యాదులు అందాయని తెలిసింది. జాయింట్ క‌లెక్ట‌ర్ల నివేదిక‌పైనా క‌మిటీ చ‌ర్చించింది. ఏఏ ఏరియాల్లో థియేట‌ర్ల‌లో రేట్ల‌ను పెంచాలి? అన్న‌ది చ‌ర్చించారు. త‌దుప‌రి స‌మావేశంలోనే టికెట్ ధ‌ర‌ల్ని నిర్ణ‌యిస్తారు! ఆ త‌ర్వాతే ప్ర‌భుత్వ ఉత్త‌ర్వు జారీ చేస్తారు.

బ్లాక్ మార్కెట్ ని ఎలా ఆప‌గ‌లం?- సెన్సార్ స‌భ్యులు.. సీనియ‌ర్ క్రిటిక్ ఓం

టికెట్ ధ‌ర‌ల్ని పెంచాలా.. త‌గ్గించాలా? అన్న‌దానిపై సీనియర్ ఫిలింక్రిటిక్.. సెన్సార్ స‌భ్యులు ఓం ప్ర‌కాష్‌ త‌న అభిప్రాయం వెల్ల‌డించారు. ఎగ్జిబిట‌ర్స్ కి ఉండే స‌మ‌స్య‌లేమిటి? జ‌నాలు మ‌ళ్లీ మ‌ళ్లీ థియేట‌ర్ల‌కు రావాలంటే ఏం చేయాలి? అన్న‌ది ఆలోచించాల‌ని క్రిటిక్ ఓం ప్ర‌కాష్‌ సూచించారు. అమెజాన్ ప్రైమ్ - ఆహా వంటి ఓటీటీ వేదిక‌ల‌పై సినిమా చూసినా కానీ థియేట‌ర్ల‌లోనే సినిమా చూసేందుకు ఆడియ‌న్ ఆస‌క్తిని క‌న‌బ‌రుస్తున్నారు. థియేట‌ర్ల‌ను ర‌క్షించుకోవాల్సిన అవ‌స‌రం ఉంది. థియేట్రిక‌ల్ ఫీల్ ని జ‌నం కోరుకుంటున్నారు. అందుకే టిక్కెట్ రేట్లు వీలైనంత త‌క్కువ‌గా ఉండ‌డం స‌బ‌బు .. బ్లాక్ మార్కెట్ ని దీనివ‌ల్ల అరిక‌ట్ట‌వ‌చ్చ‌ని సెన్సార్ బోర్డ్ స‌భ్యుడు ఓం అభిప్రాయ‌ప‌డ్డారు