Begin typing your search above and press return to search.

పొగ‌డ‌టం కూడా నేర్పాలంటే క‌ష్ట‌మే చినబాబు!

By:  Tupaki Desk   |   13 May 2019 8:59 AM GMT
పొగ‌డ‌టం కూడా నేర్పాలంటే క‌ష్ట‌మే చినబాబు!
X
అంద‌రూ కేసీఆర్.. కేటీఆర్ మాదిరో.. హ‌రీశ్ త‌ర‌హాలోనో.. ప్ర‌ధాని మోడీ స్టైల్లోనూ మాట్లాడ‌టం సాధ్యంకాక‌పోవ‌చ్చు. నోరు విప్పినంతనే మంత్ర‌ముగ్దుల్ని చేసేలా మాట్లాడ‌టం ఒక అర్ట్‌. అది అంద‌రికి రాదు. అలా రాన‌ప్పుడు లోపాన్ని క‌వ‌ర్ చేసుకునేలా ఆచితూచి మాట్లాడ‌టం చేయాలి. ముక్త‌స‌రిగా మాట్లాడ‌టం ద్వారా.. త‌మ లోపాన్ని క‌ప్పిపుచ్చే వీలుంది. లేదంటే.. బాగా మాట్లాడ‌టానికి వీలుగా ఏర్పాట్లు అయినా చేసుకోవాలి.

ఐదేళ్ల ప‌ద‌వీ కాలంలో అలాంటి ప‌నులేమీ చేయ‌ని మంత్రి లోకేశ్‌.. నోరు విప్పి నాలుగు మాటలు మాట్లాడిన మ‌రుక్ష‌ణం టీవీల్లోనూ.. యూట్యూబ్ ఛాన‌ళ్ల‌లో.. ఆయ‌న మాట‌ల మీద వార్త‌లు ప్ర‌సార‌మ‌య్యే ప‌రిస్థితి. ఇక‌.. సోష‌ల్ మీడియాలో ఆయ‌న మీద వ‌చ్చే ఎట‌కారాలు మామూలుగా ఉండ‌వు. ఈ నేప‌థ్యంలో లోకేశ్ మాట్లాడ‌టం కంటే కూడా.. ట్వీట్ల రూపంలో పోస్టులు పెడితే మంచిద‌న్న అభిప్రాయం ఉంది.

తాజాగా లోకేశ్ బాబు పెట్టిన ట్వీట్లు చూస్తే.. ట్వీట్లు పెట్టే విష‌యంలోనూ ఇలాంటి ప‌రిస్థితా? అన్న భావ‌న క‌లుగ‌క మాన‌దు. సాంకేతిక దినోత్స‌వం సంద‌ర్భంగా ఏపీని త‌న తండ్రి చంద్ర‌బాబు సాంకేతికంగా ఎంత అభివృద్ధి చేశారో తెలుసా అని చెప్పే విష‌యానికి ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు కామెడీగా మారిపోయాయి. ఆయ‌న ట్వీట్ల‌పై నెటిజ‌న్లు పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు.

ఇంత‌కీ లోకేశ్ చేసిన ఆణిముత్యాల్లాంటి ట్వీట్లు చూస్తే..

+ ఈరోజు జాతీయ సాంకేతికతా దినోత్సవం. శాస్త్ర, సాంకేతికత ఫలాలను సామాన్యుల జీవితాల్లోకి తీసుకువెళ్ళాలన్న చంద్రబాబుగారి ఆకాంక్షలకు అనుగుణంగా గత ఐదేళ్ళలో ప్రభుత్వ శాఖలన్నింటా సాంకేతిక వినియోగాన్ని ప్రవేశపెట్టి ప్రజలకు అత్యుత్తమ సేవలు అందించడం జరిగింది.

+ ఇవిగాక ఫిన్ టెక్, బ్లాక్ చైన్, డేటా సెంటర్ వంటి అధునాతన సాంకేతికతను అందించే పరిశ్రమలను ఏపీకి తేవడం జరిగింది. మారుమూల ప్రాంతాలకు సైతం ఇంటర్నెట్ అందించే ఫైబర్ గ్రిడ్ ఒక విప్లవాత్మక ప్రాజెక్టు.

+ సామాన్యులు ఎదుర్కునే సమస్యలకు శాశ్వత పరిష్కార మార్గాలు చూపినప్పుడే సాంకేతికతకు సార్థకత. అందుకే చంద్రబాబుగారు పౌర సరఫరాల శాఖ నుంచి వ్యవసాయ రంగం వరకు సాంకేతిక వినియోగాన్ని పెంచారు.

ఇలా ట్వీట్లతో త‌న తండ్రి గొప్ప‌తనాన్ని తెగ పొగిడేసిన లోకేశ్ మాట‌ల‌పై పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు. కాలానుగుణంగా సాంకేతిక‌త పెరుగుతుంటే అంతా చంద్ర‌బాబు వ‌ల్లే చెప్తారా? అంటూ ఫైర్ అవుతున్న తీరు చూస్తే.. మాట్లాడ‌ట‌మే కాదు.. ట్వీట్లు పెట్టే విష‌యంలోనూ ప్ర‌జ‌ల మ‌న‌సుల్ని దోచుకోలేక‌పోవ‌టం ఏమిటి లోకేశా అనిపించ‌క మాన‌దు. తండ్రిని పొగిడే విష‌యంలో ప్ర‌జ‌ల మ‌న‌సుల్ని గెలుచుకునేలా ఉండాల‌న్న చిన్న విష‌యం కూడా ప్ర‌త్యేకంగా చెప్పించుకోవాల్సిన ప‌రిస్థితి రావ‌టం ఏమిటి చిన‌బాబు?