Begin typing your search above and press return to search.

దీక్షకు ఆ పరుపు.. అంత భారీ దిండ్ల సెటప్ ఏంది షర్మిలమ్మ?

By:  Tupaki Desk   |   27 July 2021 1:30 PM GMT
దీక్షకు ఆ పరుపు.. అంత భారీ దిండ్ల సెటప్ ఏంది షర్మిలమ్మ?
X
ఎంత కాలం మారితే మాత్రం.. బేసిక్స్ మాత్రం మారవు కదా? ఆ చిన్న విషయాన్ని మిస్ అయితే జరిగే నష్టం అంతా ఇంతా కాదు. తాజాగా తెలంగాణ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన వైఎస్ షర్మిల వ్యవహారం ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఆమె ఎంత సీరియస్ గా కేసీఆర్.. కేటీఆర్ ల మీద కామెంట్లు చేసినా.. పెద్దగా ప్రయోజనం కనిపించట్లేదంటున్నారు. ఈ మధ్యన మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసిన సందర్భంగా.. కేటీఆర్ గురించి అడిగిన ప్రశ్నకు.. 'కేటీఆరా? ఎవరు' అంటూ ఆమె వేసిన ప్రశ్న పేలటం తర్వాత.. రివర్సులో ఆమెకే పంచ్ పడింది. కేటీఆర్ ఎవరు? అన్న ప్రశ్నకు సోషల్ మీడియా వెనువెంటనే.. ఏపీలో ఎన్నికల ప్రచారం సందర్భంగా లోకేశ్ పై విమర్శలు సంధించేందుకు కేటీఆర్ గురించి చెప్పిన వీడియో క్లిప్ ను జత చేసి.. పంచ్ లతో ఉతికి ఆరేశారు.

ఇలా ఆమె చేసే ప్రతి ప్రయత్నం ఎక్కడో అక్కడ భారీగా దెబ్బేస్తోంది. తాజాగా ఆమె నల్గొండ జిల్లాలో దీక్ష చేపట్టారు. యువతకు ఉద్యోగాలు ఇచ్చే విషయంలో కేసీఆర్ సర్కారు వ్యవహరిస్తున్న ధోరణిని తీవ్రంగా తప్పు పడుతున్న ఆమె తాజా దీక్షతో ప్రభుత్వం మీద విమర్శలు చేసే ప్రయత్నానికి తెర తీశారు. ఇటీవల ఉద్యోగం రాక.. మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్న పాక శ్రీకాంత్ కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం ఆమె దీక్షను షురూ చేశారు.

సాధారణంగా దీక్ష అన్నంతనే.. వీలైనంత సింఫుల్ గా ఏర్పాట్లు చేస్తారు. ఎందుకంటే ప్రజా జీవితంలో ఉన్నప్పుడు హంగు.. ఆర్భాటాల కంటే కూడా సింపుల్ సిటీకి ప్రాధాన్యత ఇస్తారు.అలాంటిది.. షర్మిల దీక్ష కోసం ఏర్పాటు చేసిన సెటప్ చూస్తే దిమ్మ తిరిగి పోవాల్సిందే. ప్రత్యర్థులు విమర్శలు చేయటానికి.. వేలెత్తి చూపించేందుకు వీలుగా ఆమె పరివారం ఏర్పాట్లను చేసిందని చెప్పాలి. ఎక్కువ మందంగా ఉన్న పరుపు.. దాని మీద తెల్లటి దుప్పటి పరవటం వరకు ఓకే. ఇక్కడే తేడా కొట్టేసింది.

పురుపు మధ్యలో భారీ ఎత్తున దిండ్లు.. రెండుచేతులు ఆనించేందుకు వీలుగా ఏర్పాటు చేసిన బూస్టర్లు చూసినంతనే పెద్ద సింహాసానాన్ని పరుపు మధ్యలో ఏర్పాటు చేసినట్లుగా ఉంది. ప్రజా సమస్యల మీద పోరాడే వేళ.. ఇంత విలాసంగా దీక్ష చేయటమా? అన్నది ప్రశ్నగా మారింది. సింహాసనం లాంటి దిండ్ల సెటప్ లో కూర్చొని కేసీఆర్ దొరతనం గురించి ఎంత విమర్శిస్తే మాత్రం ప్రజల మెదళ్లలోకి వెళుతుందా? అన్నది ప్రశ్న.

ఉదయం మొదలు పెట్టిన దీక్ష సాయంత్రం ఐదు గంటల వరకు సాగేలా ప్లాన్ చేశారు. అంటే.. దాదాపు ఏడెనిమిది గంటలు. ఆ మాత్రం సమయం కూర్చోవటానికి ఇబ్బందిగా ఉంటే..దాన్ని పంటి బిగువున భరించేలా తప్పించి.. ఇంత ఆడంబరంగా ఏర్పాట్లు చేసుకుంటే మొదటికే మోసం వస్తుందన్న పాయింట్ ను షర్మిల పరివారం ఆమెకు సూచన చేయలేదా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. దీక్షకు రోజు ముందు సీఎం కేసీఆర్ ను ఉద్దేశించి ఘాటు ట్వీట్ చేశారు.

ఇంతకూ ట్వీట్ సారాంశం ఏమిటన్నది చూస్తే.. 'అవ్వ పెట్టది అడక్కు తిననీయది అన్నట్టే ఉంది కేసీఆర్ దొర తీరు ..రాష్ట్రంలో కురిసిన అకాల వర్షాలకు ఐదు లక్షల ఎకరాలలో పంటలను నష్టపోయారు రైతులు. ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన పథకం నుంచి గత సంవత్సరం తప్పుకున్న రాష్ట్రప్రభుత్వం.. సొంత పంటల బీమా పాలసీని తీసుకొస్తాం అని గొప్పగా చెప్పిన ఇంతవరకు తీసుకురాలేదు.. దీనితో రైతులకు అటు కేంద్రం బీమా వర్తించక.. ఇటు రాష్ట్ర బీమా దిక్కులేక .. రైతు కష్టాలు పడుతున్నడు .. నష్టాల పాలౌతున్నడు. ఇప్పుడైనా మేలుకోండి సీఎం సారు' అని ఎద్దేవా చేశారు. ట్వీట్ లో కనిపించిన సీరియస్ నెస్.. దీక్ష వేళ.. ఆమె కూర్చున్న సెటప్ చూసినంతనే అదంతా దిగిపోవటమే కాదు.. ఇదెక్కడి రాజరికం బాసూ అన్న భావన కలుగక మానదు.