Begin typing your search above and press return to search.

ఒకసారి ఓడిపోతే మళ్లీ పోటీ చేయకూడదా కేసీఆర్?

By:  Tupaki Desk   |   31 March 2021 11:30 AM GMT
ఒకసారి ఓడిపోతే మళ్లీ పోటీ చేయకూడదా కేసీఆర్?
X
నీతులు ఏమైనా సరే చెప్పేందుకే ఉంటాయి తప్పించి ఆచరించేందుకు కాదు. ఆ విషయం తాజాగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మాటల్ని వింటే ఇట్టే అర్థమవుతాయి. ప్రస్తుతం సారు ఫోకస్ మొత్తం నాగార్జున సాగర్ ఉప ఎన్నిక మీదనే ఉంది. దుబ్బాక.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎదురైన ఎదురుదెబ్బల వేళ.. తన తీరును తాను సమీక్షించుకున్నారో ఏమో కానీ.. కేసీఆర్ తీరులో మార్పు ఇటీవలకాలంలో కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. గతానికి భిన్నంగా ఆయన వ్యవహరశైలి ఉంటోంది. ఈ మధ్యనే వెల్లడైన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ఇందుకు నిదర్శనం.

దుబ్బాక.. జీహెచ్ఎంసీ ఎన్నికల సమయాల్లో కేసీఆర్ అనుసరించిన విధానానికి భిన్నమైన ఎత్తుగడను రెండు ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుసరించారు. విజయాన్నిసొంతం చేసుకున్నారు. దీంతో.. విపక్షాల మీద పైచేయి సాధించటానికి ఏమేం చేయాలన్న అంశంపై కేసీఆర్ కు ఒక క్లారిటీ వచ్చినట్లుగా కనిపిస్తోంది. తన దూకుడును సాగర్ ఉప ఎన్నికల్లోనూ ప్రదర్శించాలని ఆయన భావిస్తున్నారు.

తాజాగా తమ అభ్యర్థిగా దివంగత ఎమ్మెల్యే నోముల నర్సయ్య కుమారుడ్ని బరిలోకి దింపిన వేళ.. కాంగ్రెస్ మాత్రం తన అభ్యర్థిగా సీనియర్ నేత జానారెడ్డిని ఎన్నికల బరిలోకి దింపింది. వాస్తవానికి జానాతో పోలిస్తే.. మిగిలిన అభ్యర్థులు ఎవరూ కూడా ఆయనకుసాటి కాదు కదా.. ఆయన దరిదాపుల్లోకి రాలేరు. ఈ విషయం కేసీఆర్ కు తెలియంది కాదు. అందుకే.. ఆయన తన వాదనను సరికొత్తగా వినిపిస్తున్నారు.

గత ఎన్నికల్లో ప్రజలు ఓడించిన తర్వాత ఏ ముఖం పెట్టుకొని జానా మళ్లీ పోటీ చేస్తారంటూ చిత్రమైన వాదనను తెర మీదకుతీసుకొచ్చారు. జానారెడ్డిని సాగర్ లో ప్రలు తిరస్కరించారని.. అయినా పోటీకి వచ్చారని.. మరోసారి పరాభవం ఖాయమని తేల్చారు. ఒకవేళ.. కేసీఆర్ వాదనే నిజమని అనుకుందాం. లోక్ సభ ఎన్నికల్లో నిజామాబాద్ ఎంపీ స్థానానికి కేసీఆర్ కుమార్తె కవిత బరిలో నిలిచి.. దారుణ పరాభావాన్నిచవిచూశారు. మరి.. ఆమెకు ఏ అర్హతతో.. రెండేళ్లు గడిచేసరికి పరోక్ష పద్దతిలో సాగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిలిపి.. ఎమ్మెల్సీని చేశారు? అన్నది ప్రశ్న.

ఉద్యమ వేళలో కానీ.. ఇతర సందర్భాల్లో కానీ కీలకం అనిపించిన ప్రతిసారీ సలహాలు.. సంప్రదింపుల కోసం ఏ జానా రెడ్డి ఇంటికి వెళ్లి ఆయన సాయాన్ని అడిగారో.. ఇప్పుడు అదే జానారెడ్డికి మరోసారి పరాభవం తప్పదన్న మాటను మొహమాటం లేకుండా చెప్పే కేసీఆర్ లాంటి అధినేతల్ని చూసినప్పుడు.. రాజకీయాలు ఎంత కరకుగా ఉంటాయన్న విషయం అర్థం కాక మానదు. ఇంతకీ.. జానాకు వర్తించే రూల్.. కవితకు వర్తించదా కేసీఆర్? అన్న ప్రశ్నకు ఏమని బదులిస్తారో?