Begin typing your search above and press return to search.

ఏపీకి రాబోతున్న కంపెనీల గురించి ఎవరూ మాట్లాడటం లేదా?

By:  Tupaki Desk   |   5 Jan 2022 7:30 AM GMT
ఏపీకి రాబోతున్న కంపెనీల గురించి ఎవరూ మాట్లాడటం లేదా?
X
ఏపీ అన్నంతనే ఆరాచకపు పాలనకు కేరాఫ్ అడ్రస్ గా ఒక వర్గం విరుచుకుపడితే.. మరో వర్గం అందుకు భిన్నంగా తమకు మించిన తోపు సర్కారు మరొకటి లేదంటూ ఆకాశానికి ఎత్తేసే ప్రయత్నం చేస్తుంటుంది. అంతే తప్పించి.. వాస్తవాన్ని వాస్తవంగా చెప్పే ప్రయత్నం చాలావరకు జరగటం లేదు. నాణెనికి బొమ్మ.. బొరుసు ఎలా ఉంటుందో.. ఏపీ ప్రభుత్వం చేస్తున్న తప్పుల మాటనే.. జరుగుతున్న డెవలప్ మెంట్ కూడా ఉందన్న విషయాన్ని ఒప్పుకోవాల్సిన అవసరం ఉంది. మావాడు చేస్తే మహాకార్యం.. మీవాడు చేస్తే దండగ వ్యవహారం లాంటి మైండ్ సెట్ ను పక్కన పెట్టి.. మంచి చేస్తే మంచి.. చెడు చేస్తే చెడు అన్నట్లుగా చెప్పాల్సిన వస్తే..ఏపీకి వస్తున్న.. రాబోతున్న కంపెనీలు.. భారీ పెట్టుబడుల గురించి కూడా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది.

ఏపీలో తాము రూ600 కోట్ల పెట్టుబడులు పెట్టాలని అనుకున్నామని.. ముఖ్యమంత్రి జగన్ తో భేటీ జరిగాక తమిళనాడులో పెట్టానుకున్న పెట్టుబడులకు బదులుగా ఏపీలో రూ.2600 కోట్లకు పెట్టుబడిని పెంచినట్లుగా సెంచరీ ఫ్లైవుడ్ సంస్థ చెప్పిన మాటల్ని కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. కడప జిల్లా కొప్పర్తిలో ‘‘ఏఐఎల్ డిక్సన్’ సంస్థ ఒకటి భారీగా రాబోతుంది. ఇక.. కియా కార్ల కంపెనీ విషయానికి వస్తే జగన్ ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత.. ఆ సంస్థ ఏపీని విడిచి పెట్టి వెళ్లిపోతుందని ప్రచారం చేసినా.. అందుకు భిన్నంగా రూ.400 కోట్ల అదనపు పెట్టుబడి పెట్టిన వైనం పెద్దగా హైలెట్ కాలేదు.

ఈ మధ్యనే నెల్లూరు జిల్లా శ్రీసిటీలో సుమారు రూ.1500 కోట్లు విలువ చేసే ఏసీ తయారీ ప్లాంట్లను రెండు ప్రముఖ సంస్థలు నెలకొల్పేలా ప్లానింగ్ మొదలైంది. పులివెందులలోఆదిత్య బిర్లా గ్రూపు ఆధ్వర్యంలో ఫ్యాషన్ డిజైన్ సంస్థ రానుంది. మునైటెడ్ టెలిలింక్ సంస్థ మౌలిక వసతులపై రూ.1500 కోట్లు.. మొబైల్స్ తయారీకి రూ.600కోట్లు.. సర్ ఫార్మా అధినేత దిలీప్ షాంగ్వి ఏపీలో భారీ యూనిట్ ఏర్పాటుకు ఓకే చేయటం తెలిసిందే. సీఎం జగన్ తో భేటీ అనంతరం సర్ ఫార్మా అధినేత మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి ఆలోచనా ధోరణి నచ్చినట్లుగా చెప్పటం గమనార్హం.

వీటితో పాటు ఇప్పటికే ప్రకటన వచ్చిన ఆదానీ డేటా సెంటర్ కార్యరూపం దాలిస్తే ఏపీ ప్రజలకు ప్రయోజనం కలుగుతుంది. జపాన్ కు చెందిన యొకహోమా గ్రూపు కంపెనీ భారీ వాహనాల టైర్ల తయారీ యూనిట్ ను ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపటం తెలిసిందే. విశాఖ లోని అచ్యుతాపురం సెజ్ లో సుమారు రూ.1250 కోట్లతో యూనిట్ ను రాష్ట్రానికి రాబోతోంది. ఇది కాస్తా ఇప్పుడు రూ.2500 కోట్లకు పెరగనుంది. ఇలా జగన్ ప్రభుత్వంలోనూ కొత్త సంస్థలు.. పరిశ్రమలు వస్తుండటం.. పెట్టుబడులు పెడుతున్న నిజాన్ని ఒప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.