Begin typing your search above and press return to search.

నీతులు చెప్పడానికే-ప్రదీప్ వైరల్ వీడియో

By:  Tupaki Desk   |   2 Jan 2018 12:47 PM GMT
నీతులు చెప్పడానికే-ప్రదీప్ వైరల్ వీడియో
X
పెద్దవాళ్ళు సామెతలు ఊరికే చెప్పరు. ప్రతిదానికి ఒక అర్థం పరమార్థం ఉంటుంది. వాళ్ళు ఎప్పుడో జమానా కాలంలో చెప్పినా అవి ఇప్పటి పరిస్థితులకు అనుగుణంగా కూడా ఉండటం ఆశ్చర్యం కలిగించే విషయమే. నీతులు చెప్పడానికే పాటించడానికి కాదు, చెప్పేవి శ్రీరంగ నీతులు దూరేవి దొమ్మరి గుడిసెలు లాంటివి ఇక్కడ గుర్తు చేసుకోవాల్సి వస్తోంది. ఈ ఉపోద్ఘాతం అంతా ఎందుకు అనుకుంటున్నారా. మొన్న అర్ధరాత్రి న్యూ ఇయర్ సందర్భంగా చేపట్టిన డ్రంక్ అండ్ డ్రైవ్ లో యాంకర్ ప్రదీప్ పట్టుబడిన విషయం ఎంత సంచలనం రేపిందో చూస్తూనే ఉన్నాం. బ్రీత్ అనలైజర్ లో రీడింగ్ 170 దాటడం మహా మహా తాగుబోతులను కూడా ఆశ్చర్య పరచింది. సామాన్యుడైనా, సెలబ్రిటీ అయినా రూల్స్ రూల్సే. పాటించే తీరాలి. ఇక్కడ ప్రదీప్ కాబట్టి ఇంత హంగామా జరుగుతోంది అంటున్న వాళ్ళు కూడా ఒక్కసారి ఆలోచించుకుంటే సపోర్ట్ చేయటం కరెక్ట్ అవునా కదా అనేది అర్థమవుతుంది.

ఇక ప్రదీప్ గతంలో తాగుడు వద్దు మానండి అంటూ ప్రత్యేకంగా మాట్లాడిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం చక్కర్లు కొడుతోంది. అందులో ప్రదీప్ మాట్లాడినవన్ని మంచి విషయాలే అయినా ఇప్పుడు దొరికిపోయాక చూస్తే మాత్రం నవ్వు రాక మానదు. ఇంటి దగ్గర ఫ్యామిలీ ఎదురు చూస్తూ ఉంటుందని, తాగి బండి నడపడం వల్ల విలువైన ప్రాణాలు పణంగా పెట్టిన వాళ్ళం అవుతాం అని చెప్పిన ప్రదీప్ అసలు తాగుడు అనేది సొసైటీలో లేకుండా చేయాలి అని పిలుపు ఇవ్వడం మరో ట్విస్ట్. సామాజానికి ఇదొక భూతం అని ప్రదీప్ చెప్పిన వీడియో పాతది కాదు. జస్ట్ ఏడు నెలల క్రితం జూలైలో తీసిందే. దీన్ని ఇప్పుడు షేర్ చేసుకుంటూ అప్పుడు అన్ని మాటలు నీతులు చెప్పిన ప్రదీప్ ఇప్పుడు ఏమైందని తాగుతున్నావ్ కాస్త చెప్పు బాబు అని నెటిజెన్లు నిలదీస్తున్నారు. తాము తీసిన గోతిలో తామే పడటం అంటే ఏమో ప్రదీప్ కు తెలిసి వచ్చినట్టు ఉంది.