Begin typing your search above and press return to search.

కన్వీన్స్ చేయాల్సిన చోటు ఈ పీకుడు మాటలేంది మంత్రివర్యా?

By:  Tupaki Desk   |   6 Dec 2021 2:21 AM GMT
కన్వీన్స్ చేయాల్సిన చోటు ఈ పీకుడు మాటలేంది మంత్రివర్యా?
X
కత్తి మొన దించినట్లుగా ఉంటే సూటి ప్రశ్నలకు కీలక స్థానాల్లో ఉండే రాజకీయ నేతలు ఇచ్చే సమాధానం ఎలా ఉండాలి? అయితే కామెడీ చేయాలి.. లేదంటే తమను ప్రశ్నించే వారిని ఎటకారం చేసేలా ఉండాలి. నిజానికి ఈ రెండింటి కంటే కూడా.. సూటిగా.. స్పష్టంగా.. తన వాదన విన్నంతనే కన్వీన్స్ అయ్యేలా సమాధానం చెప్పటం అన్నింటికంటే మంచి పద్దతి. కానీ.. ఇవేమీ కాకుండా.. ఏం పీక్కుంటావో పీక్కో లాంటి మాటలతో కలిగే ప్రయోజనం కంటే కూడా రచ్చే ఎక్కువ అవుతుందన్న విషయాన్ని ఏపీ మంత్రి అనిల్ ఎప్పుడు గుర్తిస్తారో అర్థం కావట్లేదు.

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆప్తుడిగా.. ఫైర్ బ్రాండ్ రాజకీయ నేతగా.. రాజకీయ ప్రత్యర్థులకు తన మాటలతో.. పంచ్ లతో చుక్కలు చూపించే ఆయన.. తాజాగా పోలవరం ఎపిసోడ్ లో మాత్రం సెల్ఫ్ గోల్ చేసుకున్నారని చెప్పాలి. అసెంబ్లీ సాక్షిగా డిసెంబరు 2021 నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని బల్ల గుద్ది మరీ కాన్ఫిడెంట్ గా చెప్పిన ఆయన.. తీరా ఆయన చెప్పిన టైం వచ్చిన తర్వాత సరైన సమాధానం చెప్పకుండా.. నోటికి వచ్చినట్లు మాట్లాడటం ఎంతవరకు సబబు? అన్నదిప్పుడు ప్రశ్న.

దూకుడుగా బదులివ్వటం అన్ని సందర్భాలకు సూట్ కాదన్న సత్యాన్ని మంత్రి అనిల్ ఎప్పుడు తెలుసుకుంటారు? ప్రత్యర్థుల మీద దూకుడుతనాన్ని ప్రజలు ఇష్టపడొచ్చు. కానీ.. తమకు మేలు చేసే అంశాల విషయంలో మాత్రం సమాధానం శాంతంగా.. తనను ప్రశ్నించే వారిని కన్వీన్స్ అయ్యేలా ఉండాలే తప్పించి.. అనవసరమైన ఆవేశాన్ని ప్రదర్శిస్తే మొదటికే మోసం రావటం ఖాయమన్న విషయాన్ని అనిల్ గుర్తిస్తే మంచిది.

ఆయన నోటి నుంచి వచ్చే మాటలతో జరిగే డ్యామేజ్.. ఆయనకు మాత్రమే పరిమితం కాదన్న విషయాన్ని ఆయన గుర్తించనట్లుగా కనిపిస్తోంది.పోలవరం ప్రాజెక్టు పూర్తి గురించి అంతలా మాట్లాడి.. తీరా పనులే జరగని విషయానికి.. అందరూ ఆమోదించే సమాధానం అవసరం.

కేంద్రం సహకారం సరిగా లేదని కానీ.. కరోనా కానీ.. విపత్తులు లాంటివి చెప్పటం బాగుంటుంది. అంతేతప్పించి.. టీడీపీ ఆర్మీనో.. వేరేవారో తమను టార్గెట్ చేశారన్న వాదనను వినిపిస్తే.. ప్రజలు కన్వీన్స్ అవుతారనుకోవటం తప్పే అవుతుంది. కఠినంగా ఉండే క్వశ్చన్లు రాజకీయ నేతలకు తరచూ ఎదురవుతుంటాయి. అలాంటి వేళ.. వాటికి తెలివిగా సమాధానాలు చెప్పాలే తప్పించి..ఆవేశం తప్పించి.. ఆలోచన లేనట్లుగా వ్యవహరించటం మంత్రి అనిల్ కు ఎదురుదెబ్బగా చెప్పక తప్పదు. ఇలాంటి తప్పుల్ని సరిదిద్దుకునేలా ప్రైవేటు క్లాసులు చెప్పాల్సిన బాధ్యత పార్టీ పెద్దల మీద ఉందన్నది మర్చిపోకూడదు.