Begin typing your search above and press return to search.

అంతుప‌ట్ట‌ని కొండా ఆంత‌రంగం..!

By:  Tupaki Desk   |   12 Jan 2022 12:30 AM GMT
అంతుప‌ట్ట‌ని కొండా ఆంత‌రంగం..!
X
మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వ‌ర్ రెడ్డి ఆంత‌రంగం అంతుచిక్క‌డం లేదు. ఆయ‌న ఏ పార్టీలో ఉన్నారో.. ఏ పార్టీకి మ‌ద్ద‌తు తెలుపుతున్నారో గంద‌ర‌గోళంగా ఉంది. ఆయ‌న న‌డ‌వ‌డిక.. ఆయ‌న తీసుకుంటున్న నిర్ణ‌యాలు రాజ‌కీయ విశ్లేష‌కుల‌కు కూడా ప‌జిల్‌గా మారాయ‌ట‌. త‌మ నేత ఇలా ఎందుకు ప్ర‌వ‌ర్తిస్తున్నాడో అర్థం కావ‌డం లేద‌ని ఆయ‌న అనుచ‌రులు కూడా చ‌ర్చించుకుంటున్నార‌ట‌.

ఈ గంద‌ర‌గోళానికి కార‌ణం ఆయ‌న తాజాగా కాంగ్రెస్ దీక్షా శిబిరంలో ప్ర‌త్య‌క్షం కావ‌డ‌మేన‌ట‌. కొండా విశ్వేశ్వ‌ర్ రెడ్డి 2014లో టీఆర్ఎస్ లో చేరి చేవెళ్ల నుంచి ఎంపీగా గెలుపొందారు. త‌ద‌నంత‌రం కేసీఆర్ తో పొస‌గ‌క పార్టీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చారు. 2019లో కాంగ్రెస్ పార్టీలో చేరి చేవెళ్ల నుంచి ఎంపీగా పోటీ చేశారు. త‌న స‌మీప ప్ర‌త్య‌ర్థి, టీఆర్ఎస్ అభ్య‌ర్థి రంజిత్ రెడ్డి చేతిలో స్వ‌ల్ప తేడాలో ఓట‌మి పాల‌య్యారు.

ఇక అప్ప‌టి నుంచి కాంగ్రెస్ పార్టీకి అంటీముట్ట‌న‌ట్లుగానే వ్య‌వ‌హ‌రిస్తున్నారు. పార్టీ తీసుకుంటున్న నిర్ణ‌యాలు న‌చ్చ‌క‌పోవ‌డంతో సంవ‌త్స‌రం క్రితం రాజీనామా చేశారు. రేవంత్ రెడ్డి అనుచ‌రుడిగా గుర్తింపు పొందిన కొండా.. రేవంత్ టీపీసీసీ అధ్య‌క్ష ప‌ద‌వి చేప‌ట్టాక పార్టీలోకి తిరిగి వ‌స్తార‌ని చాలా మంది భావించారు. కానీ ఆయ‌న ఇప్ప‌టికీ దూరంగానే ఉన్నారు. బీజేపీలో చేర‌తార‌ని ఊహాగానాలు వినిపించినా ఆ పార్టీకి దూరం వ‌హిస్తూ వ‌స్తున్నారు.

కానీ, ఇటీవ‌ల హుజూరాబాద్ ఉప ఎన్నిక‌ల స‌మ‌యంలో బీజేపీ అభ్య‌ర్థి ఈటెల రాజేంద‌ర్ కు మ‌ద్ద‌తు తెలిపారు. ఆయ‌న గెలుపు కోసం ప‌ని చేశారు. ప్ర‌తి ఊరు తిరిగి ఈటెల గెలుపులో భాగం పంచుకున్నారు. ఈటెల టీఆర్ఎస్ లో ఉన్న‌ప్పుడు చేవెళ్ల‌లో త‌న ఓట‌మికి ప‌ని చేసినా కూడా కొండా అవేమీ ప‌ట్టించుకోకుండా ఈటెల‌కు స్నేహ హ‌స్తం అందించారు. ఆ స‌మ‌యంలోనే ఈటెల‌తో పాటు విశ్వేశ్వ‌ర్ రెడ్డి కూడా బీజేపీలో చేర‌తార‌ని అనుకున్నారు. కానీ బీజేపీకి కూడా స‌మ దూరం పాటించి కేవ‌లం ఈటెల గెలుపు కోసం మాత్ర‌మే ప‌ని చేశారు.

ఆ త‌ర్వాత రేవంత్ గ‌న్‌పార్కు వ‌ద్ద దీక్ష చేప‌ట్టిన‌ప్పుడు అక్క‌డికి వ‌చ్చి మ‌ద్ద‌తు తెలిపారు. కానీ తిరిగి కాంగ్రెస్ లో మాత్రం చేర‌లేదు. తాజాగా ప‌రిగిలో కాంగ్రెస్ దీక్షా శిబిరంలో పాల్గొని అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచారు. 317 జీవో ర‌ద్దు కోసం వికారాబాద్‌ డీసీసీ అధ్య‌క్షుడు టి. రామ్మోహ‌న్ రెడ్డి ఒక రోజు దీక్ష నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మంలో కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌లు పాల్గొన్నారు. మాజీ మంత్రి ప్ర‌సాద్ కుమార్‌, పీసీసీ ఉపాధ్య‌క్షుడు ర‌మేశ్ త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు. వీరితో పాటు కొండా విశ్వేశ్వ‌ర్ రెడ్డి కూడా పాల్గొని కార్య‌క‌ర్త‌ల్లో ఉత్సాహం నింపారు. కానీ, అధికారికంగా కాంగ్రెస్ లో మాత్రం చేరలేదు. రాబోయే రోజుల్లో ఆయన అడుగులు ఎటువైపు వెళతాయో వేచి చూడాలి.